సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారులు చిట్టబోయిన రాహుల్ యాదవ్, పుల్లెల గాయత్రి టైటిల్‌కు విజయం దూరంలో నిలిచారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ రాహుల్ యాదవ్ (తెలంగాణ) 16–21, 21–14, 21–11తో కార్తికేయ గుల్షన్ కుమార్ (ఢిల్లీ)పై గెలుపొందగా... లక్ష్యసేన్ (ఉత్తరప్రదేశ్) 21–17, 22–20తో సిరిల్‌వర్మ (తెలంగాణ)ను ఓడించాడు. అంతకుముందు క్వార్టర్స్‌లో రాహుల్ యాదవ్ 21–13, 21–13తో డేనియల్ ఫరీద్ (కర్ణాటక)పై, సిరిల్ వర్మ 18–21, 21–9, 21–14తో నిఖిల్‌శ్యామ్ శ్రీరామ్‌పై నెగ్గి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌ల్లో పదమూడో సీడ్ గాయత్రి (తెలంగాణ) 21–17, 10–3తో ముందంజలో ఉన్న సమ యంలో ప్రత్యర్థి రుతుపర్ణ దాస్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది.
దీంతో గాయత్రికి ఫైనల్ బెర్త్ ఖాయమైంది. మరో మ్యాచ్‌లో తన్విలాడ్ 22–20, 21–19తో శిఖా గౌతమ్ (ఎయిరిండియా)పై గెలిచి గాయత్రితో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు గౌస్ షేక్ జంట ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్‌లో గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్)–మయూరి (ఉత్తరప్రదేశ్) ద్వయం 24–22, 22–20తో ఎడ్విన్‌జాయ్ (కేరళ)–శ్రుతి మిశ్రా (ఉత్తరప్రదేశ్)జోడీపై పోరాడి గెలుపొందారు. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో గౌస్ షేక్ జోడీ 21–18, 26–24తో రోహన్ (ఆంధ్రప్రదేశ్)–కుహూ గార్గ్ (ఉత్తరప్రదేశ్) జంటపై గెలుపొందగా... శ్రీకృష్ణ సాయి కుమార్ (తెలంగాణ)–కనిక అగర్వాల్ (రైల్వేస్) జంట 21–19, 12–21, 14–21తో ఇషాన్ (ఛత్తీస్‌గఢ్)–తనీషా (గోవా) జోడీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి జోడీ సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో గాయత్రి (తెలంగాణ)–రుతుపర్ణ (ఒడిశా) జంట 21–13, 21–9తో హారిక (ఆంధ్రప్రదేశ్)–అక్షయ (మహారాష్ట్ర) జోడీపై గెలుపొంది ముందంజ వేసింది. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ కృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)–ధ్రువ్ కపిల (ఎయిరిండియా) ద్వయం 21–15, 21–16తో ప్రకాశ్ రాజ్–వైభవ్ (కర్ణాటక) జోడీపై, శ్రీకృష్ణ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్) జంట 14–21, 24–22, 21–16తో సంజయ్ (పాండిచ్చేరి)– సిద్ధార్థ్ (తెలంగాణ) జోడీపై నెగ్గి సెమీస్‌కి చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment