కౌలూన్ (హాంకాంగ్): ఈ ఏడాది వరల్డ్ టూర్ బ్యాడ్మింటన్ సర్క్యూట్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్‌లో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 17–21, 13–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయాడు. గతంలో నిషిమోటోతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన శ్రీకాంత్ ఈసారి మాత్రం 44 నిమిషాల్లో చేతులెత్తేశాడు.
ఈ ఏడాది ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్స్ కాకుండా వరల్డ్ టూర్ సర్క్యూట్‌కు చెందిన పది టోర్నమెంట్‌లలో పాల్గొన్న శ్రీకాంత్ రెండింటిలో మాత్రం సెమీఫైనల్‌కు చేరుకొని, మిగతా ఎనిమిది టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయాడు. మరోవైపు రెండేళ్ల క్రితం ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత ప్లేయర్ సమీర్ వర్మ ఈసారి నిరాశపరిచాడు. క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 15–21, 21–19, 11–21తో లీ చెయుక్ యుయి (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment