ప్రణయ్‌ ప్రతాపం | HS Prannoy Trumps Lin Dan to Enter Round 3 of World Badminton Championships | Sakshi
Sakshi News home page

ప్రణయ్‌ ప్రతాపం

Published Wed, Aug 21 2019 3:58 AM | Last Updated on Wed, Aug 21 2019 4:33 AM

HS Prannoy Trumps Lin Dan to Enter Round 3 of World Badminton Championships - Sakshi

సాయిప్రణీత్‌, లిన్‌ డాన్‌

అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అన్ని గొప్ప టోర్నమెంట్‌లలో టైటిల్స్‌ సాధించి దిగ్గజ క్రీడాకారుడి హోదా పొందిన చైనా సూపర్‌ స్టార్‌ ప్లేయర్‌ లిన్‌ డాన్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఊహించని పరాజయం ఎదురైంది. గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచి, రెండుసార్లు ఒలింపిక్స్‌ స్వర్ణ పతకాలు సాధించి ఎందరో బ్యాడ్మింటన్‌ క్రీడాకారులకు ఆరాధ్యుడిగా మారిన లిన్‌ డాన్‌కు భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ షాక్‌ ఇచ్చాడు. హోరాహోరీ పోరులో లిన్‌ డాన్‌ను ఓడించిన ప్రణయ్‌ ఈ క్రమంలో మూడుసార్లు చైనా స్టార్‌ను ఓడించిన తొలి భారతీయ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రణయ్‌కు డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌) రూపంలో అగ్ని పరీక్ష ఎదురుకానుంది.

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తున్నా... జాతీయ క్రీడా పురస్కారాల్లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌కు ఈసారీ మొండిచేయి లభించడంతో ఆ కసినంతా అతను ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తన ప్రదర్శనలో చూపిస్తున్నాడు. తొలి రౌండ్‌లో తనకంటే తక్కువ ర్యాంక్‌ ఉన్న ప్లేయర్‌ను ఓడించడానికి ఇబ్బంది పడ్డ ఈ కేరళ ఆటగాడు... రెండో రౌండ్‌లో మాత్రం జూలు విదిల్చాడు.

ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత లిన్‌ డాన్‌ (చైనా)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రణయ్‌ 21–11, 13–21, 21–7తో గెలుపొంది సంచలనం సృష్టించాడు. ప్రపంచ 17వ ర్యాంకర్‌ లిన్‌ డాన్‌తో ఇప్పటివరకు ఐదుసార్లు తలపడ్డ ప్రణయ్‌ ముఖాముఖి రికార్డులో 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ మ్యాచ్‌కంటే ముందు 2015 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో, 2018 ఇండోనేసియా ఓపెన్‌లో లిన్‌ డాన్‌పై ప్రణయ్‌ గెలిచాడు. తద్వారా లిన్‌ డాన్‌ను మూడుసార్లు ఓడించిన తొలి భారతీయ ప్లేయర్‌గా ప్రణయ్‌ రికార్డు నెలకొల్పాడు.

గతంలో లిన్‌ డాన్‌పై పుల్లెల గోపీచంద్‌ రెండుసార్లు... ప్రస్తుత భారత నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ ఒకసారి గెలిచారు. 62 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ప్రణయ్‌ ఆద్యంతం దూకుడుగా ఆడాడు. లిన్‌ డాన్‌ స్థాయిని పట్టించుకోకుండా సహజశైలిలో ఆడిన ప్రణయ్‌ తొలి గేమ్‌లో 10–5, 19–11తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో గేమ్‌ను గెలిచాడు. రెండో గేమ్‌లో తడబడ్డ ప్రణయ్‌... నిర్ణాయక మూడో గేమ్‌లో రెచ్చిపోయాడు. స్కోరు 6–5తో ఉన్నదశలో ప్రపంచ 30వ ర్యాంకర్‌ ప్రణయ్‌ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 14–5తో ముందంజ వేశాడు.

ఆ తర్వాత చైనా ప్లేయర్‌కు రెండు పాయింట్లు కోల్పోయిన ప్రణయ్‌ మరో ఏడు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మరో రెండో రౌండ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సాయిప్రణీత్‌ 21–16, 21–15తో లీ డాంగ్‌ కెయున్‌ (దక్షిణ కొరియా)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. టోర్నీ తొలి రోజు సోమవారం ఆలస్యంగా జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో పదో సీడ్, భారత ప్లేయర్‌ సమీర్‌ వర్మ 21–15, 15–21, 10–21తో లో కీన్‌ యెయి (సింగపూర్‌) చేతిలో ఓడిపోయాడు.  

రెండో రౌండ్‌లో సుమీత్‌–మనూ జంట

డబుల్స్‌ విభాగంలోభారత జట్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంటకు చాంగ్‌ చింగ్‌ హుయ్‌–యాంగ్‌ చింగ్‌ తున్‌ (చైనీస్‌ తైపీ) జోడీ నుంచి వాకోవర్‌ లభించింది. దండు పూజ–సంజన ద్వయం 15–21, 14–21తో సు యా చింగ్‌–హు లింగ్‌ ఫాంగ్‌ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి 21–13, 21–13తో థామ్‌ గికెల్‌–రోనన్‌ లేబర్‌ (ఫ్రాన్స్‌)లపై... ఎం.ఆర్‌.అర్జున్‌–శ్లోక్‌ రామచంద్రన్‌ 21–14, 21–16తో తొబియాస్‌ కుయెంజి–ఒలివర్‌ షాలెర్‌ (స్విట్జర్లాండ్‌)లపై గెలిచారు. మరో మ్యాచ్‌లో అరుణ్‌ జార్జి–సాన్యమ్‌ శుక్లా 18–21, 11–21తో టకుటో ఇనుయు–యుకీ కనెకో (జపాన్‌) చేతిలో ఓడిపోయారు. 

లిన్‌ డాన్‌తో తొలి గేమ్‌లో, చివరి గేమ్‌లో బాగా ఆడాను. అయితే రెండో గేమ్‌లో నా వ్యూహం బోల్తా కొట్టింది. దీంతో కోచ్‌ల సలహాలతో కీలకదశలో నా ఆటతీరు మార్చుకొని మంచి ఫలితం సాధించాను. సంయమనం కోల్పోకుండా సుదీర్ఘ సమయం ఆడాను. గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మొమోటాతో తలపడనున్నాను. ఈ మ్యాచ్‌ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ మ్యాచ్‌లో నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాను.                  
–ప్రణయ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement