రోహిత్ బృందం నిమగ్నం
తుది జట్టు కూర్పుపై కసరత్తు పూర్తి
చెన్నై: టీమిండియా ప్రాక్టీస్‌లో తలమునకలై శ్రమిస్తోంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం తీవ్రంగా సాధన చేస్తోంది. నిజానికి భారత్ స్థాయితో పోల్చుకుంటే బంగ్లాదేశ్ ఏమంత గట్టి ప్రత్యర్థి కానప్పటికీ... ఇటీవల పాకిస్తాన్‌లో పర్యటించిన బంగ్లాదేశ్ 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్‌లో ఎలాంటి ఆదమరుపునకు తావివ్వకుండా భారత ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. సోమ వారం పూర్తిస్థాయిలో 16 మంది జట్టు సభ్యులంతా ప్రాక్టీస్ చేశారు.
కోహ్లి నెట్స్‌లో ఎక్కువసేపు బ్యాటింగ్ చేశాడు. తర్వాత యువ సంచలనం యశస్వి జైస్వాల్ సాధనకు దిగాడు. ఇద్దరు చాలాసేపు వైవిధ్యమైన బంతుల్ని ఎదుర్కొనేందుకు ఆసక్తి చూపారు. భారత స్పీడ్‌స్టర్ బుమ్రా, స్థానిక వెటరన్ స్పిన్నర్ అశ్విన్ వాళ్లిద్దరికి బంతులు వేశారు. బుమ్రా బౌలింగ్‌లో షాట్లు ఆడే ప్రయత్నంలో జైస్వాల్ పలుమార్లు బౌల్డయ్యాడు.
ఆ తర్వాత కెపె్టన్ రోహిత్, ఓపెనర్ శుబ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్‌లు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్ అయిపోగానే సర్ఫరాజ్ జట్టుతో కలిశాడు. సారథి రోహిత్ శర్మ ప్రధానంగా స్పిన్నర్లను ఎదుర్కోనేందుకు మొగ్గు చూపాడు. చాలాసేపు స్పిన్ బంతులపైనే ప్రాక్టీస్ చేశాడు. రవీంద్ర జడేజా, రిషభ్ పంత్‌లు కూడా త్రోడౌన్ స్పెషలిస్టుల బంతుల్ని ఆడారు. సోమవారంతో భారత్ జట్టు మూడు ప్రాక్టీస్ సెషన్లను పూర్తి చేసుకుంది. మ్యాచ్‌కు మూడు రోజుల సమయం ఉండటంతో మరో రెండు సెషన్లు ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో గడపనున్నారు.
ముగ్గురు స్పిన్నర్లతో...
చెపాక్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం కావడంతో భారత్ ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. అనుభవజు్ఞలైన అశి్వన్, జడేజాలతో కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో దాదాపు బెర్త్ ఖాయమనిపిస్తోంది. దీంతో బ్యాటింగ్‌లోనూ మెరిపిస్తున్న స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఈ మ్యాచ్‌లో చోటు లేనట్లే! పేసర్ల విషయానికొస్తే బుమ్రాతో సిరాజ్ బంతిని పంచుకుంటాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైన ఈ రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో తొలి టెస్టు ఎంఎ చిదంబరం మైదానంలో గురువారం నుంచి జరుగుతుంది.
బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా... ఆదివారం చెన్నై చేరుకున్న బంగ్లాదేశ్ జట్టు క్రికెటర్లు కూడా సోమవారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. పాక్‌ను వారి సొంతగడ్డపై వైట్‌వాష్ చేసి ఊపు మీదున్న బంగ్లాదేశ్... ప్రపంచ రెండో ర్యాంకర్ భారత్‌ను ఓడించడమే లక్ష్యంగా నెట్స్‌లో చెమటోడ్చుతోంది. బ్యాటర్లు లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, మహ్ముదుల్ హసన్, జాకిర్ హసన్, షాద్‌మన్ ఇస్లామ్‌లు భారీషాట్లపై కసరత్తు చేశారు. త్రోడౌన్ స్పెషలిస్టులపై స్ట్రెయిట్ డ్రైవ్ షాట్లు ఆడారు. స్పిన్నర్లకు కలిసొచ్చే చెన్నై పిచ్‌పై సత్తా చాటేందుకు తైజుల్ ఇస్లామ్, నయీమ్ హసన్‌లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment