సింధు సూపర్
మాజీ నంబర్‌వన్ లీ జురుయ్‌పై గెలుపు
క్వార్టర్స్‌కు చేరిన భారత స్టార్
సైనా, జ్వాల జోడీ కూడా ముందుకు
పోరాడి ఓడిన శ్రీకాంత్, ప్రణయ్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధు సంచలనం సృష్టించింది.లీజురుయ్ రూపంలో అడ్డొచ్చిన చైనా గోడను సింధు బద్దలు కొడితే... సైనాతో పాటు జ్వాల ద్వయం అలవోకగా నెగ్గి క్వార్టర్స్‌కు చేరారు.
జకార్తా: గాయాల కారణంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు... ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పెను సంచలనం నమోదు చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 21-17, 14-21, 21-17తో ప్రపంచ మూడో ర్యాంకర్ లీ జురుయ్ (చైనా)పై అద్భుత విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో రెండోసీడ్ సైనా నెహ్వాల్ 21-18, 21-14తో 14వ సీడ్ సయాకి తకహషీ (జపాన్)పై అలవోకగా నెగ్గింది. తద్వారా ఈ ఇద్దరూ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. ఇందులో గెలిస్తే కనీసం కాంస్య పతకాలైనా లభిస్తాయి. ఆరంభంలో కాస్త తడబడటంతో తొలిగేమ్‌లో 0-7తో వెనుకబడిన సైనా తర్వాత నెమ్మదిగా పుంజుకుంది.
రెండో గేమ్‌లో ఓ దశలో స్కోరు 16-16, 18-18తో సమమైనా... మూడు వరుస పాయింట్లతో సైనా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు జురుయ్‌తో 50 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు అమోఘమైన ఆటతీరును ప్రదర్శించింది. ప్రత్యర్థి నుంచి ఎదురుదాడి ఎదురైనా.. కీలక సమయంలో చెలరేగింది. తొలి గేమ్‌లో అద్భుతంగా ఆడిన సింధు, జురుయ్‌కు అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. కానీ రెండో గేమ్‌లో జురుయ్ తన అనుభవాన్ని ఉపయోగించి ఆకట్టుకుంది. కీలక మూడో గేమ్‌లో ఇరువురు హోరాహోరీగా తలపడటంతో స్కోరు 13-13, 14-14తో సమంగా సాగింది. ఈ దశలో సింధు నాలుగు వరుస పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని 18-14కు పెంచుకుంది. తర్వాత ప్రత్యర్థిని కట్టడి చేస్తూ గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.
మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో 13వ సీడ్ జ్వాల-అశ్విని 21-15, 18-21, 21-19తో 8వ సీడ్ రెకా కకివా-మియుకీ మేధ (జపాన్)లపై నెగ్గి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ కిడాంబి శ్రీకాంత్ 21-14, 17-21, 21-23తో 13వ సీడ్ హు యున్ (హాంకాంగ్) చేతిలో; 11వ సీడ్ హెచ్.ఎస్. ప్రణయ్ 16-21, 21-19, 18-21తో ఏడోసీడ్ విక్టర్ అక్సెల్‌సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు.