సింగపూర్ ఓపెన్‌కు సైనా దూరం
సింగపూర్: రెండు నెలలుగా తీరిక లేకుండా టోర్నీలు ఆడుతున్న భారత బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ సైనా నెహ్వాల్ కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటోంది. దీంతో రేపటి (బుధవారం) నుంచి 12 వరకు జరిగే సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. గత నెల సైనా బిజీబిజీగా గడిపింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ ఆ తర్వాత వెంటనే మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్‌లో పాల్గొంది. ‘మార్చి నెల నాకు తీరికలేకుండా గడిచిపోయింది. మూడు టోర్నీలు ఆడితే రెండింట్లో ఫైనల్స్‌కు వచ్చి ఒకటి గెలిచాను. అయితే నా శరీరానికి అధిక శ్రమను పెట్టదలచుకోలేదు. ఈ ఏడాది నాకు చాలా ముఖ్యమైంది. అందుకే ఓ వారం పాటు విశ్రాంతి తీసుకుని ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆడాలనుకుంటున్నాను’ అని 25 ఏళ్ల సైనా తెలిపింది. మరోవైపు గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పీవీ సింధు కూడా సింగపూర్ ఓపెన్ ఆడటం లేదు. ఆమె కూడా ఈనెల 21 నుంచి 26 వరకు జరిగే ఆసియా బ్యాడ్మింటన్‌లోనే ఆడబోతోంది.
సైనా, సింధు గైర్హాజరీతో కిడాంబి శ్రీకాంత్‌పై భారత అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. గత నెలలో స్విస్ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచి ఊపు మీదున్న అతను తొలి రౌండ్‌లో వియత్నాంకు చెందిన తియెన్ మిన్హ్ గుయెన్‌తో తలపడనున్నాడు. గతేడాది ఇదే టోర్నీలో ఇదే ప్రత్యర్థిని 22 ఏళ్ల శ్రీకాంత్ ఓడించాడు. ఇక పారుపల్లి కశ్యప్ కొరియా ఆటగాడు లీ హుయాన్ ఇల్‌ను ఎదుర్కోనున్నాడు. గతంలో ఈ ప్రత్యర్థిపై నాలుగు సార్లు తలపడితే కశ్యప్‌కు మూడు సార్లు ఓటమే ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి పీసీ తులసి ఒక్కరే తలపడనుంది. డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడి తమ సత్తాను ప్రదర్శించనున్నారు. మంగళవారం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి.