సాక్షి, హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి పుల్లెల గాయత్రి పోరాటం ముగిసింది. చెన్నైలో జరుగుతోన్న ఈ టోర్నీలో శనివారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో గాయత్రి 15–21, 7–21తో ఆషి రావత్ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో గాయత్రి 21–16, 21–11తో ఏడో సీడ్ స్మిత్ తోష్నివాల్ (మహారాష్ట్ర)పై గెలుపొందగా... ఐదో సీడ్ సామియా ఇమాద్ ఫరూఖీ 21–14, 21–16తో పదో సీడ్ కవిప్రియ (పాండిచ్చేరి)ని ఓడించింది. బాలుర క్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్ డి. శరత్ (ఆంధ్రప్రదేశ్) 21–10, 16–21, 12–21తో నాలుగోసీడ్ సతీశ్ కుమార్ (తమిళనాడు) చేతిలో ఓటమి పాలయ్యాడు. మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్ విభాగాల్లో నవనీత్ జోడీకి చుక్కెదురైంది. మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్ సీడ్ నవనీత్–సాహితి ద్వయం 23–25, 21–17, 13–21తో ఇషాన్ భట్నాగర్ (ఛత్తీస్‌గఢ్)–తనీషా క్రాస్టో(గోవా) జంట చేతిలో ఓడిపోయింది.
బాలుర డబుల్స్ క్వార్టర్స్‌లో మూడో సీడ్ నవనీత్ (తెలంగాణ)–ఎడ్విన్ జాయ్ (కేరళ) ద్వయం 14–21, 19–21తో ఐదోసీడ్ యశ్ రైక్వార్ (మధ్యప్రదేశ్)–ఇమాన్ సోనోవాల్ (అస్సాం) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్ ఇషాన్ భట్నాగర్ (ఛత్తీస్‌గఢ్)–విష్ణువర్ధన్‌గౌడ్ (తెలంగాణ) ద్వయం 17–21, 21–8, 21–14తో హరిహరన్–రుబన్ కుమార్ (తమిళనాడు)పై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టగా... ఏడోసీడ్ అచ్యుతాదిత్య (తెలంగాణ)–వెంకట హర్షవర్ధన్ (ఆంధ్రప్రదేశ్) జంట 19–21, 12–21తో టాప్ సీడ్ మంజిత్ సింగ్– డింకూ సింగ్ (మణిపూర్) జోడీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
బాలికల డబుల్స్ క్వార్టర్స్‌లో ఏడో సీడ్ శ్రీవిద్య గురజాడ–సాయి శ్రీయ (తెలంగాణ) జంట 19–21, 12–21తో టాప్ సీడ్ త్రెసా జోలీ (కేరళ)–వర్షిణి (తమిళనాడు) జంట చేతిలో, సాహితి బండి (తెలంగాణ)–ద్రితి (కర్ణాటక) జోడీ 13–21, 16–21తో ఆరోసీడ్ సిమ్రన్–రితిక (మహారాష్ట్ర) జంట చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment