
బసెల్(స్విట్జర్లాండ్): భారత బ్యాడ్మింటన్ ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించాడు. ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ రెండో రౌండ్‌లో ఐదుసార్లు విశ్వవిజేత, రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ లిన్ డాన్(చైనా)ను ఇంటిబాట పట్టించాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 30వ ర్యాంకర్ ప్రణయ్ 21–11, 13–21, 21–7తో లిన్ డాన్‌ను చిత్తుచేశాడు. ఆద్యంతం దూకుడుగా ఆడిన ప్రణయ్ తొలి సెట్ ఆరంభం లోనే 6–2తో ఆధిక్యంలో దూసుకెళ్లాడు. ఇదే ఊపులో 21–11తో సెట్‌ను కైవసం చేసుకున్నాడు.
అయితే, రెండో సెట్లో లిన్ తన అసలైన ఆటతీరు ప్రదర్శించాడు. 5–5 వద్ద ప్రణయ్‌ని నిలువరించాడు. ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లి 18–13 వద్ద వరుసగా మూడు పాయింట్లు సాధించి సెట్‌ను దక్కించు కున్నాడు. నిర్ణయాత్మక మూడో సెట్‌లో ప్రణయ్ తిరుగులేని ఆట ప్రదర్శించాడు. 21–7తో సెట్‌తోపాటు మ్యాచ్‌నూ గెలుచుకు న్నాడు. తర్వాతి రౌండ్‌లో వరల్డ్ నెం.1 కెంటో మొమోటా(జపాన్)తో ప్రణయ్ తలపడతాడు. కాగా, మరో మ్యాచ్‌లో భమిడిపాటి సాయిప్రణీత్ 21–16, 21–15తో లీ డాంగ్ క్యూన్(కొరియా)పై నెగ్గగా, 14వ ర్యాంకర్ సమీర్ వర్మ 21–15, 15–21, 10–21తో ప్రపంచ 34వ ర్యాంకర్ లొహ్ ఈ కియాన్ (సింగపూర్) చేతిలో పరాజయం చవిచూశాడు.
Comments
Please login to add a commentAdd a comment