భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాది తన తొలి టైటిల్ కోసం మరికొంత కాలం నిరీక్షించక తప్పదు. ఈ సీజన్‌లో పాల్గొన్న ఏడో టోర్నమెంట్‌లోనూ ఆమెకు నిరాశ ఎదురైంది. సింధుతోపాటు ఒకేరోజు పురుషుల సింగిల్స్ విభాగంలో ముగ్గురు భారత అగ్రశ్రేణి క్రీడాకారులు ఓడిపోవడంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్‌లో భారత కథ ముగిసింది.
న్యూఢిల్లీ: అందివచ్చిన అవకాశాలను చేజార్చుకోవడంతో భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ ఐదో ర్యాంకర్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు ఊహించని పరాజయం ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్‌లో సింధు పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. సిడ్నీలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సింధు 19–21, 18–21తో ప్రపంచ 29వ ర్యాంకర్ నిచావోన్ జిందాపోల్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు రెండు గేముల్లోనూ ఒకదశలో ఆధిక్యంలో నిలిచింది. కానీ ఆ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేక చతికిలపడింది. జిందాపోల్‌తో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో సింధు ఓడిపోవడం ఇది రెండోసారి మాత్రమే.
చివరిసారి సింధు 2016 సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నీలో జిందాపోల్ చేతిలో ఓటమి పాలైంది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్, సమీర్ వర్మ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయారు. చైనా దిగ్గజం లిన్ డాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ 17–21, 22–20, 14–21తో ఓడిపోయాడు. రెండో సీడ్ ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో సాయిప్రణీత్ 23–25, 9–21తో ఓటమి పాలయ్యాడు. తొలి గేమ్‌లో గట్టిపోటీనిచ్చిన సాయిప్రణీత్ రెండో గేమ్‌లో చేతులెత్తేశాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 16–21, 21–7, 13–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలయ్యాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట 19–21, 18–21తో లి జున్‌హుయ్–లియు యుచెన్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment