Indian womens badminton
-
All England Open Championship: గాయత్రి–ట్రెసా జోడీ సంచలనం
బర్మింగ్‌హామ్: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంక్ జోడీ గాయత్రి–ట్రెసా జాలీ 21–18, 21–14తో ఎనిమిదో ర్యాంక్ జోంగ్కోల్ఫోన్ కితితారాకుల్–రవీంద ప్రజోంగ్‌జై (థాయ్‌లాండ్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. 46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గాయత్రి, ట్రెసా పూర్తి సమన్వయంతో ఆడి ఆద్యంతం తమ ఆధిపత్యం చాటుకున్నారు. గతంలో ఈ థాయ్‌లాండ్ జోడీతో ఆడిన నాలుగుసార్లూ ఓటమి పాలైన గాయత్రి–ట్రెసా ఐదో ప్రయత్నంలో మాత్రం విజయఢంకా మోగించారు. గత ఏడాది ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్ చేరి సంచలనం సృష్టించిన గాయత్రి–ట్రెసా ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ ఫకుషిమా–సయాకా హిరోటా (జపాన్)లతో తలపడతారు. మళ్లీ తొలి రౌండ్లోనే... ఈ ఏడాది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో టోర్నమెంట్లోనూ ఆమె తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 9వ ర్యాంకర్ సింధు 17–21, 11–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ జాంగ్ యి మాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు పలుమార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. తొలి గేమ్‌లో ఒకదశలో సింధు 16–13తో ఆధిక్యంలోకి నిలిచింది. ఈ దశలో జాంగ్ యి మాన్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు గెలిచింది. 13–16 నుంచి జాంగ్ యి మాన్ 20–16తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం సింధు ఒక పాయింట్ గెలిచినా, ఆ వెంటనే జాంగ్ మరో పాయింట్ నెగ్గి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభంలో ఇద్దరు 5–5తో సమంగా ఉన్నారు. ఆ తర్వాత సింధు మళ్లీ తడబడి వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత సింధు తేరుకోలేకపోయింది. ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన తన వ్యక్తిగత కోచ్ పార్క్ తే సాంగ్‌తో విడిపోయిన సింధు ఈ ఏడాది మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్ టోర్నీల్లోనూ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ప్రస్తుతం తనకు ఎవరూ వ్యక్తిగత కోచ్ లేరని, త్వరలోనే కొత్త కోచ్‌ను నియమించుకుంటానని మ్యాచ్ అనంతరం సింధు వ్యాఖ్యానించింది. శ్రమించిన శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోవడానికి కష్టపడ్డాడు. టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 19–21, 21–14, 21–5తో గెలుపొందాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–13, 21–13తో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ (భారత్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
మరో పతకమే లక్ష్యంగా...
నేటి నుంచి థామస్-ఉబెర్ కప్ కున్షాన్ (చైనా): క్రితంసారి కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు మరో పతకంపై దృష్టి పెట్టింది. ఆదివారం మొదలయ్యే ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ థామస్ కప్, ఉబెర్ కప్‌లో భారత జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఉబెర్ కప్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు, గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డిలతో కూడిన భారత మహిళల జట్టు సోమవారం జరిగే గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇదే గ్రూప్‌లో జపాన్, జర్మనీ జట్లు కూడా ఉన్నాయి. మరోవైపు థామస్‌కప్‌లో అజయ్ జయరామ్, సాయిప్రణీత్, సౌరభ్ వర్మ, సుమీత్ రెడ్డి, మనూ అత్రిలతో కూడిన పురుషుల జట్టు ఆదివారం జరిగే గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో ఆడుతుంది. గ్రూప్ ‘బి’లో భారత్, థాయ్‌లాండ్‌లతోపాటు ఇండోనేసియా, హాంకాంగ్ జట్లున్నాయి. లీగ్ దశ పోటీలు ముగిశాక నాలుగు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. -
సైనాకు రూ.25 లక్షల నజరానా
న్యూఢిల్లీ : ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... కేంద్రం నుంచి రూ.25 లక్షల నజరానాను అందుకుంది. మార్చిలో జరిగిన ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఏకైక భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సైనా నిలిచింది. ‘అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన ఆటగాళ్లకు, కోచ్‌లకు ప్రత్యేక అవార్డులను ఇచ్చే క్రీడా శాఖ స్కీమ్‌లో భాగంగా సైనాకు ఈ మొత్తం అందనుంది’ అని కేంద్ర క్రీడాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే అంతర్జాతీయ ఈవెంట్స్‌లో రాణించగల సత్తా ఉన్న ఆటగాళ్లందరినీ కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ‘టాప్’ పథకంలో చేర్చాలని సైనా అభిప్రాయపడింది. ‘ర్యాంకింగ్స్ గురించి పట్టించుకోకుండా శాయశక్తులా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడం పైనే నా దృష్టి ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటిదాకా నేనూహించని విధంగా సాగింది’ అని టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సైనా తెలిపింది. -
క్వార్టర్స్‌కు సైనా బృందం
హాంకాంగ్‌పై 4-1తో గెలుపు - సింగిల్స్‌లో సైనా, సింధు, తులసీ విజయం - లీగ్ దశలోనే పురుషుల జట్టు అవుట్ - థామస్, ఉబెర్ కప్ టోర్నీ న్యూఢిల్లీ: స్ఫూర్తిదాయక ఆటతీరుతో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు ఉబెర్ కప్‌లో తమ తొలి లక్ష్యాన్ని సాధించింది. వరుసగా రెండో విజయంతో ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత పొందింది. హాంకాంగ్‌తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘వై’ మ్యాచ్‌లో భారత్ 4-1తో గెలిచింది. తొలి సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 21-9, 21-10తో పుయ్ యిన్ యిప్‌పై నెగ్గి శుభారంభం అందించింది. రెండో మ్యాచ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి 21-17, 21-13తో హోయ్ వా చౌ-లోక్ యాన్ పూన్ జంటను ఓడించింది. మూడో మ్యాచ్‌లో పి.వి.సింధు 21-8, 21-10తో యింగ్ మీ చుయెంగ్పై గెలిచి భారత్‌కు 3-0తో విజయాన్ని ఖాయం చేసింది. నాలుగో మ్యాచ్‌లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జోడి 14-21, 11-21తో సాజ్ కా చాన్-యింగ్ సుయెత్ త్సె జంట చేతిలో ఓడిపోయింది. ఐదో మ్యాచ్‌లో పి.సి.తులసీ 19-21, 21-16, 21-7తో హుంగ్ యుంగ్ చాన్‌పై నెగ్గి భారత ఆధిక్యాన్ని 4-1కి పెంచింది. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ పోటీపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ నెగ్గితే గ్రూప్ ‘వై’లో అగ్రస్థానం పొందుతుంది. ఫలితంగా భారత్‌కు క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థిగా డిఫెండింగ్ చాంపియన్ చైనా బదులు ఇంగ్లండ్ లేదా చైనీస్ తైపీ ఉంటుంది. కశ్యప్, గురుసాయిదత్ నెగ్గినా... మరోవైపు థామస్ కప్‌లో మాత్రం భారత పురుషుల జట్టు పోరాటం లీగ్ దశలోనే ముగిసింది. పారుపల్లి కశ్యప్ నేతృత్వంలోని టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. దక్షిణ కొరియాతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మలేసియాతో ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1-4తో ఓడిన సంగతి విదితమే. నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 18వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ జట్టుకు శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యాడు. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ వాన్ హో సన్తో జరిగిన ఈ పోటీలో శ్రీకాంత్ 21-17, 12-21, 18-21తో ఓడిపోయాడు. వాన్ హో సన్తో గతంలో ఆడిన రెండుసార్లు నెగ్గిన శ్రీకాంత్ సొంతగడ్డపై మాత్రం నిరాశపరిచాడు. డబుల్స్ మ్యాచ్‌లో యోన్ సియోంగ్ యూ-యోంగ్ డే లీ ద్వయం 21-18, 21-17తో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జంటను ఓడించి కొరియాను 2-0తో ఆధిక్యంలో నిలిపింది. అయితే మూడో మ్యాచ్‌లో కశ్యప్ 21-17, 21-14తో లీ డాంగ్ కియోన్‌పై నెగ్గడంతో భారత ఆశలు నిలిచాయి. కానీ నాలుగో మ్యాచ్‌లో కిమ్ సా రంగ్-కిమ్ కీ జంగ్ జోడి 21-16, 21-16తో అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా జంటను ఓడించడంతో కొరియా 3-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో గురుసాయిదత్ 24-22, 21-13తో హవాంగ్ జాంగ్ సూపై నెగ్గినా ఫలితం లేకపోయింది. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో జర్మనీతో భారత్ తలపడుతుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు రెండేసి ఓటములతో నాకౌట్ దశకు అర్హత పొందడంలో విఫలమయ్యాయి. ఇదే గ్రూప్ నుంచి మలేసియా, కొరియా నాకౌట్‌కు చేరుకున్నాయి.