Junior World Cup
-
సత్తా చాటిన ముత్తు
శాంటండెర్ (స్పెయిన్): భారత రైజింగ్ షట్లర్ శంకర్ ముత్తుసామి జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన అతను పురుషుల అండర్–19 సింగిల్స్‌లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. దీంతో ఈ భారత ఆటగాడికి కనీసం కాంస్యమైనా దక్కుతుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముత్తుసామి 21–18, 8–21, 21–16తో హు జె అన్ (చైనా)ను కంగుతినిపించాడు. ఒక గంటా 31 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత టీనేజ్ షట్లర్‌కు చైనా ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్‌ను గెలిచేందుకు చెమటోడ్చిన శంకర్‌కు రెండో గేమ్‌లో నిరాశ తప్పలేదు. అయితే నిర్ణాయక మూడో గేమ్‌ను గెలిచి ముందంజ వేశాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో భారత షట్లర్ థాయ్‌లాండ్‌కు చెందిన పనిత్చఫొన్ తీరరత్సకుల్తో తలపడతాడు. జూనియర్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం దక్కించుకున్న 9వ భారత ఆటగాడు ముత్తుసామి. లక్ష్యసేన్ 2018లో చివరిసారిగా భారత్‌కు పతకం (కాంస్యం) అందించాడు. -
Surabhi Bharadwaj: విజయ వీచిక
సురభి తొమ్మిదో తరగతి వరకు అమ్మకూచి. ఎన్సీసీలో చేరింది... రెక్కలు విచ్చుకుంది. రైఫిల్ చేతిలోకి తీసుకుంది... టార్గెట్‌కు గురిపెట్టింది. లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా తీర్మానించుకుంది. ఆ లక్ష్యాల్లో ఓ మైలురాయి.. ప్రపంచ స్థాయి రజత పతకం జర్మనీలో ఎగిరిన త్రివర్ణ పతాకమే అందుకు నిదర్శనం. మధ్య తరగతి కుటుంబం నుంచి స్పోర్ట్స్ పర్సన్ తయారు కావడం అంటే సాధారణమైన విషయం కాదు. తనలో నేర్చుకోవాలనే తపన, సాధన చేయాలనే కసి తనలో రగిలే జ్వాలలాగ ఉంటే సరిపోదు. తల్లిదండ్రులకు కూడా అదే స్థాయిలో ఆకాంక్ష ఉండాలి. అంతకంటే ముఖ్యంగా ఆర్థిక వెసులుబాటు ఉండాలి. పిల్లల క్రీడాసాధన, పోటీలకు తీసుకువెళ్లడం, స్కూల్లో ప్రత్యేక అనుమతులు తీసుకోవడం, మిస్ అయిన క్లాసుల నోట్స్ తయారీ వంటి పనుల కోసం పేరెంట్స్‌లో ఒకరు ఆసరా ఇవ్వాలి. కొన్ని క్రీడలకైతే ఖర్చు లక్షల్లో ఉంటుంది. స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నించక తప్పని పరిస్థితులుంటాయి. కఠోర సాధనకు తోడుగా ఈ సౌకర్యాలన్నీ అమరినప్పుడే క్రీడాకారులు తయారవుతారు. ఇన్ని సమ్మెట దెబ్బలకు ఓర్చి మెరిసిన వీచిక రాపోలు సురభి భరద్వాజ్. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ పోటీల్లో రజతంతో అంతర్జాతీయ వేదిక మీద మన జాతీయ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరించింది. ఇద్దరూ షూటర్సే! ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ వరల్డ్ కప్ 2022 పోటీలు జర్మనీలోని సూల్లో ఈ నెల తొమ్మిదవ తేదీ మొదలయ్యాయి. ఈ పోటీల్లో ఈ 18వ తేదీన 50 మీటర్ల ప్రోన్ విభాగంలో రజత పతకాన్ని సాధించిన సురభి హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. తండ్రి విష్ణు భరద్వాజ్ ప్రైవేట్ ఉద్యోగి, తల్లి లావణ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉద్యోగి. కుటుంబంలో క్రీడానేపథ్యం లేని సురభికి రైఫిల్ షూటింగ్‌కి బీజం ఆమె చదివిన కేంద్రీయ విద్యాలయ, ఉప్పల్ బ్రాంచ్‌లో పడింది. కుటుంబ సభ్యులతో సురభి సురభి కంటే ముందు ఆమె అక్క వైష్ణవి రైఫిల్ షూటింగ్లో చేరింది. అక్క స్ఫూర్తితో సురభి కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఢిల్లీలో ఎన్సీసీ షూటింగ్ పోటీల్లో ఇద్దరూ పాల్గొన్నారు. కేరళలో 2017లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇద్దరూ పాల్గొని నేషనల్స్‌కి క్వాలిఫై అయ్యారు. ఖరీదైన క్రీడాసాధనలో ఇద్దరిని కొనసాగించడం కష్టం కావడంతో తల్లిదండ్రులు సురభి ప్రాక్టీస్ మీద మాత్రమే దృష్టి పెట్టగలిగారు. సురభి శ్రమలో అమ్మానాన్నతోపాటు అక్క కూడా భాగం పంచుకుంటోంది. కాల పరీక్ష! సురభి డైలీ రొటీన్ ఉదయం ఆరు గంటలకు మొదలవుతుంది. వార్మప్ ఎక్సర్సైజ్లు చేసుకుని ఏడు– ఏడున్నరకంతా ఇంటి నుంచి ప్రాక్టీస్ కోసం గచ్చిబౌలికి బయలుదేరుతుంది. నాగోలులో మెట్రో రైలు, ఆటోరిక్షాలు పట్టుకుని పది గంటలలోపు హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న షూటింగ్ రేంజ్‌కు చేరుకుంటుంది. పది నుంచి ప్రాక్టీస్ మొదలవుతుంది. ఒంటి గంటకు లంచ్ బ్రేక్. తిరిగి రెండున్నర నుంచి ఐదున్నర వరకు ప్రాక్టీస్, ఇంటికి చేరేటప్పటికి రాత్రి తొమ్మిదవుతుంది. కోచ్ సూచించిన విధంగా ఆహారాన్ని సిద్ధం చేసి బాక్సులు పెడుతుంది తల్లి లావణ్య. మెట్రో లేని రోజుల్లో, సిటీ బస్సులో వెళ్లాల్సిన రోజుల్లో అయితే దినచర్య ఐదింటికే మొదలయ్యేది. సురభి షూటింగ్ ప్రాక్టీస్‌తోపాటు ఉస్మానియాలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడవ సంవత్సరం చదువుతోంది. మినిమమ్ అటెండెన్స్ చూసుకుంటూ ఎక్కువ సమయం ప్రాక్టీస్‌కే కేటాయిస్తోంది. మెట్రోలో ప్రయాణించే సమయంలో పాఠాలను పూర్తి చేసుకుంటోంది. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నప్పటికీ కాలం పరీక్షల రూపంలో ప్రత్యేక పరీక్ష పెడుతుంది. షూటింగ్ పోటీలు, కాలేజ్ పరీక్షలు ఒకే సమయంలో వచ్చాయి. దాంతో ఐదవ సెమిస్టర్ పరీక్షలు రాయలేకపోయింది. జర్మనీలో పోటీలు పూర్తయిన వెంటనే ప్రస్తుతం పూణేలో గన్ ఫర్ గ్లోరీ నిర్వహిస్తున్న ప్రత్యేక లీప్ ప్రోగ్రామ్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఖర్చు లక్షల్లో తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహించిన సురభి బంగారు పతకాన్ని సాధించింది. సౌత్ జోన్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్స్‌లో రజతాలను మూటగట్టుకుంది. రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్‌లో వాడే బుల్లెట్ దాదాపుగా 30 రూపాయలవుతుంది. కాంపిటీషన్లకు ముందు ప్రాక్టీస్‌లో రోజుకు యాభై నుంచి వంద బుల్లెట్లు వాడాల్సి ఉంటుంది. బ్లేజర్, ట్రౌజర్, షూస్, గ్లవుజ్ వంటివన్నీ కలిపి రెండు లక్షలవుతాయి. ఇక సురభి ఉపయోగించే పాయింట్ టూటూ వాల్టర్ రైఫిల్ ధర ఇరవై లక్షలు ఉంటుంది. సొంత రైఫిల్ లేకపోవడంతో సురభి అద్దె రైఫిల్‌తోనే ఇన్ని పోటీల్లో పాల్గొన్నది, పతకాలు సాధించింది. ఆమె ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌కు అర్హత 2018లోనే సాధించింది. కానీ వెపన్ లేకపోవడంతో కొన్ని అవకాశాలను చేతులారా వదులుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి క్రీడాకారులను మానసిక క్షోభకు గురి చేస్తుంది. సురభి వాటన్నింటినీ నిబ్బరంగా అధిగమించింది. మంచి రైఫిల్ అమరితే దేశానికి మరిన్ని పతకాలను తెచ్చి పెడుతుందనడంలో సందేహం లేదు. రైఫిల్ కావాలి! కాంపిటీషన్ల కోసం కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణానికి, ఆహారానికి అలవాటు పడడం ప్రధానం. అలాగే విండ్ అసెస్మెంట్ కూడా గెలుపును నిర్ణయిస్తుంది. మన గురి లక్ష్యాన్ని చేరడంలో అసలైన మెళకువ గాలి వీచే వేగాన్ని కచ్చితంగా అంచనా వేయగలగడమే. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్‌లో మనదేశానికి పతకాలు సాధించడం నా ముందున్న లక్ష్యం. మా పేరెంట్స్ ఇప్పటికే వాళ్ల శక్తికి మించి ఖర్చు చేసేశారు. ప్రభుత్వం కానీ ఇతర స్పాన్సర్లు కానీ వెపన్‌కి సపోర్ట్ చేస్తే నేను నా ప్రాక్టీస్ మీద పూర్తి సమయాన్ని కేటాయించగలుగుతాను. – రాపోలు సురభి భరద్వాజ్, షూటర్, వరల్డ్ కప్ విజేత – వాకా మంజులారెడ్డి. -
Junior World Cup: మనోళ్ల గురి అదిరింది
సాక్షి, హైదరాబాద్/విజయవాడ స్పోర్ట్స్: జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో శుక్రవారం టీమ్ ఈవెంట్స్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు లభించాయి. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ యువ షూటర్ మద్దినేని ఉమామహేశ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో... తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో బంగారు పతకాలు గెల్చుకున్నారు. ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో ఉమామహేశ్, పార్థ్, రుద్రాం„Š లతో కూడిన భారత జట్టు 16–8తో స్పెయిన్ జట్టును ఓడించి విజేతగా నిలిచింది. విజయవాడకు చెందిన 17 ఏళ్ల ఉమామహేశ్ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ తొలి సంవత్సరం చదువుతున్నాడు. ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో ఇషా సింగ్, పలక్, మనూ భాకర్‌లతో కూడిన భారత జట్టు 16–8తో జార్జియా జట్టుపై గెలిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఫైనల్లో రమిత, జీనా ఖిట్టా, ఆర్యా బోర్సెలతో కూడిన భారత జట్టు 17–9తో దక్షిణ కొరియా జట్టును ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో సౌరభ్ చౌదరీ, శివ, సరబ్జీత్లతో కూడిన భారత జట్టు 17–9తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచి నాలుగో పసిడి పతకాన్ని అందించింది. -
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ: ఇషా సింగ్‌కు రజతం
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రజత పతకం సాధించింది. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 14 ఏళ్ల ఇషా సింగ్ 236.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. సెవ్వల్ తర్హాన్ (టర్కీ–241.8 పాయింట్లు) స్వర్ణం సొంతం చేసుకోగా... యాస్మిన్ (టర్కీ–215.4 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకుంది. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో అనీశ్ భన్వాలా (భారత్–29 పాయింట్లు) పసిడి పతకం సాధించాడు. భళా... రాజా రిత్విక్ సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్ రాజా రిత్విక్ అండర్–15 ఓపెన్ విభాగంలో విజేతగా అవతరించాడు. తమిళనాడులో బుధవారం ముగిసిన ఈ పోటీల్లో రాజా రిత్విక్ 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. తెలంగాణకే చెందిన మరో ఆటగాడు కుశాగ్ర మోహన్ రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించాడు. కుశాగ్ర మోహన్ 9 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా కలిగిన రిత్విక్ ఈ టోర్నీలో 11 గేముల్లోనూ అజేయంగా నిలిచి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ప్రవీణ్ (తమిళనాడు), శాశ్వత పాల్ (జార్ఖండ్), అనిరుధ (మహారాష్ట్ర), శ్రీహరి (పుదుచ్చేరి), నిఖిల్ (తమిళనాడు), సంకేత్ చక్రవర్తి (బెంగాల్), ప్రళయ్ సాహూ (బెంగాల్), అజయ్ కార్తికేయన్ (తమిళనాడు)పై విజయం సాధించిన రిత్విక్... నారాయణ్ చౌహాన్ (ఉత్తరప్రదేశ్), ప్రణవ్ (తమిళనాడు), ఆదిత్య సామంత్ (మహారాష్ట్ర)లతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. ఎన్.రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న రిత్విక్ తాజా విజయంతో ఆసియా చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. దీపిక గురి అదిరె... టోక్యో: వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ వేదికపై నిర్వహిస్తున్న టెస్ట్ ఈవెంట్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి దీపిక కుమారి మెరిసింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ఆమె రజత పతకం సాధించింది. దక్షిణ కొరియా ఆర్చర్ యాన్ సాన్తో బుధవారం జరిగిన ఫైనల్లో దీపిక 0–6 తేడాతో ఓడిపోయింది. దీపిక వరుసగా మూడు సెట్లను 26–27, 25–29, 28–30తో చేజార్చుకుంది. సెట్ గెలిస్తే రెండు పాయింట్లు లభిస్తాయి. తొలి రౌండ్లో దీపిక 6–0తో లీ షుక్ క్వాన్ (హాంకాంగ్)పై, రెండో రౌండ్లో 6–4తో అనస్తాసియా పావ్లో వా (ఉక్రెయిన్)పై, మూడో రౌండ్లో 6–0తో వాకా సొనాడా (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–5తో తాతియానా ఆండ్రోలి (ఇటలీ)పై, సెమీఫైనల్లో 6–0తో జెంగ్ యిచాయ్ (చైనా)పై విజయం సాధించింది. అజేయ హారిక... సాక్షి, హైదరాబాద్: షావోజింగ్ ఓపెన్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మెరిసింది. 34 మంది క్రీడాకారిణులు తొమ్మిది రౌండ్లలో పోటీపడ్డ ఈ టోర్నమెంట్లో హారిక కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. చైనాలో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హారిక ఆరు పాయింట్లతో మరో ఇద్దరు క్రీడాకారిణులు గువో కి (చైనా), ముంగున్తుల్ భత్కుయాగ్ (మంగోలియా)లతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... గువో కి రజతం ఖాయమైంది. హారికకు కాంస్యం దక్కింది. ఈ టోర్నీలో మూడు గేముల్లో గెలిచిన హారిక మరో ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. మూడో స్థానంలో నిలిచిన హారికకు 15 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 లక్షల 32 వేలు) లభించింది. ప్రపంచ మాజీ చాంపియన్ అంటొనెటా స్టెఫనోవా (బల్గేరియా) ఏడు పాయింట్లతో ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. -
మను–అన్మోల్ ‘పసిడి’ గురి
సిడ్నీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. మంగళవారం భారత్ ఖాతాలో మరో మూడు పతకాలు చేరాయి. ఇందులో ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో మను భాకర్–అన్మోల్ జంట పసిడి పతకం సొంతం చేసుకుంది. క్వాలిఫయింగ్తో పాటు ఫైనల్లోనూ ఈ జంట ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. క్వాలిఫయింగ్‌లో 770 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచిన ఈ జోడీ... ఫైనల్లో 478.9 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది. ఇదే విభాగంలో గౌరవ్ రాణా–మహిమా అగర్వాల్ (భారత్) జోడీ నాలుగో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కోల్పోయింది. మను–అన్మోల్ ప్రదర్శనతో భారత్ ఖాతాలో ఏడో స్వర్ణం చేరడం విశేషం. మహిళల స్కీట్ వ్యక్తిగత విభాగంలో జెనెమత్ షెఖాన్ (భారత్) కాంస్యం సాధించింది. ఫైనల్లో ఆమె 36 పాయింట్లు స్కోరు చేసింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో అర్జున్ బబూటా–శ్రేయా అగర్వాల్ జంట మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. ఓవరాల్‌గా భారత్ ప్రస్తుతం ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, ఎనిమిది కాంస్యాలతో కలిపి 18 పతకాలతో రెండో స్థానంలో ఉంది. -
