‘సింధు’ వదనం చిన్నబోవద్దు
అద్భుతం ఆ పోరాటం...అసాధారణం ఆ ప్రదర్శన... అయితే ఆటలో క్రూరత్వం కూడా దాగి ఉంటుంది... అది మీ శ్రమను, చిందించిన చెమటను లెక్కలోకి తీసుకోదు. ప్రపంచాన్ని జయించాలంటే పడ్డ కష్టం పాయింట్ల రూపంలోనే కనిపించాలి. తుది ఫలితంలో చాంపియన్ ఒక్కరే కనిపిస్తారు. అలా చూస్తే సింధుకు ఇది పరాజయం కావచ్చు! కానీ 110 నిమిషాల పాటు కోట్లాది మంది అభిమానులను మునివేళ్లపై నిలబెట్టించగలిగిన ఆట అది. కోర్టులో ఆమె కదలికలకు ఫిదా అయిపోయిన క్షణాలు అవి.
స్మాష్, డ్రాప్, ర్యాలీ... ఏదైతేనేం ఆమె చూపించిన ఆటకు జయహో అనకుండా ఉండగలమా? ‘రియో’ ఒలింపిక్ వేదికపై రజతంతో మురిపించిన మన సింధూరం ఈసారి మరో ప్రపంచ వేదికపై బంగారాన్ని అందుకునేందుకు చూపించిన పట్టుదలకు సలామ్ చేయకుండా ఆగిపోగలమా? ఆమె ఓటమి మనల్ని బాధించడం లేదు. ఎందుకంటే ఆమె ఒక్కో పాయింట్ సాధించిన తీరు గెలుపుతో సమానమైన సంతృప్తిని ఇచ్చింది. సింధు ఓడిపోయిందనే మాటను చెప్పేందుకు కూడా మనకు మనస్కరించడం లేదు. ఈ మ్యాచ్‌లో స్వర్ణాన్ని కోల్పోయినా... షటిల్ ప్రపంచంలో ఆమె ఎప్పటికీ మన బంగారు బాలికనే.
సరిగ్గా ఏడాది క్రితం రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకాన్ని గెలుచుకొని భారతీయులందరి మనసు దోచుకుంది. ఆ వెంటనే సన్మానాలు, సత్కారాలు, కోట్ల రూపాయల కనకాభిషేకం, బ్రాండింగ్ బంధాలు... ఒక్కటేమిటి, సంవత్సరం వ్యవధిలో ఇలాంటివన్నీ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. సాధారణంగా అయితే ఒక 22 ఏళ్ల ప్లేయర్ ఇలాంటి వాటి మాయలో ఆదమరిచి ఆటను కూడా వెనక్కి పంపే ప్రమాదం చాలా ఉంటుంది. ఉవ్వెత్తున ఎగసి ఉస్సురని కూలిన క్రీడాకారులు ఎందరికో చరిత్ర సాక్షిగా నిలిచింది. ఒక ఒలింపిక్ పతకంతో జీవిత కాలపు ఆనందాన్ని అనుభవించి అంతటితో సంతృప్తి చెందే అల్ప సంతోషులు కూడా ఎందరో ఉంటారు.
కానీ సింధులో గొప్పతనమంతా ఇక్కడే కనిపించింది.ఆమెపై ఎన్ని ప్రశంసలు ముంచేసినా... తను ఆటను మాత్రం అంతే అపురూపంగా చూసుకుంది. అందుకే ఎక్కడా తను ఆగిపోలేదు. ఒలింపిక్స్‌లో విజయం తర్వాత కూడా మూడు ప్రతిష్టాత్మక టోర్నీలలో విజేతగా నిలిచి తన ప్రాధాన్యాలేమిటో ఆమె చూపించింది. ముందుగా చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నీ గెలిచిన సింధు... ఈ ఏడాది ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లో, సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లలో విజేతగా నిలిచింది. ‘రియో’ నుంచి మొదలైన జోరును గ్లాస్గోలో ప్రపంచ విజేతగా ముగించాలని ఆమె కలగంది. దురదృష్టవశాత్తూ అది స్వర్ణ తీరం చేరలేకపోయినా... ఆమె స్థాయిని మరింత పెంచింది.
ప్రిక్వార్టర్స్‌లో మినహా...
ఒలింపిక్ పతకం సాధించిన తర్వాత కూడా కోచ్ పుల్లెల గోపీచంద్ సంతృప్తి చెందలేదు. మనమేంటో ప్రపంచం గుర్తించాలంటే ప్రపంచ చాంపియన్ కూడా కావాలి అంటూ ఆయన తన ఉద్దేశాలు ఏంటో స్పష్టంగా చెప్పారు. అదే లక్ష్యంగా సింధును సిద్ధం చేశారు కూడా. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో అలవోకగా నెగ్గిన సింధు, రెండో మ్యాచ్‌లో తడబడింది. తొలి గేమ్‌ను కోల్పోయి, చివరకు చచ్చీ చెడి మ్యాచ్ గెలుచుకుంది. బహుశా ఇదే ఆమెలో పట్టుదల పెంచింది.
తన అసలు సత్తా ఏమిటో ఆమెకు మరోసారి గుర్తు చేసింది. ఫలితం... తర్వాతి రెండు మ్యాచ్‌లలో సింధు ప్రత్యర్థులకు ఏడుపొక్కటే తక్కువ! క్వార్టర్ ఫైనల్లో 21–14, 21–9 సున్ యు (చైనా)పై... సెమీస్‌లో 21–13, 21–10తో చెన్ యుఫె (చైనా)పై గెలిచింది. సరిగ్గా చెప్పాలంటే తన ఆటతో ఆమె వారందరినీ తొక్కేసింది! ఇదే ఊపులో ఫైనల్‌కు కూడా సన్నద్ధమైంది. ఇప్పటి వరకు ఆమె ప్రదర్శన చూస్తే తుది పోరులో కూడా అందరూ అదే అద్భుతాన్ని ఆశించారు. అయితే ప్రాణం ఒడ్డి పోరాడిన తర్వాత చివరకు రెండో స్థానం తప్పలేదు.
ఆగిపోవద్దు...
2013లో తొలిసారి సింధు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్నప్పుడు అభిమానులకు ఆనందాశ్చర్యాలు కలిగాయి. సైనా నెహ్వాల్ హవా సాగుతున్న ఆ సమయంలో సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచిన 18 ఏళ్ల అమ్మాయి గురించి కొత్తగా చర్చ మొదలైంది. తర్వాతి ఏడాది మరోసారి అదే పతకం గెలుచున్నప్పుడు సింధును సత్తా ఉన్న షట్లర్‌గా ప్రపంచం గుర్తించింది. రాకెట్ వేగంతో దూసుకొచ్చిన ఈ తెలుగమ్మాయి రెండేళ్లలోనే ఒలింపిక్స్‌లో వెండి పతకం గెలుచుకొని తన విలువను ప్రదర్శించింది.
ఈ మధ్యలో సూపర్ సిరీస్‌లు, గ్రాండ్‌ప్రి గోల్డ్‌లలో సంచలన విజయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఫైనల్లో సింధు ఓటమిలో అలసట కూడా ఒక కారణంలా కనిపించింది. అద్భుతమైన ఫిట్‌నెస్ ఉన్నా మ్యాచ్ ఆఖరి క్షణాల్లో ఆమె కాస్త బలహీనంగా మారిపోయింది. ఇవాళ విజయం దక్కకపోవచ్చు... కానీ ప్రపంచ చాంపియన్‌షిప్ ప్రతీ ఏటా ఆమె ముందుకు వచ్చే అవకాశం. ఈ తరహా ఆట ఆమెకు చాంపియన్ అయ్యే అన్ని అర్హతలూ ఉన్నాయని చూపించింది. కాబట్టి సింధుకు స్వర్ణం సుదూర స్వప్నం మాత్రం కాబోదు!
– సాక్షి క్రీడా విభాగం