న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు ప్రదాన కార్యక్రమం మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. వేర్వేరు క్రీడాంశాల్లో సత్తా చాటి ఈ పురస్కారానికి ఎంపికైన భారత ఆటగాళ్లు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దీనిని సగర్వంగా అందుకున్నారు. భారత క్రికెట్ జట్టు స్టార్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీతో పాటు తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ అర్జున అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతున్న కారణంగా తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ఈ అవార్డును అందుకోలేకపోయింది.
దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ‘ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపికైన టాప్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. వీరిద్దరు ప్రస్తుతం కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొంటున్నారు. భారత మహిళా చెస్ గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు అమ్మాయి ఆర్. వైశాలి, రెజ్లర్ అంతిమ్ పంఘాల్, అథ్లెట్ పారుల్ చౌదరి, భారత కబడ్డీ జట్టు కెపె్టన్, తెలుగు టైటాన్స్ జట్టు స్టార్ ప్లేయర్ పవన్ కుమార్ సెహ్రావత్ కూడా అర్జున పురస్కారాన్ని అందుకున్నారు.
పారా ఆర్చర్ శీతల్ దేవి అవార్డు అందుకుంటున్నప్పుడు ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందించగా... వీల్‌చైర్‌లో కూర్చుకున్న పార్ కనోయిస్ట్ ప్రాచీ యాదవ్ వద్దకు వెళ్లి స్వయంగా రాష్ట్రపతి అవార్డు అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంధ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి కూడా అర్జున అవార్డును అందుకోగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన స్విమ్మర్ మోతుకూరి తులసీ చైతన్య టెన్‌జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాన్ని స్వీకరించాడు.
విజయవాడ సిటీ స్పెషల్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న 34 ఏళ్ల తులసీ చైతన్య కాటలీనా చానెల్, జిబ్రాల్టర్ జలసంధి, పాక్ జలసంధి, ఇంగ్లిష్ చానెల్, నార్త్ చానెల్‌లను విజయవంతంగా ఈది తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2023 సంవత్సరానికి ఇద్దరికి ‘ఖేల్ రత్న’... 26 మందికి ‘అర్జున’... ఐదుగురికి ‘ద్రోణాచార్య’ రెగ్యులర్ అవార్డు... ముగ్గురికి ‘ద్రోణాచార్య’ లైఫ్‌టైమ్... ముగ్గురికి ‘ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్’ అవార్డులు ప్రకటించారు.
ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29న) ఈ అవార్డులను అందజేస్తారు. అయితే ఆ సమయంలో హాంగ్జౌ ఆసియా క్రీడలు జరుగుతుండటంతో అవార్డుల ఎంపికతోపాటు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment