క్వార్టర్స్‌కు సైనా బృందం
హాంకాంగ్‌పై 4-1తో గెలుపు
- సింగిల్స్‌లో సైనా, సింధు, తులసీ విజయం
- లీగ్ దశలోనే పురుషుల జట్టు అవుట్
- థామస్, ఉబెర్ కప్ టోర్నీ
న్యూఢిల్లీ: స్ఫూర్తిదాయక ఆటతీరుతో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు ఉబెర్ కప్‌లో తమ తొలి లక్ష్యాన్ని సాధించింది. వరుసగా రెండో విజయంతో ఈ మెగా ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత పొందింది. హాంకాంగ్‌తో మంగళవారం జరిగిన గ్రూప్ ‘వై’ మ్యాచ్‌లో భారత్ 4-1తో గెలిచింది. తొలి సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ 21-9, 21-10తో పుయ్ యిన్ యిప్‌పై నెగ్గి శుభారంభం అందించింది.
రెండో మ్యాచ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడి 21-17, 21-13తో హోయ్ వా చౌ-లోక్ యాన్ పూన్ జంటను ఓడించింది. మూడో మ్యాచ్‌లో పి.వి.సింధు 21-8, 21-10తో యింగ్ మీ చుయెంగ్‌పై గెలిచి భారత్‌కు 3-0తో విజయాన్ని ఖాయం చేసింది. నాలుగో మ్యాచ్‌లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జోడి 14-21, 11-21తో సాజ్ కా చాన్-యింగ్ సుయెత్ త్సె జంట చేతిలో ఓడిపోయింది. ఐదో మ్యాచ్‌లో పి.సి.తులసీ 19-21, 21-16, 21-7తో హుంగ్ యుంగ్ చాన్‌పై నెగ్గి భారత ఆధిక్యాన్ని 4-1కి పెంచింది.
మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ పోటీపడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ నెగ్గితే గ్రూప్ ‘వై’లో అగ్రస్థానం పొందుతుంది. ఫలితంగా భారత్‌కు క్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థిగా డిఫెండింగ్ చాంపియన్ చైనా బదులు ఇంగ్లండ్ లేదా చైనీస్ తైపీ ఉంటుంది.
కశ్యప్, గురుసాయిదత్ నెగ్గినా...
మరోవైపు థామస్ కప్‌లో మాత్రం భారత పురుషుల జట్టు పోరాటం లీగ్ దశలోనే ముగిసింది. పారుపల్లి కశ్యప్ నేతృత్వంలోని టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. దక్షిణ కొరియాతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో భారత్ 2-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. మలేసియాతో ఆదివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1-4తో ఓడిన సంగతి విదితమే.
నాకౌట్ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన రెండో లీగ్ మ్యాచ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 18వ ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్ జట్టుకు శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యాడు.
ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ వాన్ హో సన్‌తో జరిగిన ఈ పోటీలో శ్రీకాంత్ 21-17, 12-21, 18-21తో ఓడిపోయాడు. వాన్ హో సన్‌తో గతంలో ఆడిన రెండుసార్లు నెగ్గిన శ్రీకాంత్ సొంతగడ్డపై మాత్రం నిరాశపరిచాడు. డబుల్స్ మ్యాచ్‌లో యోన్ సియోంగ్ యూ-యోంగ్ డే లీ ద్వయం 21-18, 21-17తో సుమీత్ రెడ్డి-మనూ అత్రి జంటను ఓడించి కొరియాను 2-0తో ఆధిక్యంలో నిలిపింది. అయితే మూడో మ్యాచ్‌లో కశ్యప్ 21-17, 21-14తో లీ డాంగ్ కియోన్‌పై నెగ్గడంతో భారత ఆశలు నిలిచాయి.
కానీ నాలుగో మ్యాచ్‌లో కిమ్ సా రంగ్-కిమ్ కీ జంగ్ జోడి 21-16, 21-16తో అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా జంటను ఓడించడంతో కొరియా 3-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో గురుసాయిదత్ 24-22, 21-13తో హవాంగ్ జాంగ్ సూపై నెగ్గినా ఫలితం లేకపోయింది. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో జర్మనీతో భారత్ తలపడుతుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు రెండేసి ఓటములతో నాకౌట్ దశకు అర్హత పొందడంలో విఫలమయ్యాయి. ఇదే గ్రూప్ నుంచి మలేసియా, కొరియా నాకౌట్‌కు చేరుకున్నాయి.