china player
-
బ్యాడ్మింటన్ కోర్టులో పెను విషాదం.. కార్డియాక్ అరెస్ట్‌తో యువ షట్లర్ మృతి
బ్యాడ్మింటన్ కోర్టులో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా యువ షట్లర్ కోర్టులోనే ప్రాణాలు వదిలాడు. ఇండొనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 17 ఏళ్ల ఝాంగ్ జిఝి ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ టోర్నీలో భాగంగా జపాన్‌కు చెందిన కజుమా కవానోతో తలపడ్డాడు. మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుండగా.. ఝాంగ్ జిఝి ఒక్కసారిగా కుప్పకులిపోయాడు.పక్కనే ఉన్న సిబ్బంది ఝాంగ్ జిఝిను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఝాంగ్ జిఝిను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఈ విషయం తెలిసి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. इंडोनेशिया में एक टूर्नामेंट के दौरान कोर्ट पर गिर जाने के बाद 17 वर्षीय चीनी बैडमिंटन खिलाड़ी झांग झिजी की हृदयाघात से मौत हो गई।#ZhangZhijie #CardiacArrest pic.twitter.com/UoEx2ypjGf— Naval Kant Sinha | नवल कान्त सिन्हा (@navalkant) July 2, 2024 -
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. 87 ఏళ్ల రికార్డు బద్దలు
చైనాకు చెందిన టెన్నిస్ ఆటగాడు యూ వైబింగ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో చరిత్ర సృష్టించాడు. 63 ఏళ్ల తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్‌లో చైనా నుంచి సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో విజయం సాధించిన రెండో ఆటగాడిగా యూ వైబింగ్ రికార్డులకెక్కాడు. విషయంలోకి వెళితే.. 174వ ర్యాంకర్ అయిన యూ వైబింగ్.. తొలి రౌండ్లో జార్జేరియాకు చెందిన 31వ సీడ్ నికోలోజ్ బాసిలాష్విలిని 6-3,6-4,6-0తో వరున సెట్లలో కంగుతినిపించాడు. కాగా 22 ఏళ్ల యూ వైబింగ్ మ్యాచ్‌లో తొమ్మిది ఏస్‌లు.. 31 విన్నర్లు సంధించాడు. టెన్నిస్‌లో మేజర్ గ్రాండ్‌స్లామ్‌లు చూసుకుంటే 1959 తర్వాత చైనా నుంచి ఒక ఆటగాడు సింగిల్స్ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 1959లో వింబుల్డన్‌లో మెఫు-చి మాత్రమే మేజర్ విజయాలు సాధించాడు. ఇక 1935లో చైనాకు చెందిన చెంగ్ గయ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో తొలి రౌండ్ మ్యాచ్ గెలిచాడు. అప్పటినుంచి చూసుకుంటే మళ్లీ ఒక్క చైనీస్ ఆటగాడు యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయారు. తాజాగా యూ వైబింగ్ మాత్రమే యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్‌ను విజయవంతంగా అధిగమించాడు. కాగా 2017లో జూనియర్ చాంపియన్‌గా నిలిచిన యూ వైబింగ్ ఆ తర్వాత ప్రొఫెషనల్ కెరీర్లో రాణించలేకపోయాడు. వరుస గాయాలు అతన్ని ఇబ్బందిపెట్టాయి. మార్చి 2019 నుంచి జనవరి 2022 వరకు యూ వైబింగ్ టెన్నిస్‌కు మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకొని మార్చిలో బరిలోకి దిగిన యూ వైబింగ్ ర్యాంక్ 1869. అయితే వరుసగా 14 మ్యాచ్‌లు(తాజా దానితో కలిపి) విజయాలు సాధించి ఏకంగా 174వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక యూ వైబింగ్ తన తర్వాతి మ్యాచ్ పోర్చుగీస్‌కు చెందిన నునో బోర్జెస్‌తో ఆడనున్నాడు. Wu Yibing has become the first man from China to win a men's Grand Slam match in 63 years after he beat Nikoloz Basilashvili 6-3 6-4 6-0. Trailblazer 🔥 #USOpen pic.twitter.com/zlZm9Tnd2u — Eurosport (@eurosport) August 29, 2022 చదవండి: US Open 2022: రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన సెరెనా -
ప్రణయ్ ప్రతాపం
అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో అన్ని గొప్ప టోర్నమెంట్లలో టైటిల్స్ సాధించి దిగ్గజ క్రీడాకారుడి హోదా పొందిన చైనా సూపర్ స్టార్ ప్లేయర్ లిన్ డాన్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఊహించని పరాజయం ఎదురైంది. గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచి, రెండుసార్లు ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు సాధించి ఎందరో బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఆరాధ్యుడిగా మారిన లిన్ డాన్‌కు భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ షాక్ ఇచ్చాడు. హోరాహోరీ పోరులో లిన్ డాన్‌ను ఓడించిన ప్రణయ్ ఈ క్రమంలో మూడుసార్లు చైనా స్టార్‌ను ఓడించిన తొలి భారతీయ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్‌కు డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) రూపంలో అగ్ని పరీక్ష ఎదురుకానుంది. బాసెల్ (స్విట్జర్లాండ్): కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా విజయాలు సాధిస్తున్నా... జాతీయ క్రీడా పురస్కారాల్లో హెచ్ఎస్ ప్రణయ్‌కు ఈసారీ మొండిచేయి లభించడంతో ఆ కసినంతా అతను ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తన ప్రదర్శనలో చూపిస్తున్నాడు. తొలి రౌండ్లో తనకంటే తక్కువ ర్యాంక్ ఉన్న ప్లేయర్‌ను ఓడించడానికి ఇబ్బంది పడ్డ ఈ కేరళ ఆటగాడు... రెండో రౌండ్లో మాత్రం జూలు విదిల్చాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లిన్ డాన్ (చైనా)తో జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రణయ్ 21–11, 13–21, 21–7తో గెలుపొంది సంచలనం సృష్టించాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ లిన్ డాన్‌తో ఇప్పటివరకు ఐదుసార్లు తలపడ్డ ప్రణయ్ ముఖాముఖి రికార్డులో 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ మ్యాచ్‌కంటే ముందు 2015 ఫ్రెంచ్ ఓపెన్‌లో, 2018 ఇండోనేసియా ఓపెన్‌లో లిన్ డాన్‌పై ప్రణయ్ గెలిచాడు. తద్వారా లిన్ డాన్‌ను మూడుసార్లు ఓడించిన తొలి భారతీయ ప్లేయర్‌గా ప్రణయ్ రికార్డు నెలకొల్పాడు. గతంలో లిన్ డాన్‌పై పుల్లెల గోపీచంద్ రెండుసార్లు... ప్రస్తుత భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ఒకసారి గెలిచారు. 62 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రణయ్ ఆద్యంతం దూకుడుగా ఆడాడు. లిన్ డాన్ స్థాయిని పట్టించుకోకుండా సహజశైలిలో ఆడిన ప్రణయ్ తొలి గేమ్‌లో 10–5, 19–11తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో గేమ్‌ను గెలిచాడు. రెండో గేమ్‌లో తడబడ్డ ప్రణయ్... నిర్ణాయక మూడో గేమ్‌లో రెచ్చిపోయాడు. స్కోరు 6–5తో ఉన్నదశలో ప్రపంచ 30వ ర్యాంకర్ ప్రణయ్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 14–5తో ముందంజ వేశాడు. ఆ తర్వాత చైనా ప్లేయర్‌కు రెండు పాయింట్లు కోల్పోయిన ప్రణయ్ మరో ఏడు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ 21–16, 21–15తో లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. టోర్నీ తొలి రోజు సోమవారం ఆలస్యంగా జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో పదో సీడ్, భారత ప్లేయర్ సమీర్ వర్మ 21–15, 15–21, 10–21తో లో కీన్ యెయి (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. రెండో రౌండ్లో సుమీత్–మనూ జంట డబుల్స్ విభాగంలోభారత జట్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంటకు చాంగ్ చింగ్ హుయ్–యాంగ్ చింగ్ తున్ (చైనీస్ తైపీ) జోడీ నుంచి వాకోవర్ లభించింది. దండు పూజ–సంజన ద్వయం 15–21, 14–21తో సు యా చింగ్–హు లింగ్ ఫాంగ్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి 21–13, 21–13తో థామ్ గికెల్–రోనన్ లేబర్ (ఫ్రాన్స్)లపై... ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ 21–14, 21–16తో తొబియాస్ కుయెంజి–ఒలివర్ షాలెర్ (స్విట్జర్లాండ్)లపై గెలిచారు. మరో మ్యాచ్‌లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా 18–21, 11–21తో టకుటో ఇనుయు–యుకీ కనెకో (జపాన్) చేతిలో ఓడిపోయారు. లిన్ డాన్‌తో తొలి గేమ్‌లో, చివరి గేమ్‌లో బాగా ఆడాను. అయితే రెండో గేమ్‌లో నా వ్యూహం బోల్తా కొట్టింది. దీంతో కోచ్‌ల సలహాలతో కీలకదశలో నా ఆటతీరు మార్చుకొని మంచి ఫలితం సాధించాను. సంయమనం కోల్పోకుండా సుదీర్ఘ సమయం ఆడాను. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటాతో తలపడనున్నాను. ఈ మ్యాచ్ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ మ్యాచ్‌లో నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తాను. –ప్రణయ్ -
చైనా హవా తగ్గుతోంది
ఇండియా టుడే కాంక్లేవ్‌లో శ్రీకాంత్ ముంబై: ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్‌లో చైనా ఆటగాళ్ల ఆధిపత్యం తగ్గిందని భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అన్నాడు. ప్రపంచ నంబర్ 1 హోదాను సాధించడం కన్నా కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాన్ని నెగ్గడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. ప్రపంచ వేదికపై యూరోప్ దేశాలు సత్తా చాటుతున్నప్పటికీ, వాటికన్నా కూడా భారతే బలమైన దేశంగా ఎదిగిందని వివరించాడు. భారత్‌కు చెందిన ఐదుగురు పురుష షట్లర్లు ప్రపంచ టాప్–20లో ఉండటమే దీనికి నిదర్శనమన్నాడు. శుక్రవారం ఇండియాటుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, భారత స్టార్ ప్లేర్ పీవీ సింధు, శ్రీకాంత్ పలు అంశాలపై మాట్లాడారు. చైనా హవా తగ్గింది: శ్రీకాంత్ ఇప్పుడు బ్యాడ్మింటన్ ముఖచిత్రం మారిపోయింది. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో చైనా హవా సాగింది. కానీ ఇప్పుడు చూస్తే టాప్–4లో నాతో పాటు అక్సెల్సన్ (డెన్మార్క్), చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా) ఇలా నాలుగు దేశాలకు చెందిన వారున్నారు. టోర్నీ ఫైనల్ గెలవడం ద్వారా నంబర్‌వన్‌గా నిలిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. ఆల్‌ఇంగ్లండ్, ఒలింపిక్ పతకాలు గెలవడం ద్వారానే దిగ్గజ ఆటగానిగా గుర్తింపు వస్తుంది. రియో రజతం తర్వాత చాలా మారింది: సింధు రియో ఒలింపిక్స్ రజతం సాధించాక నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. కానీ నేను మాత్రం ముందులాగే ఉన్నా. రియోతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం చాలా పోరాడా. కానీ ఫలితం రాలేదు. ఆటలో గెలుపోటములు సహజం. బరిలో దిగినపుడు అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తా. ఒక్కోసారి ఓటమి తప్పదు. నేనప్పుడు పార్టీ చేసుకుంటా: గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో సింధుతో సైనా, ప్రణయ్‌తో శ్రీకాంత్ తలపడే రోజు వస్తే నేను బయటికి వెళ్లి పెద్ద పార్టీ చేసుకుంటా. అది నా జీవితంలోనే గొప్ప రోజు అవుతుంది. నా ప్రతి విద్యార్థి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సాధించిన విజయాలు కూడా నాకు సంతృప్తినిస్తాయి. -
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధుకు పతకం ఖాయం
-
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధుకు పతకం ఖాయం
-
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధుకు పతకం ఖాయం
కలయా... నిజమా... గురువు పుల్లెల గోపీచంద్‌తో సాధ్యం కానిది.... తన ఆదర్శ క్రీడాకారిణి సైనాకు అందని ద్రాక్షగా ఉన్న ఘనతని... తన తొలి ప్రయత్నంలోనే పూసర్ల వెంకట సింధు సాధించింది. 18 ఏళ్ల ఈ అచ్చ తెలుగు అమ్మాయి శుక్రవారం భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. చైనా గడ్డపై వరుసగా రెండో మ్యాచ్‌లో చైనా ప్లేయర్‌నే చిత్తు చేసి ‘డ్రాగన్’ పీచమణిచింది. ప్రతిష్టాత్మక ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని పతకాన్ని ఖాయం చేసుకుంది. ఈ క్రమంలో మహిళల సింగిల్స్ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ‘మాకు తిరుగులేదు అని కాలర్ ఎగిరేసే చైనీయుల కుంభస్థలం మీద కొట్టాలనుకుందో’... ‘అరుదైన ఘనతకు అడుగు దూరంలో నిలిచిపోయిన సైనా, కశ్యప్‌ల బాధను కాస్తయినా తగ్గించాలనుకుందో’.. ‘అపర ద్రోణుడిలా అహర్నిశలు శ్రమిస్తున్న గురువు గోపీచంద్‌కు అద్భుత కానుక ఇవ్వాలనుకుందో’... మొత్తానికి తెలుగు తేజం పి.వి. సింధు అద్భుతమే చేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా... బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంది. గురువారం మూడో రౌండ్లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్, రెండో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)పై సాధించిన విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ ఈ 18 ఏళ్ల అమ్మాయి మరో సంచలనం సృష్టించింది. అశేష చైనా అభిమానుల నడుమ ఒత్తిడిని తట్టుకుంటూ మరో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 10వ సీడ్ సింధు 21-18, 21-17తో 7వ సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మెగా ఈవెంట్ నిబంధనల ప్రకారం సెమీఫైనల్ చేరినవారికి కనీసం కాంస్య పతకం లభిస్తుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో నాలుగో సీడ్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడుతుంది. ఇంతనోన్‌తో ముఖాముఖిలో సింధు 0-1తో వెనుకబడి ఉంది. ఆద్యంతం ఆధిపత్యం.... ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనీస్ తైపీలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో షిజియాన్ వాంగ్‌ను ఓడించిన సింధు అదే ఫలితాన్ని ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పునరావృతం చేసింది. సొంతగడ్డపై ఆడుతున్న షిజియాన్‌కు ప్రేక్షకుల మద్దతు లభించినా సింధు ఈ అంశాన్ని అంతగా పట్టించుకోకుండా తన ప్రణాళికను అమలు చేసింది. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ... అడపాదడపా స్మాష్ షాట్లు సంధిస్తూ... సింధు ఆరంభం నుంచి మ్యాచ్‌పై పట్టు బిగించింది. తొలి గేమ్ ఆరంభంలో వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 6-3తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత దీనిని కాపాడుకుంది. షిజియాన్ తేరుకునే ప్రయత్నం చేసినా సింధు ఏదశలోనూ సంయమనం కోల్పోకుండా చైనా స్టార్‌ను కట్టడి చేసింది. రెండో గేమ్ ఆరంభంలో సింధు మరోసారి చెలరేగింది. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 6-2తో ముందంజ వేసింది. ఈ నాలుగు పాయింట్ల ఆధిక్యాన్ని తగ్గించాలని, స్కోరును సమం చేయాలని షిజియాన్ కృషి చేసినా ఆమె ఆటలు సింధు ముందు సాగలేదు. మూడో పతకం...: సింధు సెమీఫైనల్‌కు చేరుకోవడంతో ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ ఖాతాలో మూడో పతకం చేరనుంది. 30 ఏళ్ల క్రితం 1983లో డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో దిగ్గజం ప్రకాశ్ పదుకొనే సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని సాధించారు. మూడు దశాబ్దాల తర్వాత సింధు ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి ప్రకాశ్ పదుకొనే సరసన నిలిచింది. 2011లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడి మహిళల డబుల్స్‌లో కాంస్యం సాధించింది. సైనా... నాలుగో‘సారీ’ గ్వాంగ్జూ (చైనా): అన్నీ కలిసొచ్చాయి. కానీ ఆటతీరే బాగోలేదు. ఫలితంగా భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది మరోసారి నిరాశపరిచింది. అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని గెల్చుకోవడంతో ఈ హైదరాబాద్ అమ్మాయి నాలుగోసారీ విఫలమైంది. గత మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2009-హైదరాబాద్), (2010-పారిస్), (2011-లండన్) క్వార్టర్ ఫైనల్స్‌లో నిష్ర్కమించిన సైనా నాలుగోసారీ ఈ అడ్డంకిని దాటలేకపోయింది. సెమీఫైనల్ చేరుకుంటే కనీసం కాంస్య పతకం ఖాయమయ్యే స్థితిలో బరిలోకి దిగిన సైనా ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. స్థాయికితగ్గ ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమై రిక్తహస్తాలతో తిరిగిరానుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సైనా 21-23, 9-21తో 13వ సీడ్ యోన్ జూ బే (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌లో ఆకట్టుకున్నా రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. తొలి గేమ్‌లో 14-7తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న సైనా ఆ తర్వాత అనవసర తప్పిదాలతో తన ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చింది. 