మిషన్‌ ‘గ్లాస్గో’ | World Badminton Championship from today | Sakshi
Sakshi News home page

మిషన్‌ ‘గ్లాస్గో’

Published Mon, Aug 21 2017 12:43 AM | Last Updated on Sun, Sep 17 2017 5:45 PM

మిషన్‌ ‘గ్లాస్గో’

మిషన్‌ ‘గ్లాస్గో’

∙ ఆశల పల్లకిలో శ్రీకాంత్, సింధు 
∙ నేటినుంచి ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌


గ్లాస్గో (స్కాట్లాండ్‌): ఈ సంవత్సరంలో భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికపై మెరుపులు మెరిపిస్తున్నారు. కిడాంబి శ్రీకాంత్‌ వరుసగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ సాధించగా... సాయిప్రణీత్‌ సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్, థాయ్‌లాండ్‌ ఓపెన్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టైటిల్స్‌ను... సమీర్‌ వర్మ సయ్యద్‌ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. మరోవైపు పీవీ సింధు సయ్యద్‌ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో, ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో విజేతగా నిలిచింది. సైనా నెహ్వాల్‌ మలేసియా మాస్టర్స్‌ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో చాంపియన్‌ అయింది. వేదిక ఏదైనా, టోర్నీ స్థాయి ఏదైనా భారత క్రీడాకారులు బరిలోకి దిగితే ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో మొదలయ్యే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అందరి దృష్టి భారత క్రీడాకారులపైనే కేంద్రీకృతమై ఉంది.  

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నుంచి ఏకంగా 22 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) 21 మందిని ఎంపిక చేసినా... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత్‌కే చెందిన ప్రజక్తా సావంత్‌ మలేసియా ప్లేయర్‌ యోగేంద్రన్‌ కృష్ణన్‌తో కలిసి విడిగా పోటీపడనుంది.  ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రీకాంత్‌ సోమవారం జరిగే పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో రష్యాకు చెందిన సెర్గీ సిరాంత్‌తో; పాబ్లో అబియాన్‌ (స్పెయిన్‌)తో సమీర్‌ వర్మ తలపడతారు. మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో వీ నాన్‌ (హాంకాంగ్‌)తో సాయిప్రణీత్‌; లుకా వ్రాబెర్‌ (ఆస్ట్రియా)తో అజయ్‌ జయరామ్‌ ఆడతారు.  ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్‌కు ఇప్పటివరకు ఒకే పతకం వచ్చింది. 1983లో ప్రకాశ్‌ పదుకొనే సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాన్ని సాధించారు.  

మహిళల సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించడంతో వీరిద్దరూ నేరుగా రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగుతారు. భారత్‌కే చెందిన రితూపర్ణ దాస్‌ తొలి రౌండ్‌లో ఐరీ మికెలా (ఫిన్‌లాండ్‌)తో; చోల్‌ బిర్చ్‌ (ఇంగ్లండ్‌)తో తన్వీ లాడ్‌ పోటీపడనున్నారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను లెక్కలోకి తీసుకుంటే ఈసారీ భారత్‌కు సింగిల్స్‌ విభాగంలో పతకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబుల్స్‌ విభాగంలో మాత్రం అంతగా అంచనాలు లేవు. ఒకవేళ డబుల్స్‌లో ఏదైనా పతకం వస్తే అది బోనస్‌ అవుతుంది.  

పతకాలే... ప్రైజ్‌మనీ లేదు...
ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే అన్ని స్థాయి టోర్నమెంట్‌లలో ప్రైజ్‌మనీ ఉంటున్నా... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మాత్రం పతక విజేతలకు ఎలాంటి ప్రైజ్‌మనీ ఇవ్వరు. సెమీఫైనల్‌కు చేరిన వారికి కాంస్య పతకాలు, ఫైనల్లో ఓడిన వారికి రజత పతకాలు, చాంపియన్స్‌కు స్వర్ణ పతకాలు అందజేస్తారు. 1977లో తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ జరిగింది. స్కాట్లాండ్‌లోని గ్లాస్కో నగరం ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. 1997లో గ్లాస్గోలో జరిగిన ఈ పోటీల్లో భారత్‌ తరఫున సింగిల్స్‌లో పుల్లెల గోపీచంద్‌ పోటీపడగా... 20 ఏళ్ల తర్వాత అదే వేదికపై ఆయన భారత జట్టుకు చీఫ్‌ కోచ్‌గా వ్యవహరిస్తుండటం విశేషం.  

భారత జట్టు వివరాలు
∙ పురుషుల సింగిల్స్‌: కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, అజయ్‌ జయరామ్, సమీర్‌ వర్మ.
∙ మహిళల సింగిల్స్‌: పీవీ సింధు, సైనా నెహ్వాల్, రితూపర్ణ దాస్, తన్వీ లాడ్‌.
∙ పురుషుల డబుల్స్‌: సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి; అర్జున్‌–శ్లోక్‌ రామచంద్రన్‌; సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి.
∙ మహిళల డబుల్స్‌: సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప; ఆరతి సారా సునీల్‌–సంజన సంతోష్‌; మేఘన–పూర్వీషా రామ్‌.
∙ మిక్స్‌డ్‌ డబుల్స్‌: సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా; సుమీత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప; సాత్విక్‌ సాయిరాజ్‌–మనీషా.  

మధ్యాహ్నం గం. 3.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement