సైనాకు తప్పని 'స్పెయిన్ పెయిన్'
జకార్తా: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు స్పెయిన్ పెయిన్ తప్పలేదు. గత మార్చిలో జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ ఫైనల్లో మారిన్ కరోలినా చేతిలో ఓటమి చవిచూసిన సైనా.. మరోసారి వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్లో ఓటమి చెందింది. ప్రపంచ చాంపియన్ షిప్ లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో స్పెయిన్ కు చెందిన ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా చేతిలో 21-16, 21-19 తేడాతో సైనా ఓటమి పాలైంది. తొలి సెట్ ఆరో గేమ్ వరకూ సైనా ఆధిక్యం కనబరిచినా .. తరువాత వరుస పాయింట్లను చేజార్చుకుని ఆ సెట్ ను నష్టపోయింది. దీంతో వెనుకబడిన సైనా.. రెండో సెట్ లో ఆధిక్యం దిశగా కొనసాగింది. కాగా, సైనా ఆ సెట్ చివర్లో ఒత్తిడికి గురై మ్యాచ్ ను చేజార్చుకుంది.
వరల్డ్ బ్యాడ్మింటన్ లో తొలిసారి ఫైనల్ కు చేరిన సైనా.. చివరి అడ్డంకిని మాత్రం దాటలేకపోయింది. గతంలో మారిన్ కరోలినాపై సైనా స్పష్టమైన ఆధిక్యం కనబరిచినా.. వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో మాత్రం కరోలినాదే పైచేయి అయ్యింది. ప్రత్యర్థి వేగం, దూకుడు ముందు సైనా నిలువలేకపోయింది. సైనా కొత్త చరిత్రను లిఖిస్తుందని భావించినా ఆ ఆశ తీరలేదు. అయితే ఈ టోర్నీలో సైనా నెహ్వాల్ చాన్నాళ్ల తర్వాత తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చింది. సైనా నెహ్వాల్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో తొలిసారి ఫైనల్ కు చేరడంతో రజత పతకంతో సరిపెట్టుకుంది.