
సింగపూర్: సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు తేజం పీవీ సింధు సెమీస్‌లోకి ప్రవేశించింది. శుక‍్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 21-13, 17-21, 21-14 తేడాతో యాన్యాన్(చైనా)పై విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. తొలి గేమ్‌ను సింధు అవలీలగా గెలవగా, రెండో గేమ్‌లో యాన్యాన్ పుంజుకుంది. ఫలితంగా రెండో గేమ్‌లో సింధుకు ఓటమి తప్పలేదు. కాగా, నిర్ణయాత‍్మక మూడో గేమ్‌లో సింధు జోరును కొనసాగించింది.
మూడో గేమ్‌లో తన జోరును కొనసాగించిన సింధు వరుసగా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఇదే ఊపును కడవరకూ కొనసాగించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఇక మరో మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమి పాలైంది. సైనా నెహ్వాల్ 8-21, 13-21 తేడాతో ఒకుహరా(జపాన్) చేతిలో పరాజయం చవిచూసింది. ఏ దశలోనూ ఒకుహరాకు పోటీ ఇవ్వని సైనా నెహ్వాల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం జరుగనున్న సెమీ ఫైనల్లో పీవీ సింధుతో ఒకుహరా తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment