
వెళ్లాలి... ‘మన రాకెట్’ పైపైకి...
- నేటి నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
- బరిలో సైనా, సింధు, శ్రీకాంత్, కశ్యప్
- తొలిసారి 18 మందితో భారీ బృందం
అందని ద్రాక్షగా ఉన్న ‘ప్రపంచ’ పతకాన్ని సాధించాలనే పట్టుదలతో సైనా నెహ్వాల్... వరుసగా మూడోసారి అద్బుతం చేయాలనే లక్ష్యంతో పీవీ సింధు... 32 ఏళ్ల పురుషుల సింగిల్స్ విభాగంలో పతక నిరీక్షణకు తెరదించాలనే ఆశయంతో శ్రీకాంత్, కశ్యప్... మళ్లీ విజయాలబాట పట్టాలనే సంకల్పంతో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప... ఇలా ప్రతి ఒక్కరూ తమదైన ముద్ర చూపించాలనే తాపత్రయంతో అసలు సమరానికి సమాయత్తమయ్యారు. సోమవారం నుంచి మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ అంచనాలతో భారత బృందం బరిలోకి దిగనుంది.
జకార్తా (ఇండోనేసియా): బ్యాడ్మింటన్‌లో చైనాకు దీటుగా తాము ఎదుగుతున్నామని ఇటీవల కాలంలో తమ ప్రదర్శనతో నిరూపించిన భారత క్రీడాకారులు ప్రపంచ పరీక్షకు సిద్ధమయ్యారు. నేటి నుంచి జకార్తాలో మొదలయ్యే ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో 18 మంది సభ్యులతో కూడిన భారత బృందం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తొలిసారి అత్యధిక ఆటగాళ్లతో భారత్ వెళ్లినప్పటికీ... ఆరుగురిపైనే అందరి దృష్టి కేంద్రీకృతం కానుంది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు.. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్... మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం నుంచి పతకాలు ఆశించవచ్చు.
సైనా.. ఈసారైనా
ఇప్పటివరకు ఈ మెగా ఈవెంట్‌లో ఐదుసార్లు పాల్గొన్న సైనా ఐదు పర్యాయాల్లోనూ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించలేకపోయింది. ఈ అవరోధాన్ని దాటితే ఆమెకు కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. తన కెరీర్‌లో ఒలింపిక్స్, ఆసియా, కామన్వెల్త్ గేమ్స్, సూపర్ సిరీస్, ఉబెర్ కప్, ఆసియా చాంపియన్‌షిప్‌లాంటి ప్రతిష్టాత్మక పోటీల్లో పతకాలు నెగ్గిన సైనాకు ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం అందని ద్రాక్షగా ఊరిస్తోంది. ఆరో సారైనా సైనాకు అదృష్టం కలిసొస్తుందో లేదో వేచి చూడాలి. ఈసారి రెండో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సైనాకు తొలి రౌండ్‌లో ‘బై’ లభించింది. రెండో రౌండ్‌లో సులువైన ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశం ఉన్నా... ప్రిక్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ తకహాషి (జపాన్), క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా) సైనా దారిలో ఉన్నారు. ఈ రెండు అడ్డంకులను దాటితేనే సైనాకు పతకం దక్కుతుంది.
సింధు... హ్యాట్రిక్ సాధించేనా
అందర్నీ ఆశ్చర్యపరుస్తూ గత రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ (2013, 2014)లలో కాంస్య పతకాలు నెగ్గి చరిత్ర సృష్టించిన పీవీ సింధు వరుసగా మూడోసారీ పతకం సాధించి ‘హ్యాట్రిక్’ నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. గాయాల కారణంగా ఈ సీజన్‌లో పెద్దగా విజయాలు సాధించని సింధు ఈ మెగా ఈవెంట్‌కు పక్కాగా సన్నద్ధమైంది. 11వ సీడింగ్ పొందిన సింధుకు తొలి రౌండ్‌లో ‘బై’ దక్కింది. రెండో రౌండ్‌ను దాటితే ఈ హైదరాబాద్ అమ్మాయికి మూడో రౌండ్‌లో ఒలింపిక్ చాంపియన్ లీ జురుయ్ (చైనా) రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశముంది. గతంలో లీ జురుయ్‌ను ఓడించిన సింధు ఈసారీ అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయడంపైనే ఆమె ‘హ్యాట్రిక్’ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ‘ప్రస్తుతం నేను పూర్తి ఫిట్‌గా ఉన్నాను. సన్నాహాలు కూడా బాగున్నాయి. ప్రత్యర్థి ఎవరైనా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా స్వేచ్ఛగా, సహజశైలిలో ఆడతాను. వరుసగా మూడోసారి పతకాన్ని సాధిస్తాను’ అని సింధు వ్యాఖ్యానించింది.
మళ్లీ గాడిలో పడేందుకు...
ఇటీవలే కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీలో మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గిన గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెరిపించాలనే లక్ష్యంతో ఉన్నారు. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించిన జ్వాల-అశ్విని మరోసారి పతకంతో తిరిగి వస్తారో లేదో వేచి చూడాలి. తొలి రౌండ్‌లో బై పొందిన జ్వాల-అశ్వినిలకు మూడో రౌండ్‌లో ఎనిమిదో సీడ్ కాకివా-మియుకి మయెదా (జపాన్) జోడీ ఎదురయ్యే అవకాశముంది. మహిళల డబుల్స్‌లోనే సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె; మొహితా -ధాన్యా; పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్; మిక్స్‌డ్ డబుల్స్‌లో అరుణ్ విష్ణు-అపర్ణా బాలన్; సిక్కి రెడ్డి-కోనా తరుణ్ బరిలో ఉన్నారు.
నిరీక్షణకు తెర దించుతారా!
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు ఈ మెగా ఈవెంట్‌లో చివరిసారి 1983లో ప్రకాశ్ పదుకొనే కాంస్య పతకాన్ని అందించాడు. ఆ తర్వాత ఇప్పటివరకు భారత్‌కు పురుషుల సింగిల్స్‌లో మరో పతకం రాలేదు. అయితే కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్‌లలో ఒకరైనా 32 ఏళ్ల నిరీక్షణకు ఈసారి తెరదించుతారనే ఆశ కనిపిస్తోంది. బ్యాడ్మింటన్ సర్క్యూట్‌లో అత్యంత దూకుడైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ గతేడాది చైనా సూపర్ సిరీస్‌లో లిన్ డాన్‌ను మట్టికరిపించి పెను సంచలనమే సృష్టించాడు. ఈ ఏడాది ఇండోనేసియా ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ చెన్ లాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించిన కశ్యప్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఇద్దరే కాకుండా కేరళ ప్లేయర్ ప్రణయ్ కూడా సంచలనం సృష్టించే అవకాశముంది. సోమవారం జరిగే తొలి రౌండ్‌లో ఎరిక్ మెజెస్ (నెదర్లాండ్స్)తో కశ్యప్; అలెక్స్ యువాన్ (బ్రెజిల్)తో ప్రణయ్ తలపడతారు.
ఉదయం గం. 7.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం