గ్వాంగ్‌జూ (చైనా): ఏడాది విరామం తర్వాత బరిలోకి దిగినప్పటికీ తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని చైనా స్టార్ లిన్ డాన్ నిరూపించుకున్నాడు. సొంతగడ్డపై జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో లిన్ డాన్ పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను ఐదోసారి నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)తో జరిగిన ఫైనల్లో లిన్ డాన్ 16-21, 21-13, 20-17తో ఆధిక్యంలో ఉన్నదశలో మోకాలి గాయంతో లీ చోంగ్ వీ వైదొలిగాడు. గత ఏడాది ఆగస్టులో లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచాక లిన్ డాన్ ఇప్పటిదాకా ఈ టోర్నీలోనూ పాల్గొనలేదు. దాంతో అతని ర్యాంక్ 286కు చేరుకుంది. ఫలితంగా సొంతగడ్డపై జరిగిన మెగా ఈవెంట్‌లో నిర్వాహకులు అతనికి ‘వైల్డ్ కార్డు’ను కేటాయించారు. గతంలో లిన్ డాన్ 2006, 2007, 2009, 2011లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.
13 ఏళ్ల తర్వాత...
మహిళల సింగిల్స్ విభాగంలో 18 ఏళ్ల థాయ్‌లాండ్ సంచలనం ఇంతనోన్ రత్చనోక్ తన జోరును కొనసాగిస్తూ పిన్న వయస్సులో ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన ప్లేయర్‌గా చరిత్ర లిఖించింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ లీ జురుయ్ (చైనా)తో జరిగిన ఫైనల్లో రత్చనోక్ 22-20, 21-18తో విజయం సాధించింది. 1999లో కామిల్లా మార్టిన్ (డెన్మార్క్) తర్వాత చైనాయేతర క్రీడాకారిణి వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది. థాయ్‌లాండ్ నుంచి విశ్వవిజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా కూడా రత్చనోక్ గుర్తింపు పొందింది. పురుషుల డబుల్స్‌లో మహ్మద్ అహసాన్-హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా); మహిళల డబుల్స్‌లో జియోలి వాంగ్-యాంగ్ యూ (చైనా); మిక్స్‌డ్ డబుల్స్‌లో తొంతోవి అహ్మద్-నాత్సిర్ (ఇండోనేసియా) జోడిలు టైటిల్స్ నెగ్గాయి.
లిన్ డాన్, రత్చనోక్ కొత్త చరిత్ర
Published Mon, Aug 12 2013 2:58 AM | Last Updated on Fri, Jul 12 2019 4:28 PM
Advertisement
Advertisement