గడిచిన ఆగస్ట్ నెల టెకీల పాలిట దారుణంగా పరిణమించింది. ఈ ఒక్క నెలలోనే టెక్ రంగంలో ఏకంగా 27,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 40 కంటే ఎక్కువ కంపెనీలు లే-ఆఫ్‌లను ప్రకటించాయి. ఈ తాజా రౌండ్ తొలగింపులను కలుపుకొంటే గడిచిన ఏడాదిగా 422 కంపెనీలలో లేఆఫ్‌లు 136,000 లకు పెరిగాయి.
ఈ ఉద్యోగ కోతల్లో ఇంటెల్ అగ్రగామిగా ఉంది. ఇది 15,000 మంది ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఇది దాని ఉద్యోగులలో 15%. సీపీయూ చిప్ టెక్నాలజీలో కంపెనీ అగ్రగామిగా ఉన్నప్పటికీ అధిక వ్యయాలు, తక్కువ మార్జిన్‌ల కారణంగా ఖర్చుల తగ్గింపు ప్రణాళికకు పూనుకుంది. 2020 నుంచి 2023 మధ్యకాలంలో కంపెనీ 10% ఎక్కువ మంది ఉద్యోగులను ఇంటెల్ నియమించుకుంది.
ఇక టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీ సంస్థ సిస్కో సిస్టమ్స్ తన వర్క్ ఫోర్స్‌లో దాదాపు 6,000 మంది లేదా 7 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలిపింది. జాబితాలో మరొక పెద్ద పేరు ఐబీఎం. ఈ కంపెనీ చైనాలో దాని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇది వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగింపునకు దారితీసింది.
మార్కెట్ పరిస్థితులు, మందగించిన ఆర్థిక కార్యకలాపాల కారణంగా జర్మన్ చిప్‌మేకర్ ఇన్ఫినియన్ కూడా 1,400 మంది ఉద్యోగులను తొలగించి, మరో 1,400 మందిని తక్కువ ఖర్చుతో కూడిన ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రణాళిక రచించింది. గోప్రో కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో 15% లేదా దాదాపు 140 మంది తగ్గించింది. ఇక యాపిల్ 100 మంది ఉద్యోగులను తొలగించింది.
డెల్ టెక్నాలజీస్ కూడా భారీగానే తొలగింపులు చేపట్టనున్నట్లు వార్తల్లో నిలిచింది. బెంగళూరుకు చెందిన రేషామండి అనే అగ్రిటెక్ సంస్థ మొత్తం సిబ్బందిని తొలగించి మూతపడింది. వెబ్ బ్రౌజర్ కంపెనీ అయిన బ్రేవ్ 27 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.సోషల్ మీడియా సంస్థ షేర్‌చాట్ తన ఉద్యోగులలో 5% మందిని వదులుకుంటున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment