సాక్షి, హైదరాబాద్: అనంత్ బజాజ్ స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణులు పుల్లెల గాయత్రి, మేఘన రెడ్డి, శ్రీకృష్ణప్రియ శుభారంభం చేశారు. పుల్లెల గోపీచంద్ అకాడమీలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో గాయత్రి 21–16, 21–9తో శీతల్‌పై, మేఘన రెడ్డి 21–10, 21–15తో ప్రేరణపై, శ్రీకృష్ణప్రియ 21–9, 21–13తో యోషిత మాథూర్‌పై గెలిచారు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తెలంగాణకే చెందిన సామియా 21–8, 21–15తో రోహిణిపై, కెయూర 21–7, 21–10తో రూబీ సింగ్‌పై విజయం సాధించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో పుల్లెల గాయత్రి–రుతుపర్ణ పాండా జంట 21–7, 21–11తో మేఘ–ప్రాంజల్ జోడీపై గెలిచింది.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సిరిల్ వర్మ 21–13, 21–12తో హర్షల్ భోయర్‌పై, అనికేత్ రెడ్డి 21–19, 17–21, 21–12తో భార్గవ్‌పై నెగ్గారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో శ్రీ కృష్ణ పొదిలె–షేక్ గౌస్ జంట 21–19, 21–18తో ఇషాన్ భట్నాగర్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీపై నెగ్గింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీ కృష్ణ పొదిలె–కనిక కన్వల్ ద్వయం 21–15, 21–19తో మహ్మద్ రెహాన్–అనీస్ కౌసర్ జోడీపై, నవనీత్ బొక్కా–సాహితి బండి జంట 21–18, 21–19తో ఉత్కర్ష–కరిష్మ వాడ్కర్ జంటపై గెలిచాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్, డెన్మార్క్ దిగ్గజ క్రీడాకారుడు మార్టిన్ ఫ్రాస్ట్, సీనియర్ కోచ్ విమల్ కుమార్, చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, పాణి రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment