సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ అండర్–19 ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో బాలికల సింగిల్స్ విభాగంలో టైటిల్ తెలంగాణ ఖాతాలోనే చేరనుంది. జైపూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్లు పుల్లెల గాయత్రి, సామియా ఇమాద్ ఫరూఖీ ఫైనల్‌కు చేరుకున్నారు. నేడు జరిగే టైటిల్ పోరులో వీరిద్దరూ తలపడనున్నారు. సోమవారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ గాయత్రి (తెలంగాణ) 21–13, 21–10తో నాలుగో సీడ్ కవిప్రియ (పాండిచ్చేరి)పై గెలుపొందగా... ఏడో సీడ్ సామియా (తెలంగాణ) 21–13, 18–21, 23–21తో ఆరో సీడ్ మాన్సి సింగ్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించారు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో గాయత్రి 21–15, 23–21తో స్మిత్ తోష్నివాల్ (మహారాష్ట్ర)పై, సామియా ఇమాద్ ఫరూఖీ 19–21, 21–10, 21–17తో రెండో సీడ్ ఉన్నతి బిష్త్ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించారు.
బాలుర సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారుల పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. బాలుర సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో తొమ్మిదో సీడ్ తరుణ్ 16–21, 21–16, 13–21తో ఎనిమిదో సీడ్ సాయి చరణ్ (ఆంధ్రప్రదేశ్) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో సాయి చరణ్ 17–21, 21–10, 19–21తో నాలుగో సీడ్ ఆకాశ్ యాదవ్ (ఢిల్లీ) చేతిలో పరాజ యం చవిచూశాడు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ జోడీ నవనీత్– సాహితి టైటిల్‌పోరుకు సిద్ధమైంది. సెమీస్‌లో నవనీత్–సాహితి ద్వయం 21–15, 21–15తో బల్కేశ్వరీ యాదవ్ (ఉత్తరప్రదేశ్)–శవీ భట్నాగర్ (మధ్యప్రదేశ్) జంటపై గెలుపొందింది. బాలికల డబుల్స్ విభాగంలో సాహితి జంట సెమీస్‌లోనే ఓటమి పాలైంది. రెండో సీడ్ కవిగుప్తా–ఖుషీ గుప్తా (ఢిల్లీ) జంట 21–12, 21–17తో నాలుగో సీడ్ సాహితి–నఫీసా సారా సిరాజ్ జోడీపై నెగ్గి ఫైనల్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment