ఇండియా టుడే కాంక్లేవ్‌లో శ్రీకాంత్
ముంబై: ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్‌లో చైనా ఆటగాళ్ల ఆధిపత్యం తగ్గిందని భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ అన్నాడు. ప్రపంచ నంబర్ 1 హోదాను సాధించడం కన్నా కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాన్ని నెగ్గడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. ప్రపంచ వేదికపై యూరోప్ దేశాలు సత్తా చాటుతున్నప్పటికీ, వాటికన్నా కూడా భారతే బలమైన దేశంగా ఎదిగిందని వివరించాడు. భారత్‌కు చెందిన ఐదుగురు పురుష షట్లర్లు ప్రపంచ టాప్–20లో ఉండటమే దీనికి నిదర్శనమన్నాడు. శుక్రవారం ఇండియాటుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, భారత స్టార్ ప్లేర్ పీవీ సింధు, శ్రీకాంత్ పలు అంశాలపై మాట్లాడారు.
చైనా హవా తగ్గింది: శ్రీకాంత్
ఇప్పుడు బ్యాడ్మింటన్ ముఖచిత్రం మారిపోయింది. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో చైనా హవా సాగింది. కానీ ఇప్పుడు చూస్తే టాప్–4లో నాతో పాటు అక్సెల్సన్ (డెన్మార్క్), చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా) ఇలా నాలుగు దేశాలకు చెందిన వారున్నారు. టోర్నీ ఫైనల్ గెలవడం ద్వారా నంబర్‌వన్‌గా నిలిస్తేనే నాకు సంతోషంగా ఉంటుంది. ఆల్‌ఇంగ్లండ్, ఒలింపిక్ పతకాలు గెలవడం ద్వారానే దిగ్గజ ఆటగానిగా గుర్తింపు వస్తుంది.
రియో రజతం తర్వాత చాలా మారింది: సింధు
రియో ఒలింపిక్స్ రజతం సాధించాక నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. కానీ నేను మాత్రం ముందులాగే ఉన్నా. రియోతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం చాలా పోరాడా. కానీ ఫలితం రాలేదు. ఆటలో గెలుపోటములు సహజం. బరిలో దిగినపుడు అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తా. ఒక్కోసారి ఓటమి తప్పదు. నేనప్పుడు పార్టీ చేసుకుంటా: గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ఫైనల్లో సింధుతో సైనా, ప్రణయ్‌తో శ్రీకాంత్ తలపడే రోజు వస్తే నేను బయటికి వెళ్లి పెద్ద పార్టీ చేసుకుంటా. అది నా జీవితంలోనే గొప్ప రోజు అవుతుంది. నా ప్రతి విద్యార్థి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సాధించిన విజయాలు కూడా నాకు సంతృప్తినిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment