Samir Verma
-
క్వార్టర్స్‌లో సింధు
బ్యాంకాక్: ప్రపంచ చాంపియన్ పీవీ సింధు థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత స్టార్ షట్లర్ 21–10, 21–12తో కిసొనా సెల్వడ్యురె (మలేసియా)ను ఓడించింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ... డెన్మార్క్ ఆటగాడు రస్మస్ గెంకెను వరుస గేముల్లో 21–12, 21–9తో చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్ చేరాడు. మరో మ్యాచ్‌లో ప్రణయ్ 17–21, 18–21తో మలేసియాకు చెందిన లియూ డారెన్ చేతిలో పరాజయం చవిచూశాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 21–18, 23–21తో ఏడో సీడ్ చొయి సొల్గి యు–సి సియంగ్ జె (కొరియా) జంటకు షాకిచ్చింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్–అశ్విని పొన్నప్ప జోడీ 22–20, 14–21, 21–16తో జర్మనీకి చెందిన మార్క్ లమ్స్‌ఫుస్–ఇసాబెల్ హెర్ట్రిచ్ జంటను ఓడించి ముందంజ వేసింది. అర్జున్–ధ్రువ్ కపిల జంట ప్రిక్వార్టర్స్‌లో 9–21, 11–21తో బెన్ లెన్–సియాన్ వెండి (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడింది. -
తప్పుడు నిర్ణయం... తగిన మూల్యం
నానింగ్ (చైనా): ప్రత్యర్థి ర్యాంక్ ఆధారంగా వారి ప్రతిభను తక్కువ అంచనా వేసి... విజయం సాధిస్తామనే ధీమాతో తప్పుడు నిర్ణయం తీసుకుంటే... తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భారత బ్యాడ్మింటన్ కోచ్‌ల బృందానికి తెలిసొచ్చింది. ప్రపంచ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్ సుదిర్మన్ కప్‌లో భాగంగా గ్రూప్–1‘డి’లో మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–3తో అనూహ్య ఓటమిని ఎదుర్కొంది. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ కిడాంబి శ్రీకాంత్‌ను కాదని... సమీర్ వర్మను ఆడించాలని కోచ్‌లు తీసుకున్న నిర్ణయం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప 16–21, 21–17, 24–22తో గో సూన్ హువాట్–లై షెవోన్ జెమీ (మలేసియా)లను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించారు. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్ సమీర్ వర్మ 13–21, 15–21తో ప్రపంచ 20వ ర్యాంకర్ లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. దాంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ పీవీ సింధు 21–12, 21–8తో గో జి వె (మలేసియా)పై నెగ్గడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వచ్చింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో ప్రపంచ 24వ ర్యాంక్ జోడీ సుమీత్ రెడ్డి–మను అత్రి 20–22, 19–21తో ప్రపంచ 1394 ర్యాంక్ జంట ఆరోన్ చియా–తియో ఈ యి (మలేసియా) చేతిలో ఓడిపోయింది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 1394వ స్థానంలో ఉన్నప్పటికీ ఆరోన్–తియో జోడీ పట్టుదలతో పోరాడి మలేసియాను నిలబెట్టింది. ఇక చివరి మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో ప్రపంచ 25వ ర్యాంక్ ద్వయం సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 11–21, 19–21తో ప్రపంచ 13వ ర్యాంక్ జోడీ చౌ మె కువాన్–లీ మెంగ్ యీన్ (మలేసియా) చేతిలో ఓటమి పాలవ్వడంతో భారత్ పరాజయం ఖాయమైంది. ఒకవేళ శ్రీకాంత్‌ను పురుషుల సింగిల్స్‌లో ఆడించి ఉంటే, అతను గెలిచి ఉంటే భారత్ విజయం డబుల్స్ మ్యాచ్లకంటే ముందుగానే 3–0తో ఖాయమయ్యేది. కానీ శ్రీకాంత్కంటే సమీర్ వర్మపైనే కోచ్‌లు ఎక్కువ నమ్మకం ఉంచారు. కానీ వారి నిర్ణయం బెడిసికొట్టింది. భారత జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరాలంటే పదిసార్లు చాంపియన్ చైనాతో నేడు జరిగే మ్యాచ్‌లో భారత్ తప్పకుండా గెలవాలి. -
సైనా, సింధు ముందుకు...
వుహాన్ (చైనా): గత ఏడాది ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి భారత్‌కు సింగిల్స్ విభాగాల్లో ఒకేసారి రెండు కాంస్య పతకాలు లభించాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈసారి ఏకంగా మూడు పతకాలు మన ఖాతాలో జమయ్యే అవకాశముంది. తమపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు, సైనా నెహ్వాల్... పురుషుల సింగిల్స్ విభాగంలో సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్ చేరుకొని పతకానికి విజయం దూరంలో నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటివరకు సైనా మూడు కాంస్య పతకాలను (2010, 2016, 2018లలో)... సింధు (2014లో) ఒక కాంస్య పతకాన్ని సాధించారు. గత ఏడాది పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ సైనా 21–13, 21–13తో కిమ్ గా యున్ (కొరియా)పై గెలుపొందగా... నాలుగో సీడ్ సింధు 21–15, 21–19తో చురిన్నిసా (ఇండోనేసియా)ను ఓడించింది. కిమ్‌తో జరిగిన మ్యాచ్‌లో సైనా ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. కేవలం 38 నిమిషాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. చురిన్నిసాతో జరిగిన మ్యాచ్‌లో రెండో గేమ్‌లో సింధు 17–19తో వెనుకబడిన దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి విజయతీరాలకు చేరింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 21–12, 21–19తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఉత్కర్‡్ష–కరిష్మా (భారత్) ద్వయం 10–21, 15–21తో ఫైజల్–గ్లోరియా (ఇండోనేసియా) జోడీ చేతిలో... వెంకట్–జూహీ దేవాంగన్ (భారత్) జంట 10–21, 9–21తో వాంగ్ యిలు–హువాంగ్ డాంగ్పింగ్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
సమీర్ నిష్క్రమణ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ సమీర్ వర్మ పోరాటం తొలిరౌండ్లోనే ముగిసింది. మంగళవారం పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా)తో తలపడిన సమీర్ పోరాడి ఓడాడు. మూడు గేమ్‌ల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అతను 20–22, 23–21, 12–21తో చైనా ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యాడు. 65 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో పరాజయం ఎదురైనప్పటికీ 24 ఏళ్ల సమీర్ అద్భుతంగా పోరాడాడు. తెలుగమ్మాయి, డబుల్స్ క్రీడాకారిణి సిక్కిరెడ్డికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్డ్ డబుల్స్ తొలిరౌండ్లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 22–20, 24–22తో సామ్ మ్యాగీ–క్లో మ్యాగీ (ఐర్లాండ్) జంటపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో జతకట్టిన ఆమె 20–22, 21–17, 20–22తో బయెక్ హ న–కిమ్ హె రిన్ (కొరియా) జంట చేతిలో ఓడింది. నేడు జరిగే మహిళల సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ పీవీ సింధు... జపాన్‌కు చెందిన అయ ఒహొరితో, ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్... థాయ్‌లాండ్ షట్లర్ పొర్న్‌పవి చొచువొంగ్‌తో తలపడతారు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో ఎనిమిదో సీడ్ కిడాంబి శ్రీకాంత్... ఇసాన్ మౌలాన ముస్తఫా (ఇండోనేసియా)తో, హెచ్.ఎస్. ప్రణయ్... సితికొమ్ తమసిన్ (థాయ్‌లాండ్)తో పోటీపడతారు. -
హంటర్స్ ఆట ముగిసింది
బెంగళూరు: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ హంటర్స్ ఆట ముగిసింది. పీవీ సింధు తనదైన జోరుతో రాణించినా... సహచరులంతా నిరాశపర్చడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ముంబై రాకెట్స్ 4–2తో హైదరాబాద్‌పై జయభేరి మోగించింది. నేడు జరిగే ఫైనల్లో బెంగళూరు రాప్టర్స్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. మొదట జరిగిన పురుషుల డబుల్స్‌లో బొదిన్ ఇసారా–కిమ్ స రంగ్ (హైదరాబాద్) జోడీ 14–15, 12–15తో కిమ్ జీ జంగ్– లీ యంగ్ డే ద్వయం చేతిలో ఓడింది. తర్వాత పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌ను ముంబై ‘ట్రంప్’గా ఎంచుకోగా ఇందులో సమీర్ వర్మ 15–8, 15–7తో మార్క్ కాల్జౌ (హైదరాబాద్)ను ఓడించాడు. దీంతో హంటర్స్ 0–3తో వెనుకబడింది. పీకల్లోతు ఒత్తిడిలో కూరుకుపోయిన ఈ దశలో... హైదరాబాద్ ఆశల్ని సింధు నిలబెట్టింది. హంటర్స్ ‘ట్రంప్’ అయిన మహిళ సింగిల్స్‌లో ఆమె 15–6, 15–5తో శ్రేయాన్షి పరదేశి (ముంబై)పై అలవోక విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ 2–3తో టచ్‌లోకి వచ్చింది. కానీ అనంతరం రెండో పురుషుల సింగిల్స్‌లో లీ హ్యున్ (హైదరాబాద్) 13–15, 6–15తో అండర్స్ అంటోన్సెన్ (ముంబై) చేతిలో కంగుతినడంతో హంటర్స్ ఖేల్ ఖతమైంది. ఫలితం తేలడంతో అప్రధానమైన మిక్స్డ్ డబుల్స్‌ను ఆడించలేదు. ఈ పోరులో సింధు బాధ్యత కనబరిస్తే మిగతా షట్లర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఏ ఒక్కరూ ఒక్క గేమైనా గెలవకుండా... వరుస గేముల్లో ప్రత్యర్థికి తలవంచారు. -
సెమీస్‌లో ముంబై రాకెట్స్
అహ్మదాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నాలుగో సీజన్లో ముంబై రాకెట్స్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఐదు జట్లతో తలపడిన ముంబై మూడింటిపై గెలిచి 19 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. శనివారం ఇక్కడ జరిగిన పోరులో ముంబై 5–0తో చెన్నై స్మాషర్స్‌ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ముంబై ఆటగాడు ఆండెర్స్ ఆంటోన్సెన్ 15–14, 15–11తో రాజీవ్ ఒసెఫ్‌పై గెలిచాడు. చెన్నై ‘ట్రంప్’మ్యాచ్ అయిన మిక్స్డ్ డబుల్స్‌లోనూ కిమ్ జీ జాంగ్–బెర్నాడ్త్ (ముంబై) జంట 15–14, 15–14తో క్రిస్ అడ్కాక్–గాబ్రియల్ అడ్కాక్ జోడీపై గెలవడంతో ముంబై 2–(–1)తో ఆధిక్యంలోకి వెళ్లింది. మహిళల సింగిల్స్‌లో చెన్నై ప్లేయర్ సుంగ్ జీ హ్యూన్ 15–7, 15–8తో అనురా ప్రభుదేశాయ్‌పై నెగ్గింది. ముంబై ‘ట్రంప్’అయిన పురుషుల సింగిల్స్‌లో సమీర్‌వర్మ 12–15, 15–13, 15–9తో పారుపల్లి కశ్యప్‌పై గెలిచి 4–0తో విజయాన్ని ఖాయం చేశాడు. చివరి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో కిమ్ జీ జాంగ్–లీ యాంగ్ డై జోడీ 15–8, 15–10తో ఆర్ చిన్ చుంగ్–సుమీత్ రెడ్డి ద్వయంపై గెలిచి 5–0తో ముగించింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు రాప్టర్స్ 4–3తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్‌పై గెలిచింది. నేడు ఢిల్లీ డాషర్స్‌తో పుణే సెవెన్ ఏసెస్, అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో హైదరాబాద్ హంటర్స్‌తో తలపడతాయి. -
చరిత్రకు చేరువలో...
ఈ ఏడాది లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను గెలిచి సీజన్‌ను సగర్వంగా ముగించేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు మరో విజయం దూరంలో నిలిచింది. ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్లో ఈ తెలుగు తేజం వరుసగా రెండో ఏడాది టైటిల్ పోరుకు అర్హత పొందింది. తద్వారా ఈ టోర్నీలో రెండుసార్లు ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు (2017లో), సైనా నెహ్వాల్ (2011లో), మిక్స్డ్ డబుల్స్‌లో గుత్తా జ్వాల–దిజు (2009లో) జంట ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచారు. ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో నేడు జరిగే ఫైనల్లో సింధు గెలిస్తే సీజన్ ముగింపు టోర్నమెంట్లో విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పుతుంది. గ్వాంగ్జూ (చైనా): తన అద్వితీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాది ఆరో టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఆమె వరుసగా రెండో ఏడాది అంతిమ సమరానికి అర్హత సాధించింది. 2013 ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 21–16, 25–23తో గెలుపొందింది. ఆదివారం జరిగే ఫైనల్లో 2017 ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. ముఖాముఖి రికార్డులో సింధు, ఒకుహారా 6–6తో సమంగా ఉన్నారు. రెండో సెమీఫైనల్లో ఒకుహారా 21–17, 21–14తో జపాన్‌కే చెందిన ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచిపై నెగ్గింది. రచనోక్‌తో జరిగిన సెమీఫైనల్లో సింధు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగింది. తన ప్రత్యర్థి సర్వీస్‌లకు పదునైన రిటర్న్ షాట్లతో జవాబు ఇచ్చింది. ఆరంభంలోనే 10–7తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. సింధు కొట్టిన షాట్ల గతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన రచనోక్ పలుమార్లు షటిల్స్‌ను వదిలేసింది. రెండో గేమ్‌లో మాత్రం ఇద్దరూ ప్రతీ పాయింట్‌కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. 27 షాట్లపాటు సాగిన ర్యాలీలో పైచేయి సాధించిన రచనోక్ స్కోరును 10–10తో సమం చేసింది. అనంతరం పలుమార్లు స్కోరు సమమయ్యాక 24–23 వద్ద సింధు కళ్లు చెదిరే స్మాష్ షాట్‌తో పాయింట్ గెల్చుకోవడంతోపాటు గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ‘గతంలో పాయింట్లు కోల్పోయాక వాటి గురించే ఆలోచించి మరిన్ని తప్పిదాలు చేసేదాన్ని. ఇప్పుడు అలా ఆలోచించడం లేదు. మానసికంగా చాలా దృఢంగా తయారయ్యాను. ఆధిక్యం పోయినా, పాయింట్లు చేజార్చుకున్నా వెంటనే తేరుకొని తర్వాతి పాయింట్‌పై దృష్టి పెడుతున్నాను. ఒకుహారాతో జరిగే ఫైనల్లో మానసిక స్థయిర్యం, సహనం, ఏకాగ్రత కీలకం కానున్నాయి. మేమిద్దరం ఆడే మ్యాచ్‌ల్లో సుదీర్ఘ ర్యాలీలు ఉంటాయి. ఈసారీ మ్యాచ్ సుదీర్ఘంగా సాగుతుందని భావిస్తున్నాను. ఆమెను ఏమాత్రం తక్కువ అంచనా వేయడంలేదు’ అని విజయానంతరం సింధు వ్యాఖ్యానించింది. మ్యాచ్ పాయింట్ చేజార్చుకున్న సమీర్ వర్మ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో భారత యువతార సమీర్ వర్మ 21–12, 20–22, 17–21తో ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్ గెలిచి, రెండో గేమ్‌లో సమీర్ వర్మ 20–19తో విజయం అంచున నిలిచాడు. ఈ దశలో షి యుకి వరుసగా మూడు పాయింట్లు గెలిచి రెండో గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో షి యుకి పైచేయి సాధించి సమీర్ వర్మ ఆట కట్టించాడు. మరో సెమీస్‌లో ప్రపంచ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) 21–14, 21–12తో సన్ వాన్ హో (కొరియా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో షి యుకితో మొమోటా ఆడతాడు. -
సెమీస్‌లో సైనా, సమీర్ వర్మ
లక్నో: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ కోసం నిరీక్షిస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. సయ్యద్ మోదీ స్మారక వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో సైనా సెమీ ఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సైనా 21–19, 21–14తో రితూపర్ణ దాస్ (భారత్)పై గెలిచింది. మరో క్వార్టర్ ఫైనల్లో తెలుగమ్మాయి చుక్కా సాయి ఉత్తేజితా రావు 9–21, 21–19, 12–21తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా) చేతిలో ఓటమి పాలైంది. సమీర్ వర్మ దూకుడు... పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ ముందంజ వేయగా... పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్ క్వార్టర్స్‌లోనే ఓడి ఇంటిదారి పట్టారు. క్వార్టర్స్‌లో సమీర్ వర్మ 21–18, 16–21, 21–11తో హు జెకీ (చైనా) పై గెలిచి సెమీస్‌కు దూసుకెళ్లాడు. కశ్యప్ 16–21, 19–21తో సిథికోమ్ థమాసిన్ (థాయ్‌లాండ్) చేతిలో... సాయి ప్రణీత్ 10–12, 21–19, 14–21తో లు గాంగ్జూ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి–చిరాగ్ శెట్టి జంట 15–21, 21–19, 21–17తో ఓయూ జూన్యై–రెన్ జియాంగ్యూ (చైనా) జోడీపై గెలిచి సెమీస్ చేరింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 19–21, 21–8, 21–18తో తానియా కుసుమ–వానియా సుకోకొ (ఇండోనేసియా) ద్వయంపై గెలిచి సెమీస్ చేరింది. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట సెమీస్‌లో అడుగుపెట్టింది. -
కాంస్యంతో సరి
ప్రపంచ జూనియర్ చాంపియన్ షిప్లో పురుషుల సింగిల్స్‌లో పతకం గెలిచిన ఆరో భారతీయ ప్లేయర్‌గా లక్ష్యసేన్ గుర్తింపు పొందాడు. గతంలో సమీర్ వర్మ (2011లో), సాయిప్రణీత్ (2010లో), ప్రణయ్ (2010లో), గురుసాయిదత్ (2008లో) కాంస్య పతకాలు నెగ్గగా... సిరిల్ వర్మ (2015లో) రజత పతకం సాధించాడు. జూనియర్ మహిళల సింగిల్స్‌లో మాత్రం సైనా స్వర్ణం (2008లో), కాంస్యం (2006లో) గెల్చుకుంది. మార్క్‌హామ్ (కెనడా): భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ లక్ష్య సేన్ కీలక పోరులో తడబడ్డాడు. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన అండర్–19 పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆసియా జూనియర్ చాంపియన్ లక్ష్య సేన్ 22–20, 16–21, 13–21తో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను నెగ్గిన లక్ష్య సేన్ రెండో గేమ్‌లో గతి తప్పాడు. ఈ ఏడాది ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కున్లావుత్‌ను ఓడించిన లక్ష్య సేన్ ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో సఫలం కాలేదు. రెండో గేమ్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచిన కున్లావుత్ నిర్ణాయక మూడో గేమ్‌లో మరింత జోరు పెంచగా... లక్ష్య సేన్ ప్రత్యర్థికి సరైన సమాధానం ఇవ్వలేక పోయాడు. ఈ గెలుపుతో ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్ ఫైనల్లో లక్ష్య సేన్ చేతిలో ఎదురైన ఓటమికి కున్లావుత్ బదులు తీర్చుకున్నాడు. ‘నేను సహజశైలిలో ఆడలేకపోయాను. తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నా ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయాను. రెండో గేమ్ నుంచి కున్లావుత్‌కు సరైన పోటీనివ్వలేకపోయాను’ అని ఉత్తరాఖండ్‌కు చెందిన 17 ఏళ్ల లక్ష్య సేన్ వ్యాఖ్యానించాడు. -
శ్రీకాంత్‌కు చుక్కెదురు
కౌలూన్ (హాంకాంగ్): ఈ ఏడాది వరల్డ్ టూర్ బ్యాడ్మింటన్ సర్క్యూట్లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్ల నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో భారత కథ ముగిసింది. బరిలో మిగిలిన కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 17–21, 13–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడిపోయాడు. గతంలో నిషిమోటోతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన శ్రీకాంత్ ఈసారి మాత్రం 44 నిమిషాల్లో చేతులెత్తేశాడు. ఈ ఏడాది ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ ఈవెంట్స్ కాకుండా వరల్డ్ టూర్ సర్క్యూట్‌కు చెందిన పది టోర్నమెంట్లలో పాల్గొన్న శ్రీకాంత్ రెండింటిలో మాత్రం సెమీఫైనల్‌కు చేరుకొని, మిగతా ఎనిమిది టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయాడు. మరోవైపు రెండేళ్ల క్రితం ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత ప్లేయర్ సమీర్ వర్మ ఈసారి నిరాశపరిచాడు. క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ 15–21, 21–19, 11–21తో లీ చెయుక్ యుయి (హాంకాంగ్) చేతిలో ఓడిపోయాడు. -
పురుషుల సింగిల్స్ సెమీస్‌లో గురుసాయిదత్
హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాళ్లు గురుసాయిదత్, సమీర్ వర్మ సెమీఫైనల్‌కు చేరారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో గురుసాయిదత్ 13–21, 22–20, 21–11తో లిమ్ చి వింగ్ (మలేసియా)పై; సమీర్ 16–21, 26–24, 21–7తో ప్రతుల్ జోషి (భారత్)పై నెగ్గారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకృష్ణప్రియ 12–21, 12–21తో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంట 22–20, 14–21, 21–17తో యోంగ్ మింగ్ నోక్–ఎన్జీ సాజ్ యావు (హాంకాంగ్) జోడీపై గెలిచింది. -
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్, సమీర్ వర్మ
సిడ్నీ: అలవోక విజయాలు సాధించిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు భమిడిపాటి సాయి ప్రణీత్, సమీర్ వర్మ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ సాయిప్రణీత్ 21–12, 21–14తో మౌలానా పంజి అహ్మద్ (ఇండోనేసియా)పై; నాలుగో సీడ్ సమీర్ వర్మ 21–16, 21–12తో టకుమా ఉయెదా (జపాన్)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి జంట 21–17, 21–17తో హుక్ జిన్ చొయి–యుంగ్ హూన్ పర్క్ జోడీపై; అర్జున్–రామచంద్రన్ ద్వయం 21–15, 25–23తో ఒకముర–ఒనోదెరా (జపాన్) జంటపై గెలిచింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి 5–21, 5–21తో హన్ యూ (చైనా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మేఘన–పూర్విషా జంట 11–21, 13–21తో మికి కశిహర–మియుకీ కటో (జపాన్) జోడీ చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో శివమ్ శర్మ–పూర్విషా రామ్ ద్వయం 6–21, 13–21తో సెంగ్ జాయి సియొ–చై యూజుంగ్ (కొరియా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
ప్రిక్వార్టర్స్‌లో సాయిప్రణీత్
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్, సమీర్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. తొలి రౌండ్లో ప్రణీత్ 21–17, 21–14తో మిష జిల్బెర్మన్ (ఇజ్రాయిల్)పై; సమీర్ 13–21, 21–17, 21–12తో అభినవ్ (న్యూజిలాండ్)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో సౌరభ్ వర్మ 21–19, 17–21, 12–21తో టకుమా ఉయెదా (జపాన్) చేతిలో... జయరామ్ 20–22, 22–20, 21–17తో టకెశిటా (జపాన్) చేతిలో... లక్ష్యసేన్ 20–22, 21–13, 19–21తో లీ చెక్ యూ (హాంకాంగ్) చేతిలో... రాహుల్ యాదవ్ 11–21, 17–21తో మౌలానా (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి 19–21, 21–15, 21–15తో జార్జినా బ్లాండ్ (ఇంగ్లండ్)పై గెలిచింది. సాయి ఉత్తేజిత 8–21, 19–21తో మినె (జపాన్) చేతిలో... శ్రీకృష్ణప్రియ 18–21, 20–22తో యూలియా (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. -
క్వార్టర్స్‌లో సాయి ప్రణీత్
అక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత షట్లర్లు సాయి ప్రణీత్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ 21–18, 21–17తో డారెన్ ల్యూ (మలేసియా)పై; సమీర్ వర్మ 21–17, 21–19తో లీ చౌక్ యూ (హాంకాంగ్)పై గెలుపొంది క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. యువ షట్లర్ లక్ష్యసేన్, అజయ్ జయరామ్ ప్రిక్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యారు. లక్ష్యసేన్ 21–15, 15–21, 12–21తో బ్యాడ్మింటన్ దిగ్గజం, టాప్ సీడ్ లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడాడు. అజయ్ జయరామ్ 15–21, 22–20, 6–21తో వాంగ్ హీ హియో (దక్షిణ కొరియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి ద్వయం 21–9, 21–12తో అనువిత్–నథాపాట్ ట్రింకజీ (థాయ్‌లాండ్) జోడీ పై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. మిక్స్డ్ డబుల్స్‌లో శివమ్ శర్మ–పూర్విషా రామ్ జంట రెండో రౌండ్లో 16–21, 14–21తో చాన్ పెంగ్ సూన్–లియూ యింగ్ గో (మలేసియా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో మేఘన–పూర్విషా రామ్ జంట 15–21, 6–21తో డెల్లా హ్యారిస్–రిజ్కి ప్రదీప్త (ఇండోనేసియా) చేతిలో ఓడింది. -
సెమీస్‌లో సమీర్ వర్మ
న్యూఢిల్లీ: ఓర్లీన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు సమీర్ వర్మ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సమీర్ 17–21, 21–19, 21–15తో లుకాస్ కోర్వీ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో కిడాంబి నందగోపాల్–ఆల్విన్ ఫ్రాన్సిస్ (భారత్) ద్వయం 21–19, 14–21, 8–21తో మార్క్ లామ్స్‌ఫస్–మార్విన్ సీడెల్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ముంబై రాకెట్స్ బోణీ
గువాహటి: రెండు ‘ట్రంప్’ మ్యాచ్‌ల్లో గెలిచిన ముంబై రాకెట్స్ జట్టు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో శుభారంభం చేసింది. ఢిల్లీ డాషర్స్‌తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై రాకెట్స్ 4–1 పాయింట్ల తేడాతో గెలుపొందింది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో లీ యోంగ్ డే–తాన్ బూన్ హెంగ్ (ముంబై) ద్వయం 14–15, 15–14, 15–10తో వ్లాదిమిర్ ఇవనోవ్–సొజోనోవ్ (ఢిల్లీ) జంటపై గెలిచి 1–0తో ముందంజ వేసింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ సమీర్ వర్మ 15–11, 15–12తో ప్రపంచ 15వ ర్యాంకర్, హాంకాంగ్ ప్లేయర్ వింగ్ కీ వోంగ్ విన్సెంట్ (ఢిల్లీ)పై గెలిచాడు. ఇది ఢిల్లీకి ‘ట్రంప్’ మ్యాచ్ కావడంతో ఆ జట్టు స్కోరు –1గా మారగా... ఒక పాయింట్ పొందిన ముంబై 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సుంగ్ జీ హున్ 12–15, 15–14, 15–9తో బీవెన్ జాంగ్ (ముంబై)ను ఓడించింది. దాంతో ఢిల్లీ స్కోరు 0–2గా మారింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మరో పురుషుల సింగిల్స్‌లో తియాన్ హువె (ఢిల్లీ) 13–15, 15–13, 15–9తో సన్ వాన్ హో (ముంబై) గెలుపొందడంతో ఢిల్లీ ప్రత్యర్థి జట్టు ఆధిక్యాన్ని 1–2కి తగ్గించింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌గా జరిగిన మిక్స్డ్ డబుల్స్‌లో గాబ్రియేలా స్టొఇవా–లీ యోంగ్ డే (ముంబై) జంట 15–11, 15–9తో ప్రణవ్ చోప్రా–ఆరతి సారా (ఢిల్లీ) జోడీపై గెలిచింది. ఇది ముంబై ‘ట్రంప్’ మ్యాచ్ కావడం, ఆ జట్టే నెగ్గడంతో వారికి రెండు పాయింట్లు లభించాయి. ఓవరాల్‌గా ముంబై 4–1తో ఢిల్లీని ఓడించింది. ఒకవేళ ‘ట్రంప్’ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచి ఉంటే 2–1తో విజయాన్ని ఖాయం చేసుకునేది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ తలపడుతుంది. -
తొలి అడుగు అదిరె...
• శ్రీకాంత్ శుభారంభం • తొలి రౌండ్లో అలవోక విజయం • సమీర్ వర్మ కూడా ముందంజ • ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పతకమే లక్ష్యంగా ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలోకి దిగిన భారత స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ తొలి అడ్డంకిని విజయవంతంగా అధిగమించాడు. కేవలం అరగంటలోపే తన ప్రత్యర్థి ఆట కట్టించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన సమీర్ వర్మ కూడా బోణీ చేయగా... మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–మనీషా జంట కూడా గెలిచింది. గ్లాస్గో (స్కాట్లాండ్): వరుసగా రెండు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ అదే జోరును ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ కొనసాగిస్తున్నాడు. సోమవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగిన శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ విభాగంలో శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–13, 21–12తో కేవలం 29 నిమిషాల్లో సెర్గీ సిరాంట్ (రష్యా)ను ఓడించాడు. ఆరంభంలో కాస్త తడబడ్డ శ్రీకాంత్ వెంటనే తేరుకొని తన సహజశైలిలో విజృంభించాడు. నెట్ వద్ద పైచేయి సాధిస్తూనే, పదునైన స్మాష్‌లతో అదరగొట్టాడు. తొలి గేమ్‌లో 11–6తో ముందంజ వేసిన శ్రీకాంత్ ఆ తర్వాత అదే దూకుడుతో తన ఆధిక్యాన్ని 15–7కు పెంచుకున్నాడు. తొలి గేమ్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతం చేసుకున్న శ్రీకాంత్‌కు రెండో గేమ్‌లోనూ పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. అయినప్పటికీ ఏ దశలోనూ శ్రీకాంత్ నిర్లక్ష్యానికి తావివ్వకుండా ఆడుతూ నిలకడగా పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మరోవైపు పాబ్లీ అబియాన్ (స్పెయిన్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సమీర్ వర్మ 21–8, 17–4తో ఆధిక్యంలో ఉన్న దశలో అబియాన్ గాయంతో వైదొలిగాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–మనీషా (భారత్) ద్వయం 24–22, 21–17తో టామ్ చున్ హీ–ఎన్జీ సాజ్ యావు (హాంకాంగ్) జోడీపై నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకుంది. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) జోడీ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. సుమీత్–మనూ అత్రి 20–22, 11–21తో చుంగ్ ఇయు సియోక్–కిమ్ డ్యూక్యంగ్ (కొరియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తన్వీ లాడ్ (భారత్) 17–21, 21–10, 21–19తో చోల్ బిర్చ్ (ఇంగ్లండ్)ను ఓడించింది. మరో మ్యాచ్‌లో ప్రాజక్తా సావంత్ (భారత్)–యోగేంద్రన్ కృష్ణన్ (మలేసియా) జంట 21–15, 13–21, 21–18తో లియు చింగ్ యావో–చియాంగ్ కయ్ సిన్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఆరతి సారా సునీల్–సంజన సంతోష్ (భారత్) జంట 21–15, 21–18తో నటాల్యా వ్యోట్సెక్–యెలజెవెటా జర్కా (ఉక్రెయిన్) ద్వయంపై నెగ్గింది. మంగళవారం జరిగే మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో కిమ్ హ్యో మిన్ (కొరియా)తో పీవీ సింధు; పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో వీ నాన్ (హాంకాంగ్)తో సాయిప్రణీత్; వ్రాబెర్ (ఆస్ట్రియా)తో అజయ్ జయరామ్ తలపడతారు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో ప్రాజక్తా–యోగేంద్రన్లతో ప్రణవ్ చోప్రా–సిక్కి రెడ్డి; క్రిస్టియాన్సన్–సారా తిగెసన్ (డెన్మార్క్)లతో సాత్విక్–మనీషా; వాంగ్ యిలు–డాంగ్పింగ్ (చైనా)లతో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప; మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రిరిన్ అమెలియా (ఇండోనేసియా)–చింగ్ చెయోంగ్ (మలేసియా)లతో సిక్కి రెడ్డి–అశ్విని; పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో హిరోయుకి–యుటా వటనాబె (జపాన్)లతో సాత్విక్–చిరాగ్ శెట్టి తలపడతారు.