Samiya
-
సామియాతో గాయత్రి అమీతుమీ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ అండర్–19 ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో బాలికల సింగిల్స్ విభాగంలో టైటిల్ తెలంగాణ ఖాతాలోనే చేరనుంది. జైపూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్లు పుల్లెల గాయత్రి, సామియా ఇమాద్ ఫరూఖీ ఫైనల్‌కు చేరుకున్నారు. నేడు జరిగే టైటిల్ పోరులో వీరిద్దరూ తలపడనున్నారు. సోమవారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ గాయత్రి (తెలంగాణ) 21–13, 21–10తో నాలుగో సీడ్ కవిప్రియ (పాండిచ్చేరి)పై గెలుపొందగా... ఏడో సీడ్ సామియా (తెలంగాణ) 21–13, 18–21, 23–21తో ఆరో సీడ్ మాన్సి సింగ్‌ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించారు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో గాయత్రి 21–15, 23–21తో స్మిత్ తోష్నివాల్ (మహారాష్ట్ర)పై, సామియా ఇమాద్ ఫరూఖీ 19–21, 21–10, 21–17తో రెండో సీడ్ ఉన్నతి బిష్త్ (ఉత్తరాఖండ్)పై విజయం సాధించారు. బాలుర సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారుల పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. బాలుర సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో తొమ్మిదో సీడ్ తరుణ్ 16–21, 21–16, 13–21తో ఎనిమిదో సీడ్ సాయి చరణ్ (ఆంధ్రప్రదేశ్) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో సాయి చరణ్ 17–21, 21–10, 19–21తో నాలుగో సీడ్ ఆకాశ్ యాదవ్ (ఢిల్లీ) చేతిలో పరాజ యం చవిచూశాడు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ జోడీ నవనీత్– సాహితి టైటిల్‌పోరుకు సిద్ధమైంది. సెమీస్‌లో నవనీత్–సాహితి ద్వయం 21–15, 21–15తో బల్కేశ్వరీ యాదవ్ (ఉత్తరప్రదేశ్)–శవీ భట్నాగర్ (మధ్యప్రదేశ్) జంటపై గెలుపొందింది. బాలికల డబుల్స్ విభాగంలో సాహితి జంట సెమీస్‌లోనే ఓటమి పాలైంది. రెండో సీడ్ కవిగుప్తా–ఖుషీ గుప్తా (ఢిల్లీ) జంట 21–12, 21–17తో నాలుగో సీడ్ సాహితి–నఫీసా సారా సిరాజ్ జోడీపై నెగ్గి ఫైనల్‌కు చేరుకుంది. -
ఆసియా చాంప్ సామియా
యాంగూన్ (మయన్మార్): అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై మరో భారత అమ్మాయి మెరిసింది. ఈసారి జూనియర్ విభాగంలో ఆసియాను జయించి మువ్వన్నెల పతాకం రెపరెపలాడించింది. ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన సామియా ఇమాద్ ఫారుఖీ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ఇక్కడ హోరాహోరీగా జరిగిన అండర్–15 మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సామియా (భారత్) 15–21, 21–17, 21–19తో విడ్జజా స్టెఫాని (ఇండోనేసియా)పై నెగ్గి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 56 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో 14 ఏళ్ల సామియా తుదికంటా పట్టుదలగా పోరాడి విజేతగా నిలిచింది. ఇప్పటివరకు ఇదే విభాగం సింగిల్స్‌లో జాతీయ స్థాయిలో ఒక్క పతకాన్ని కూడా గెలవని సామియా ఏకంగా ఆసియా టైటిల్‌ను అందుకొని చరిత్ర సృష్టించింది. కఠినంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలిగేమ్ ఆరంభం నుంచే ఇండోనేసియా ప్రత్యర్థి స్టెఫాని 6–1తో ఆధిక్యం ప్రదర్శించింది. ఇదే జోరులో 21–15తో స్టెఫాని తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో పుంజుకున్న సామియా 6–2తో ప్రత్యర్థిని వెనక్కి నెట్టింది. క్రమం తప్పకుండా పాయింట్లు సాధిస్తూ 13–8తో జోరు ప్రదర్శించింది. ఈ దశలో తేరుకున్న స్టెఫాని వరుసగా 5 పాయింట్లు సాధించి 13–13తో స్కోరును సమం చేసింది. తర్వాత ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా దూకుడుగా ఆడిన సామియా 21–17తో రెండోగేమ్‌ను గెలిచి రేసులో నిలిచింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సామియా వెనుకబడింది. వెంటవెంటనే పాయింట్లు సాధిస్తూ స్టెఫాని 11–7తో ముందంజ వేసింది. ఈ దశలో సంయమనంతో ఆడిన సామియా 12–16తో కొంత తేరుకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా విజృంభించి వరుసగా 4 పాయింట్లు సాధించి 16–16తో స్కోరు సమం చేసింది. ఈ దశలో ఇరువురూ హోరాహోరీగా పోరాడటంతో 18–18 వద్ద మళ్లీ స్కోరు సమమైంది. ఒత్తిడిని జయించిన సామియా వరుసగా రెండు పాయింట్లు సాధించి 20–18తో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత స్టెఫాని ఒక పాయింట్ సాధించడంతో పోరు రసవత్తరంగా మారింది. చివరకు ఎలాంటి తడబాటు లేకుండా సామియా మరో పాయింట్ సాధించి 21–19తో మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ స్వర్ణంతో పాటు 3 కాంస్య పతకాలను సాధించింది. -
ఫైనల్లో సామియా
సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖి అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. మయన్మార్‌లోని యాంగూన్‌లో శనివారం జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ సామియా 21–9, 21–18తో భారత్‌కే చెందిన ఆషి రావత్‌ను ఓడించింది. ఆదివారం జరిగే ఫైనల్లో విద్జాజా స్టెఫానీ (ఇండోనేసియా)తో సామియా తలపడుతుంది. ఇదే టోర్నీ అండర్–17 బాలికల డబుల్స్ సెమీఫైనల్లో మోపాటి కెయూర–సెల్వం కవిప్రియ (భారత్) జంట 13–21, 19–21తో కెల్లీ లారిసా–షెలాండ్రీ వియోలా (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. అండర్–15 బాలుర డబుల్స్ సెమీఫైనల్లో ఆయూష్ రాజ్ గుప్తా–శుభమ్ పటేల్ (భారత్) జంట 19–21, 17–21తో రజీఫ్–జెన్ యి ఓంగ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. సెమీస్‌లో ఓటమితో ఆషి రావత్, కెయూర–కవిప్రియ, ఆయూష్–శుభమ్ కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు. -
సామియా డబుల్ ధమాకా
జాతీయ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్ సాక్షి, విశాఖపట్టణం: తెలంగాణ అమ్మాయి సామియా ఇమద్ ఫారుఖీ జాతీయ సబ్-జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మెరిసింది. ఆమె బాలికల అండర్-13 సింగిల్స్, డబుల్స్‌లో టైటిల్స్ కైవసం చేసుకుంది. అండర్-13 సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సామియా 21-18, 21-12తో నాలుగో సీడ్ కవిప్రియా (పుదుచ్చేరి)పై గెలుపొందింది. డబుల్స్‌లో కవిప్రియాతో కలిసి టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సామియా జోడి 21-16, 21-7తో దుర్వ గుప్తా-ఆశి రావత్ జంటపై నెగ్గింది.