తొలి రౌండ్‌లోనే ఓడిన శ్రీకాంత్, లక్ష్య సేన్
ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి–ట్రెసా జోడీ
సింగపూర్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్‌ఎస్ ప్రణయ్ సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో సింధు 21–12, 22–20తో ప్రపంచ 21వ ర్యాంకర్ లినె హొమార్క్ జార్స్‌ఫెల్ట్ (డెన్మార్క్)పై... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రణయ్ 21–9, 18–21, 21–9తో జూలియన్ కరాగి (బెల్జియం)పై గెలుపొందారు.
భారత్‌కే చెందిన అగ్రశ్రేణి ఆటగాళ్లు లక్ష్య సేన్, కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. లక్ష్య సేన్ 13–21, 21–16, 13–21తో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోగా... కొడాయ్ నరోకా (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి గేమ్‌ను 14–21తో కోల్పోయి రెండో గేమ్‌లో 3–11తో వెనుకబడ్డాడు.
ఈ దశలో మోకాలి గాయంతో శ్రీకాంత్ వైదొలిగాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు; కెంటా నిషిమోటో (జపాన్)తో ప్రణయ్ తలపడతారు. ముఖాముఖి రికార్డులో సింధు 5–11తో, ప్రణయ్ 2–3తో వెనుకబడి ఉన్నారు.
అశ్విని–తనీషా జోడీ ఓటమి
పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ ఈ టోర్నీలో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. పొలీనా బురోవా–యెవెనియా (ఉక్రెయిన్) జంటతో జరిగిన మ్యాచ్‌లో అశ్విని–తనీషా ద్వయం 21–18, 19–21, 19–21తో ఓడిపోయింది.
పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట 21–7, 21–14తో చెంగ్ యు పె–సన్ యు సింగ్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో బేక్ హా నా–లీ సో హీ (దక్షిణ కొరియా)లతో గాయత్రి–ట్రెసా పోటీపడతారు.
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి–సిక్కి రెడ్డి (భారత్) జోడీ 18–21, 19–21తో గో సూన్ హువాట్–లాయ్ షెవోన్ జేమీ (మలేసియా) ద్వయం చేతిలో పోరాడి ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment