P. V. Sindhu
-
సింధు సంపాదన రూ.39 కోట్లు
న్యూయార్క్: తెలుగుతేజం, బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు ప్రపంచ సంపన్న మహిళా క్రీడాకారిణుల జాబితాలో 13వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో భారత్ నుంచి ఆమె ఒక్కరికే చోటు దక్కడం విశేషం. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ఆమె గతేడాది సంపాదన రూ. 39 కోట్లు (5.5 మిలియన్ డాలర్లు)గా తేల్చింది. ‘సింధు విలువైన మార్కెట్ కలిగిన భారత మహిళా అథ్లెట్‌గా కొనసాగుతోంది. ఆమె గతేడాది సీజన్ ముగింపు టోర్నీ అయిన ‘బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్’లో విజేతగా నిలువడంతో ఆమె బ్రాండింగ్‌కు ఢోకా లేకపోయింది’ అని ఫోర్బ్స్ తెలిపింది. ఈ ఆదాయంలో ప్రైజ్‌మనీ, కాంట్రాక్టు ఫీజులు, బోనస్, ఎండార్స్మెంట్లు, అప్పియరెన్స్ ఫీజులు అన్ని కలిసి ఉన్నాయని ఆ సంస్థ వెల్లడించింది. అత్యధికంగా ఆర్జించే మహిళా అథ్లెట్ల టాప్–15 జాబితాలో భారత్ నుంచి మరే క్రీడాకారిణి కూడా ఆమె సమీప దూరంలో లేదు. ఈ లిస్ట్‌లో అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ 29.2 మిలియన్ డాలర్ల (రూ. 207 కోట్లు)తో అగ్రస్థానంలో ఉంది. -
సింధుకు చుక్కెదురు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాది తన తొలి టైటిల్ కోసం మరికొంత కాలం నిరీక్షించక తప్పదు. ఈ సీజన్లో పాల్గొన్న ఏడో టోర్నమెంట్లోనూ ఆమెకు నిరాశ ఎదురైంది. సింధుతోపాటు ఒకేరోజు పురుషుల సింగిల్స్ విభాగంలో ముగ్గురు భారత అగ్రశ్రేణి క్రీడాకారులు ఓడిపోవడంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో భారత కథ ముగిసింది. న్యూఢిల్లీ: అందివచ్చిన అవకాశాలను చేజార్చుకోవడంతో భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ ఐదో ర్యాంకర్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు ఊహించని పరాజయం ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో సింధు పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. సిడ్నీలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సింధు 19–21, 18–21తో ప్రపంచ 29వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు రెండు గేముల్లోనూ ఒకదశలో ఆధిక్యంలో నిలిచింది. కానీ ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేక చతికిలపడింది. జిందాపోల్‌తో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో సింధు ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే. చివరిసారి సింధు 2016 సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నీలో జిందాపోల్ చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్, సమీర్ వర్మ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయారు. చైనా దిగ్గజం లిన్ డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 17–21, 22–20, 14–21తో ఓడిపోయాడు. రెండో సీడ్ ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ 23–25, 9–21తో ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్‌లో గట్టిపోటీనిచ్చిన సాయిప్రణీత్ రెండో గేమ్‌లో చేతులెత్తేశాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 16–21, 21–7, 13–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 19–21, 18–21తో లి జున్హుయ్–లియు యుచెన్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ఆ సవాల్‌కు సింధు, సైనా సిద్ధం
సాక్షి, హైదరాబాద్: భారత టాప్‌స్టార్స్‌కు మింగుడు పడని చైనీస్ తైపీ ప్రత్యర్థి తై జు యింగ్‌ను త్వరలోనే ఓడిస్తామని బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఆసియా గేమ్స్‌లో సింధు, సైనాలిద్దరు రజత, కాంస్య పతకాలు సాధించారు. వీరిద్దరిని ప్రపంచ నంబర్‌వన్ తై జునే ఓడించింది. భారత బ్యాడ్మింటన్ బృందం స్వదేశం చేరాక ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోచ్ మాట్లాడుతూ ‘సింధు, సైనాలిద్దరు మేటి షట్లర్లు. మానసిక, శారీరక స్థైర్యంతో ఉన్నారిద్దరు. ఎవరికి తీసిపోరు. అంత తేలిగ్గా ఓడిపోరు. త్వరలోనే తైపీ మిస్టరీని ఛేదిస్తారు. రచనోక్ ఇంతనోన్‌ను ఓడించినట్లే తై జుపై గెలుస్తారు. ఏటా చాలా టోర్నీలు జరుగుతున్నాయి. ఇందులో ఆడటం ద్వారా ప్రదర్శన, పోటీతత్వం మరింత మెరుగవుతాయి. అప్పుడు ఆమెను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు’ అని అన్నారు. టాప్‌స్టార్స్ ఇద్దరు కలిసి ఆమె చేతిలో మొత్తం 22 మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. దీనిపై గోపీ మాట్లాడుతూ ‘నిజం చెప్పాలంటే ఆమె ఓ లేడీ తౌఫిక్ హిదాయత్ (మాజీ ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్). అన్నింటా మెరుగైన ప్రత్యర్థి. కోర్టుల్లో చురుగ్గా కదం తొక్కుతుంది. తనకెదురైన ప్రత్యర్థికి దీటుగా బదులిస్తుంది. స్మార్ట్‌గా స్పందిస్తుంది. అన్ని రంగాల్లోనూ బలంగా ఉంది. ప్రస్తుతం తై జు, మారిన్ (స్పెయిన్) ప్రపంచ టాప్ షట్లర్లు. వీరిని ఓడించే వ్యూహాలతో సిద్ధమవుతాం’ అని వివరించారు. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్‌లో తొలిసారి రెండు పతకాలు గెలవడం ఆనందంగా ఉందన్నారు. 23 ఏళ్ల సింధు మాట్లాడుతూ ‘పోడియం ఫినిష్ ఎప్పటికీ చిరస్మరణీయమే. పతక విజేతగా నిలబడి మనముందు జాతీయ జెండా ఎగురుతుంటే ఆ ఆనందాన్ని వర్ణించలేను. అయితే ఈ పతకాలను ఆస్వాదించే సమయం కూడా మాకు లేదు. జపాన్ ఓపెన్ (సెప్టెంబర్ 11 నుంచి) కోసం వెంటనే సన్నాహకాల్లో పాల్గొనాలి’ అని చెప్పింది. తన ఆసియా గేమ్స్ పతకాన్వేషణ ఎట్టకేలకు జకార్తాలో ముగిసిందని సైనా తెలిపింది. ‘నాకు ఇది నాలుగో ఏషియాడ్. గత మూడు ఈవెంట్లలోనూ ఎంతో కష్టపడ్డా సాధ్యం కాలేదు. చివరకు ఇక్కడ సాకారమైంది’ అని చెప్పింది. -
సింధు సూపర్
మాజీ నంబర్‌వన్ లీ జురుయ్‌పై గెలుపు క్వార్టర్స్‌కు చేరిన భారత స్టార్ సైనా, జ్వాల జోడీ కూడా ముందుకు పోరాడి ఓడిన శ్రీకాంత్, ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధు సంచలనం సృష్టించింది.లీజురుయ్ రూపంలో అడ్డొచ్చిన చైనా గోడను సింధు బద్దలు కొడితే... సైనాతో పాటు జ్వాల ద్వయం అలవోకగా నెగ్గి క్వార్టర్స్‌కు చేరారు. జకార్తా: గాయాల కారణంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు... ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పెను సంచలనం నమోదు చేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 21-17, 14-21, 21-17తో ప్రపంచ మూడో ర్యాంకర్ లీ జురుయ్ (చైనా)పై అద్భుత విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో రెండోసీడ్ సైనా నెహ్వాల్ 21-18, 21-14తో 14వ సీడ్ సయాకి తకహషీ (జపాన్)పై అలవోకగా నెగ్గింది. తద్వారా ఈ ఇద్దరూ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. ఇందులో గెలిస్తే కనీసం కాంస్య పతకాలైనా లభిస్తాయి. ఆరంభంలో కాస్త తడబడటంతో తొలిగేమ్‌లో 0-7తో వెనుకబడిన సైనా తర్వాత నెమ్మదిగా పుంజుకుంది. రెండో గేమ్‌లో ఓ దశలో స్కోరు 16-16, 18-18తో సమమైనా... మూడు వరుస పాయింట్లతో సైనా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరోవైపు జురుయ్‌తో 50 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు అమోఘమైన ఆటతీరును ప్రదర్శించింది. ప్రత్యర్థి నుంచి ఎదురుదాడి ఎదురైనా.. కీలక సమయంలో చెలరేగింది. తొలి గేమ్‌లో అద్భుతంగా ఆడిన సింధు, జురుయ్‌కు అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. కానీ రెండో గేమ్‌లో జురుయ్ తన అనుభవాన్ని ఉపయోగించి ఆకట్టుకుంది. కీలక మూడో గేమ్‌లో ఇరువురు హోరాహోరీగా తలపడటంతో స్కోరు 13-13, 14-14తో సమంగా సాగింది. ఈ దశలో సింధు నాలుగు వరుస పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని 18-14కు పెంచుకుంది. తర్వాత ప్రత్యర్థిని కట్టడి చేస్తూ గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో 13వ సీడ్ జ్వాల-అశ్విని 21-15, 18-21, 21-19తో 8వ సీడ్ రెకా కకివా-మియుకీ మేధ (జపాన్)లపై నెగ్గి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ కిడాంబి శ్రీకాంత్ 21-14, 17-21, 21-23తో 13వ సీడ్ హు యున్ (హాంకాంగ్) చేతిలో; 11వ సీడ్ హెచ్.ఎస్. ప్రణయ్ 16-21, 21-19, 18-21తో ఏడోసీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడారు.