శాంటండెర్ (స్పెయిన్): భారత రైజింగ్ షట్లర్ శంకర్ ముత్తుసామి జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన అతను పురుషుల అండర్–19 సింగిల్స్‌లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. దీంతో ఈ భారత ఆటగాడికి కనీసం కాంస్యమైనా దక్కుతుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముత్తుసామి 21–18, 8–21, 21–16తో హు జె అన్ (చైనా)ను కంగుతినిపించాడు.
ఒక గంటా 31 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత టీనేజ్ షట్లర్‌కు చైనా ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్‌ను గెలిచేందుకు చెమటోడ్చిన శంకర్‌కు రెండో గేమ్‌లో నిరాశ తప్పలేదు. అయితే నిర్ణాయక మూడో గేమ్‌ను గెలిచి ముందంజ వేశాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో భారత షట్లర్ థాయ్‌లాండ్‌కు చెందిన పనిత్చఫొన్ తీరరత్సకుల్‌తో తలపడతాడు. జూనియర్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం దక్కించుకున్న 9వ భారత ఆటగాడు ముత్తుసామి. లక్ష్యసేన్ 2018లో చివరిసారిగా భారత్‌కు పతకం (కాంస్యం) అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment