Indian badminton star Saina Nehwal
-
క్వార్టర్స్‌లో సైనా పరాజయం
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ పారిస్: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన తర్వాత పాల్గొన్న మూడో టోర్నమెంట్లోనూ భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. జపాన్ ఓపెన్‌లో, డెన్మార్క్ ఓపెన్‌లో రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టిన ఈ హైదరాబాద్ అమ్మాయి తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సైనా 9-21, 15-21తో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. కశ్యప్ రెండు నెలలు దూరం మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో పారుపల్లి కశ్యప్, ప్రణయ్, అజయ్ జయరామ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్)తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ స్కోరు 11-21, 21-13. 2-4 వద్ద గాయం కారణంగా వైదొలిగాడు. కాలి పిక్కలో గాయం కారణంగా కశ్యప్ రెండు నెలలపాటు ఆటకు దూరమయ్యాడు. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 15-21, 8-21తో ఎన్జి కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో, అజయ్ జయరామ్ 18-21, 8-21తో తియాన్ హువీ (చైనా) చేతిలో ఓటమి చవిచూశారు. -
ఏడు రోజుల ముచ్చట!
మళ్లీ రెండో ర్యాంక్‌కు సైనా న్యూఢిల్లీ : గత వారం ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. గురువారం తాజాగా ప్రకటించిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె రెండో స్థానానికి పడిపోయింది. మలేసియా ఓపెన్ సెమీఫైనల్లో ఓడిపోవడంతో సైనా తన ర్యాంకింగ్ పాయింట్లు కోల్పోయింది. ఫలితంగా నంబర్‌వన్ స్థానం ఒక వారానికే పరిమితమైంది. సైనాను ఓడించిన లీ జురుయ్ (చైనా) ఇప్పుడు అగ్రస్థానం అందుకుంది. మరో భారత క్రీడాకారిణి పీవీ సింధు తన 9వ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా... పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ కూడా 4వ స్థానంలోనే కొనసాగుతున్నాడు. హెచ్ఎస్ ప్రణయ్ (14) ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేకపోగా, పారుపల్లి కశ్యప్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 15వ స్థానంలో నిలిచాడు. మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని జోడి ఒక స్థానం మెరుగుపర్చుకొని 18వ ర్యాంక్‌లో నిలిచింది. -
సింగపూర్ ఓపెన్‌కు సైనా దూరం
సింగపూర్: రెండు నెలలుగా తీరిక లేకుండా టోర్నీలు ఆడుతున్న భారత బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ సైనా నెహ్వాల్ కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటోంది. దీంతో రేపటి (బుధవారం) నుంచి 12 వరకు జరిగే సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. గత నెల సైనా బిజీబిజీగా గడిపింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ ఆ తర్వాత వెంటనే మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్‌లో పాల్గొంది. ‘మార్చి నెల నాకు తీరికలేకుండా గడిచిపోయింది. మూడు టోర్నీలు ఆడితే రెండింట్లో ఫైనల్స్‌కు వచ్చి ఒకటి గెలిచాను. అయితే నా శరీరానికి అధిక శ్రమను పెట్టదలచుకోలేదు. ఈ ఏడాది నాకు చాలా ముఖ్యమైంది. అందుకే ఓ వారం పాటు విశ్రాంతి తీసుకుని ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆడాలనుకుంటున్నాను’ అని 25 ఏళ్ల సైనా తెలిపింది. మరోవైపు గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పీవీ సింధు కూడా సింగపూర్ ఓపెన్ ఆడటం లేదు. ఆమె కూడా ఈనెల 21 నుంచి 26 వరకు జరిగే ఆసియా బ్యాడ్మింటన్‌లోనే ఆడబోతోంది. సైనా, సింధు గైర్హాజరీతో కిడాంబి శ్రీకాంత్‌పై భారత అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. గత నెలలో స్విస్ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచి ఊపు మీదున్న అతను తొలి రౌండ్లో వియత్నాంకు చెందిన తియెన్ మిన్హ్ గుయెన్‌తో తలపడనున్నాడు. గతేడాది ఇదే టోర్నీలో ఇదే ప్రత్యర్థిని 22 ఏళ్ల శ్రీకాంత్ ఓడించాడు. ఇక పారుపల్లి కశ్యప్ కొరియా ఆటగాడు లీ హుయాన్ ఇల్‌ను ఎదుర్కోనున్నాడు. గతంలో ఈ ప్రత్యర్థిపై నాలుగు సార్లు తలపడితే కశ్యప్‌కు మూడు సార్లు ఓటమే ఎదురైంది. మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి పీసీ తులసి ఒక్కరే తలపడనుంది. డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జోడి తమ సత్తాను ప్రదర్శించనున్నారు. మంగళవారం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి.