లక్నో: భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఈ సీజన్లో తొలి టైటిల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. సయ్యద్ మోదీ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సింధు ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సింధు శనివారం జరిగిన సెమీఫైనల్లో తొలి గేమ్‌ను 21–11తో అలవోకగా గెలిచింది. ఈ దశలో ఆమె ప్రత్యర్థి ఎవ్‌గెనియా కొసెత్సకయా (రష్యా) రిటైర్డ్ హర్ట్‌గా మ్యాచ్ మధ్యలో తప్పుకుంది. దీంతో 14 నిమిషాల్లోనే సింధు సెమీఫైనల్ గెలిచి తుది పోరుకు అర్హత సాధించినట్లయింది. సింధు నేడు జరిగే టైటిల్ పోరులో భారత్‌కే చెందిన మాల్విక బన్సోద్‌తో తలపడనుంది. సెమీఫైనల్లో మాల్విక 19–21, 21–19, 21–7తో అనుపమా ఉపాధ్యాయపై చెమటోడ్చి నెగ్గింది.
పురుషుల సెమీ ఫైనల్లో ఫ్రాన్స్ షట్లర్ అర్నాడ్ మెర్కెలె 21–19, 17–21, 21–9తో మిథున్ మంజునాథ్ పై గెలుపొందాడు. మరో సెమీస్‌లో లుకాస్ క్లేర్‌బొట్ (ఫ్రాన్స్) 15–21, 21–18, 21–15తో నాట్ ఎన్‌గుయెన్ (ఐర్లాండ్)ను ఓడించాడు. మహిళల డబుల్స్‌లో ఏడో సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ తుది పోరుకు అర్హత సంపాదించింది. సెమీఫైనల్లో గాయత్రి జంట 17–21, 21–8, 21–16తో మలేసియాకు చెందిన లో యిన్ యువాన్–వాలెరీ స్లొవ్ ద్వయంపై చెమటోడ్చి నెగ్గింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో కృష్ణ ప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్ జోడీ 21–10, 21–9తో ప్రేమ్‌సింగ్ చౌహాన్–రాజేశ్ వర్మ జంటపై గెలిచి ఫైనల్ చేరింది.
Comments
Please login to add a commentAdd a comment