సైలెంట్ కిల్లర్!
2013 జూన్ తొలి వారంలో థాయ్‌లాండ్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ హఫీజ్ (మలేసియా)పై గెలుపు... రెండో వారంలో ఇండోనేసియా సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీలో దిగ్గజం తౌఫిక్ హిదాయత్‌పై అతని వీడ్కోలు మ్యాచ్‌లో సంచలన విజయం... మూడో వారంలో సింగపూర్ ఓపెన్‌లో అప్పటి ప్రపంచ నాలుగో ర్యాంకర్ హు యున్ (హాంకాంగ్)పై గెలుపు... 20 ఏళ్ల ప్రాయంలోనే ఇలా ఒకే నెలలో ముగ్గురు మేటి స్టార్‌లపై అద్భుత విజయాలు సాధించిన సాయిప్రణీత్ భారత బ్యాడ్మింటన్‌కు భావితారగా కనిపించాడు. ఆ తర్వాత సైనా నెహ్వాల్, సింధు, శ్రీకాంత్‌ల నీడలో అతని ప్రదర్శనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.
2015లో ఈ హైదరాబాద్ ప్లేయర్ మళ్లీ సత్తా చాటి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ ఏడాది బంగ్లాదేశ్, లాగోస్, శ్రీలంక ఓపెన్ టోర్నీలలో టైటిల్స్ సాధించాడు. 2016 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో మలేసియా దిగ్గజం లీ చోంగ్ వీని తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టించాడు. ఆ తర్వాత కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీలో విజేతగా నిలిచి తనలో మేటి క్రీడాకారుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయని సాయిప్రణీత్ నిరూపించాడు. ఈ ఏడాది జనవరిలో సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన అతను భుజం గాయం కారణంగా నెలరోజులపాటు ఆటకు దూరమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకున్నాక తీవ్ర సాధన చేసి పూర్తి ఫిట్‌నెస్‌ను సంతరించుకున్నాడు. తాజాగా సింగపూర్ ఓపెన్‌లో సాయిప్రణీత్ కోర్టులో ఏకంగా 5 గంటలు గడపడం... మూడు గేమ్‌లపాటు సాగిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించడం అతని ఫిట్‌నెస్ స్థాయిని సూచిస్తోంది. చిన్న చిన్న బలహీనతలను అధిగమించడంతో పాటు మానసికంగా ఇంకా దృఢత్వాన్ని సంపాదించడం... కీలక సమయంలో ఒత్తిడిని తట్టుకోవడం వంటి పలు అంశాల్లో సాయిప్రణీత్ మెరుగవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఓఎన్‌జీసీలో హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ హోదాలో పని చేస్తున్న 24 ఏళ్ల సాయి కెరీర్‌కు తాజా విజయం కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో సందేహం లేదు. – సాక్షి క్రీడావిభాగం