21-20తో గేమ్ పాయింట్ వద్ద నిలిచిన సైనా వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది. రెండో గేమ్‌లో సైనా ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. ఆరంభంలో 5-4తో ఆధిక్యంలో ఉన్నా మళ్లీ తడబడింది. వరుసగా ఐదు పాయింట్లు సమర్పించుకొని 5-9తో వెనుకబడింది. ఆ తర్వాత స్కోరు 9-14 వద్ద ఉన్నపుడు సైనా వరుసగా ఏడు పాయింట్లు కోల్పోయి పరాజయాన్ని ఖాయం చేసుకుంది. ‘వరుసగా సింధు రెండు కఠినమైన మ్యాచ్‌లు ఆడింది. సెమీస్ ప్రత్యర్థి కూడా బలమైన క్రీడాకారిణి. సింధు రాణిస్తుందనే నమ్మకం ఉంది. ఓవరాల్‌గా సింధు అద్భుతంగా ఆడుతోంది. సైనాకు ఆరోగ్యం సరిగా లేదు. అందుకే తొలి గేమ్ తర్వాత శక్తిని కోల్పోయింది. ఆమె వయసు కేవలం 23 ఏళ్లే. కాబట్టి పుంజుకుంటుంది. మంచి నైపుణ్యం ఉన్న క్లాస్ ప్లేయర్ సైనా. తన కెరీర్‌కు వచ్చిన నష్టమేమీ లేదు.’ - కోచ్ గోపీచంద్ గోపీచంద్‌కు అంకితం ‘సింధు ఘనత పట్ల మేం గర్విస్తున్నాం. డ్రా కఠినంగా ఉండటం వల్ల తనపై మాకు ఎలాంటి అంచనాలు లేవు. సెమీస్‌కు చేరడం అనేది మేం ఊహించని గొప్ప ఘనత. సింధు విషయంలో గోపీచంద్ సపోర్ట్ స్టాఫ్‌ను బాగా వినియోగించారు. సింధు విజయాల్లో గోపీ కృషిని మరువలేం. ఈ విజయాన్ని ఆయనకే అంకితమిస్తున్నాం. ఎత్తు ఎక్కువ ఉండటం సింధు బలం. ఎవ్వరికీ భయపడదు. ప్రత్యర్థి ఎవరైనా నా ఆట నేను ఆడతా అంటుంది. ఈ దృక్పథం వల్లే చైనా క్రీడాకారిణులను ఓడిస్తోంది’. - పి.వి.రమణ, విజయ (సింధు తల్లిదండ్రులు) ప్రశంసల వెల్లువ సింధుపై అభినందనల వర్షం కురిసింది. ‘ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచే సత్తా ఆమెలో ఉంది.ఆల్ ది బెస్ట్ సింధు’ అంటూ భారత బ్యాడ్మింటన్ సమాఖ్య అధ్యక్షుడు అఖిలేశ్ దాస్ గుప్తా అభినందించారు. దేశంలో బ్యాడ్మింటన్‌కు ప్రధానకేంద్రంగా మారిన హైదరాబాద్ నుంచి మరో క్రీడాకారిణి సంచలనం సృష్టించడం గర్వకారణమని... ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి పున్నయ్యచౌదరి అన్నారు. పాపం... కశ్యప్ మ్యాచ్ పాయింట్ చేజార్చుకొని ఓటమి ఒక్క పాయింట్ సాధించి ఉంటే చరిత్ర సృష్టించే అవకాశాన్ని పారుపల్లి కశ్యప్ చేజార్చుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ కశ్యప్ 21-16, 20-22, 15-21తో మూడో సీడ్ డూ పెంగ్యూ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ పోటీలో కశ్యప్ తొలి గేమ్‌ను నెగ్గి రెండో గేమ్‌లో 20-19తో మ్యాచ్ పాయింట్‌ను సంపాదించాడు. ఈ దశలో పాయింట్ సాధించి ఉంటే కశ్యప్ విజయం సాధించడంతోపాటు సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకునేవాడు. కానీ డూ పెంగ్యూ పట్టుదలతో పోరాడి మ్యాచ్ పాయింట్‌ను కాచుకోవడమేకాకుండా రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కశ్యప్ ఒకదశలో 12-8తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఈ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయాడు. వరుసగా ఏడు పాయింట్లు సమర్పించుకొని 12-15తో వెనుకబడిపోయాడు. ఆ తర్వాత కశ్యప్ తేరుకోలేకపోయాడు. ఏకకాలంలో.... శుక్రవారం సైనా నెహ్వాల్, కశ్యప్ మ్యాచ్‌లు ఏకకాలంలో పక్క పక్క కోర్టుల్లో జరిగాయి. కశ్యప్ తొలి గేమ్‌ను సొంతం చేసుకునేసరికి సైనా తన తొలి గేమ్‌లో ఆధిక్యంలో ఉంది. రెండో గేమ్‌లో కశ్యప్ 0-7తో వెనుకబడి ఆ తర్వాత కోలుకున్నాడు. ఒకదశలో వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 18-16తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత కశ్యప్ మ్యాచ్ పాయింట్ సంపాదించాడు. అదే దశలో సైనా కూడా గేమ్ పాయింట్‌ను సంపాదించింది. కానీ కశ్యప్ మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకోలేకపోయాడు. సైనా కూడా గేమ్‌ను దక్కించుకోలేకపోయింది.