
తల్లి లక్ష్మితో గాయత్రి
సాక్షి, హైదరాబాద్: యోనెక్స్ సన్‌రైజ్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి పుల్లెల గాయత్రి విజేతగా నిలిచింది. కొచ్చిలో జరిగిన ఈ టోర్నీలో గాయత్రి అండర్–19 బాలికల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో గాయత్రి (తెలంగాణ) 11–21, 21–16, 21–14తో నాలుగో సీడ్ అశ్విని భట్ (కర్ణాటక)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో గాయత్రి 21–16, 21–11తో టాప్ సీడ్ మాల్విక బన్సోద్ (మహారాష్ట్ర)కు షాకిచ్చింది. బాలుర సింగిల్స్ విభాగంలో మణిపూర్‌కు చెందిన మైస్నమ్ మీరాబా విజేతగా నిలిచాడు. తుది పోరులో మైస్నమ్ 21–10, 21–7 సిద్ధాంత్ గుప్తా (తమిళనాడు)ను ఓడించాడు.
బాలుర డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కృష్ణ ప్రసాద్ జోడీ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఫైనల్లో రెండో సీడ్ కృష్ణ ప్రసాద్ (ఏపీ)– ధ్రువ్ కపిల (ఎయిరిండియా) జంట 21–15, 21–11తో టాప్ సీడ్ నవనీత్ (తెలంగాణ)–సాయి పవన్ (ఏపీ) జోడీపై గెలుపొందింది. బాలికల డబుల్స్‌లో తమిళనాడు జోడీ నీల–వర్షిణి విజేతగా నిలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీలో ఏపీకి చెందిన సాయి పవన్ జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ పోరులో నాలుగో సీడ్ సాయి పవన్ (ఏపీ)–రియా అరోల్కర్ (మహారాష్ట్ర) జంట 14–21, 15–21తో అక్షన్ శెట్టి–రాశి లాంబే (మహారాష్ట్ర) జోడీ చేతిలో పరాజయం పాలైంది.
Comments
Please login to add a commentAdd a comment