భారత షూటర్లకు మరో ఐదు పతకాలు
గబాలా (అజర్బైజాన్): జూనియర్ ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్ల హవా కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోటీల్లో భారత్‌కు మొత్తం ఐదు పతకాలు లభించాయి. ఇందులో మూడు స్వర్ణాలు, రజతం, కాంస్యం ఉన్నాయి. మహిళల, పురుషుల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో భారత జట్లకు పసిడి పతకాలు దక్కాయి. పురుషుల వ్యక్తిగత 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో అన్హద్ జవాండా భారత్‌కు మరో స్వర్ణం అందించగా... గుర్మీత్ రజతం గెలిచాడు. ప్రగతి గుప్తా, సౌమ్య గుప్తా, మనీషాలతో కూడిన భారత మహిళల జట్టుకు ట్రాప్ ఈవెంట్లో కాంస్యం లభించింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు భారత్‌కు 9 స్వర్ణాలు, 5 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు వచ్చాయి. -
భారత షూటర్ల జోరు
గబాలా (అజర్బైజాన్): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత షూటర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పోటీల్లో భారత్‌కు ఐదు పతకాలు లభించాయి. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ రుషిరాజ్ బారోట్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. 19 ఏళ్ల రుషిరాజ్ 556 పాయింట్లు సాధించి ఐదో స్థానంతో ఫైనల్‌కు అర్హత పొందాడు. ఫైనల్లో రుషిరాజ్ 25 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... లుకాస్ స్కుర్మల్ (చెక్ రిపబ్లిక్-23 పాయింట్లు) రజత పతకాన్ని, సెర్గీ ఎవ్‌గ్లెవ్‌స్కీ (ఆస్ట్రేలియా-20 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించారు. అంతకుముందు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ప్రతీక్, అర్జున్ బబూటా, ప్రశాంత్‌లతో కూడిన భారత బృందానికి పసిడి పతకం లభించింది. ఇదే ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో అర్జున్‌కు కాంస్యం దక్కింది. 50 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో అన్మోల్, నిశాంత్ భరద్వాజ్, అర్జున్ దాస్లతో కూడిన భారత జట్టు రజతం సాధించింది. జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో దిల్రీన్ గిల్, గీతాలక్ష్మి దీక్షిత్, ఆశి రస్తోగిలతో కూడిన భారత జట్టు కాంస్యం కై వసం చేసుకుంది. -
మానవాదిత్యకు కాంస్యం
న్యూఢిల్లీ: జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ టోర్నీలో భారత షూటర్ మానవాదిత్య రాథోడ్ కాంస్య పతకం సాధించాడు. ట్రాప్ ఈవెంట్లో మానవాదిత్య మూడో స్థానంలో నిలిచాడు. ‘చాంపియన్ ఆఫ్ చాంపియన్స్’ స్కీట్ ఈవెంట్లో భారత్‌కే చెందిన అనంత్ నరూకాకు కాంస్య పతకం లభించింది. ఒలింపిక్ రజత పతక విజేత, కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తనయుడే మానవాదిత్య రాథోడ్. తండ్రిలా మానవాదిత్య కూడా షూటింగ్ రాణిస్తున్నాడు.