
క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్
భారత స్టార్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.
భారత స్టార్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ సైనా 18-21, 21-16, 21-14తో థాయలాండ్ క్రీడాకారిణి పోర్న్‌టిప్ బుర్నాప్రసెర్ట్సుక్పై విజయం సాధించింది. 52 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్లో సైనా మొదటి సెట్ కోల్పోయినప్పటికీ తర్వాత వరుసగా సెట్లను నిలబెట్టుకుని గెలుపు అందుకుంది.
బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో సైనా ఓల్గా గొలొవనోవా (రష్యా)పై సునాయంగా విజయం సాధించింది. కేవలం 23 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 21-5, 21-4తో ఓల్గా గొలొవనోవాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సైనాకు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురుకాలేదు. స్మాష్‌లు, డ్రాప్ షాట్‌లు, వైవిధ్యభరిత సర్వీస్‌లు... ఇలా అన్ని విభాగాల్లో సైనా తన ఆటతీరును పరీక్షించుకుంది. ఈ మ్యాచ్‌లో ఓల్గా నెగ్గిన తొమ్మిది పాయింట్లలో ఎక్కువగా సైనా చేసిన అనవసర తప్పిదాలతో వచ్చినవే కావడం గమనార్హం.