బర్మింగ్‌హామ్: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 17వ ర్యాంక్ జోడీ గాయత్రి–ట్రెసా జాలీ 21–18, 21–14తో ఎనిమిదో ర్యాంక్ జోంగ్‌కోల్ఫోన్ కితితారాకుల్–రవీంద ప్రజోంగ్‌జై (థాయ్‌లాండ్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది.
46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గాయత్రి, ట్రెసా పూర్తి సమన్వయంతో ఆడి ఆద్యంతం తమ ఆధిపత్యం చాటుకున్నారు. గతంలో ఈ థాయ్‌లాండ్ జోడీతో ఆడిన నాలుగుసార్లూ ఓటమి పాలైన గాయత్రి–ట్రెసా ఐదో ప్రయత్నంలో మాత్రం విజయఢంకా మోగించారు. గత ఏడాది ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్ చేరి సంచలనం సృష్టించిన గాయత్రి–ట్రెసా ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ ఫకుషిమా–సయాకా హిరోటా (జపాన్)లతో తలపడతారు.
మళ్లీ తొలి రౌండ్‌లోనే...
ఈ ఏడాది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో టోర్నమెంట్‌లోనూ ఆమె తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 9వ ర్యాంకర్ సింధు 17–21, 11–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ జాంగ్ యి మాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు పలుమార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. తొలి గేమ్‌లో ఒకదశలో సింధు 16–13తో ఆధిక్యంలోకి నిలిచింది.
ఈ దశలో జాంగ్ యి మాన్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు గెలిచింది. 13–16 నుంచి జాంగ్ యి మాన్ 20–16తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం సింధు ఒక పాయింట్ గెలిచినా, ఆ వెంటనే జాంగ్ మరో పాయింట్ నెగ్గి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభంలో ఇద్దరు 5–5తో సమంగా ఉన్నారు.
ఆ తర్వాత సింధు మళ్లీ తడబడి వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత సింధు తేరుకోలేకపోయింది. ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన తన వ్యక్తిగత కోచ్ పార్క్ తే సాంగ్‌తో విడిపోయిన సింధు ఈ ఏడాది మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్ టోర్నీల్లోనూ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. ప్రస్తుతం తనకు ఎవరూ వ్యక్తిగత కోచ్ లేరని, త్వరలోనే కొత్త కోచ్‌ను నియమించుకుంటానని మ్యాచ్ అనంతరం సింధు వ్యాఖ్యానించింది.
శ్రమించిన శ్రీకాంత్
పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోవడానికి కష్టపడ్డాడు. టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 19–21, 21–14, 21–5తో గెలుపొందాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–13, 21–13తో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ (భారత్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
Comments
Please login to add a commentAdd a comment