తొలి అడుగు అదిరె... | Kidambi Srikanth, Sameer Verma storm into second round | Sakshi
Sakshi News home page

తొలి అడుగు అదిరె...

Published Tue, Aug 22 2017 12:25 AM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

తొలి అడుగు అదిరె...

తొలి అడుగు అదిరె...

శ్రీకాంత్‌ శుభారంభం
తొలి రౌండ్‌లో అలవోక విజయం
సమీర్‌ వర్మ కూడా ముందంజ
ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌


పతకమే లక్ష్యంగా ప్రపంచ చాంపియన్‌షిప్‌ బరిలోకి దిగిన భారత స్టార్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ తొలి అడ్డంకిని విజయవంతంగా అధిగమించాడు. కేవలం అరగంటలోపే తన ప్రత్యర్థి ఆట కట్టించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన సమీర్‌ వర్మ కూడా బోణీ చేయగా... మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–మనీషా జంట కూడా గెలిచింది.

గ్లాస్గో (స్కాట్లాండ్‌): వరుసగా రెండు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ అదే జోరును ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ కొనసాగిస్తున్నాడు. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన శ్రీకాంత్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో శ్రీకాంత్‌ 21–13, 21–12తో కేవలం 29 నిమిషాల్లో సెర్గీ సిరాంట్‌ (రష్యా)ను ఓడించాడు. ఆరంభంలో కాస్త తడబడ్డ శ్రీకాంత్‌ వెంటనే తేరుకొని తన సహజశైలిలో విజృంభించాడు. నెట్‌ వద్ద పైచేయి సాధిస్తూనే, పదునైన స్మాష్‌లతో అదరగొట్టాడు.

తొలి గేమ్‌లో 11–6తో ముందంజ వేసిన శ్రీకాంత్‌ ఆ తర్వాత అదే దూకుడుతో తన ఆధిక్యాన్ని 15–7కు పెంచుకున్నాడు. తొలి గేమ్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతం చేసుకున్న శ్రీకాంత్‌కు రెండో గేమ్‌లోనూ పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. అయినప్పటికీ ఏ దశలోనూ శ్రీకాంత్‌ నిర్లక్ష్యానికి తావివ్వకుండా ఆడుతూ నిలకడగా పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మరోవైపు పాబ్లీ అబియాన్‌ (స్పెయిన్‌)తో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సమీర్‌ వర్మ 21–8, 17–4తో ఆధిక్యంలో ఉన్న దశలో అబియాన్‌ గాయంతో వైదొలిగాడు.   

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–మనీషా (భారత్‌) ద్వయం 24–22, 21–17తో టామ్‌ చున్‌ హీ–ఎన్జీ సాజ్‌ యావు (హాంకాంగ్‌) జోడీపై నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకుంది.  పురుషుల డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి (భారత్‌) జోడీ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. సుమీత్‌–మనూ అత్రి 20–22, 11–21తో చుంగ్‌ ఇయు సియోక్‌–కిమ్‌ డ్యూక్‌యంగ్‌ (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో తన్వీ లాడ్‌ (భారత్‌) 17–21, 21–10, 21–19తో చోల్‌ బిర్చ్‌ (ఇంగ్లండ్‌)ను ఓడించింది.
మరో మ్యాచ్‌లో ప్రాజక్తా సావంత్‌ (భారత్‌)–యోగేంద్రన్‌ కృష్ణన్‌ (మలేసియా) జంట 21–15, 13–21, 21–18తో లియు చింగ్‌ యావో–చియాంగ్‌ కయ్‌ సిన్‌ (చైనీస్‌ తైపీ) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో ఆరతి సారా సునీల్‌–సంజన సంతోష్‌ (భారత్‌) జంట 21–15, 21–18తో నటాల్యా వ్యోట్సెక్‌–యెలజెవెటా జర్కా (ఉక్రెయిన్‌) ద్వయంపై నెగ్గింది.  

మంగళవారం జరిగే మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో కిమ్‌ హ్యో మిన్‌ (కొరియా)తో పీవీ సింధు; పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో వీ నాన్‌ (హాంకాంగ్‌)తో సాయిప్రణీత్‌; వ్రాబెర్‌ (ఆస్ట్రియా)తో అజయ్‌ జయరామ్‌ తలపడతారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో ప్రాజక్తా–యోగేంద్రన్‌లతో ప్రణవ్‌ చోప్రా–సిక్కి రెడ్డి; క్రిస్టియాన్సన్‌–సారా తిగెసన్‌ (డెన్మార్క్‌)లతో సాత్విక్‌–మనీషా; వాంగ్‌ యిలు–డాంగ్‌పింగ్‌ (చైనా)లతో సుమీత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప; మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రిరిన్‌ అమెలియా (ఇండోనేసియా)–చింగ్‌ చెయోంగ్‌ (మలేసియా)లతో సిక్కి రెడ్డి–అశ్విని; పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో హిరోయుకి–యుటా వటనాబె (జపాన్‌)లతో సాత్విక్‌–చిరాగ్‌ శెట్టి తలపడతారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement