ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ: ఇషా సింగ్‌కు రజతం | Anish wins 25m rapid fire pistol gold silver for Esha at Junior World Cup | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీ: ఇషా సింగ్‌కు రజతం

Jul 18 2019 12:52 AM | Updated on Jul 18 2019 5:11 AM

Anish wins 25m rapid fire pistol gold silver for Esha at Junior World Cup - Sakshi

ఇషా సింగ్‌

అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ రజత పతకం సాధించింది. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన జూనియర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో 14 ఏళ్ల ఇషా సింగ్‌ 236.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. సెవ్వల్‌ తర్హాన్‌ (టర్కీ–241.8 పాయింట్లు) స్వర్ణం సొంతం చేసుకోగా... యాస్మిన్‌ (టర్కీ–215.4 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకుంది. జూనియర్‌ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో అనీశ్‌ భన్వాలా (భారత్‌–29 పాయింట్లు) పసిడి పతకం సాధించాడు.   

భళా... రాజా రిత్విక్‌
సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సబ్‌ జూనియర్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్‌ రాజా రిత్విక్‌ అండర్‌–15 ఓపెన్‌ విభాగంలో విజేతగా అవతరించాడు. తమిళనాడులో బుధవారం ముగిసిన ఈ పోటీల్లో రాజా రిత్విక్‌ 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. తెలంగాణకే చెందిన మరో ఆటగాడు కుశాగ్ర మోహన్‌ రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించాడు. కుశాగ్ర మోహన్‌ 9 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ మాస్టర్‌ (ఐఎం) హోదా కలిగిన రిత్విక్‌ ఈ టోర్నీలో 11 గేముల్లోనూ అజేయంగా నిలిచి స్వర్ణ పతకాన్ని గెలిచాడు.


ప్రవీణ్‌ (తమిళనాడు), శాశ్వత పాల్‌ (జార్ఖండ్‌), అనిరుధ (మహారాష్ట్ర), శ్రీహరి (పుదుచ్చేరి), నిఖిల్‌ (తమిళనాడు), సంకేత్‌ చక్రవర్తి (బెంగాల్‌), ప్రళయ్‌ సాహూ (బెంగాల్‌), అజయ్‌ కార్తికేయన్‌ (తమిళనాడు)పై విజయం సాధించిన రిత్విక్‌... నారాయణ్‌ చౌహాన్‌ (ఉత్తరప్రదేశ్‌), ప్రణవ్‌ (తమిళనాడు), ఆదిత్య సామంత్‌ (మహారాష్ట్ర)లతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. ఎన్‌.రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న రిత్విక్‌ తాజా విజయంతో ఆసియా చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.   

దీపిక గురి అదిరె...
టోక్యో: వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌ వేదికపై నిర్వహిస్తున్న టెస్ట్‌ ఈవెంట్‌ ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ క్రీడాకారిణి దీపిక కుమారి మెరిసింది. మహిళల వ్యక్తిగత రికర్వ్‌ విభాగంలో ఆమె రజత పతకం సాధించింది. దక్షిణ కొరియా ఆర్చర్‌ యాన్‌ సాన్‌తో బుధవారం జరిగిన ఫైనల్లో దీపిక 0–6 తేడాతో ఓడిపోయింది.

దీపిక వరుసగా మూడు సెట్‌లను 26–27, 25–29, 28–30తో చేజార్చుకుంది. సెట్‌ గెలిస్తే రెండు పాయింట్లు లభిస్తాయి. తొలి రౌండ్‌లో దీపిక 6–0తో లీ షుక్‌ క్వాన్‌ (హాంకాంగ్‌)పై, రెండో రౌండ్‌లో 6–4తో అనస్తాసియా పావ్లో వా (ఉక్రెయిన్‌)పై, మూడో రౌండ్‌లో 6–0తో వాకా సొనాడా (జపాన్‌)పై, క్వార్టర్‌ ఫైనల్లో 6–5తో తాతియానా ఆండ్రోలి (ఇటలీ)పై, సెమీఫైనల్లో 6–0తో జెంగ్‌ యిచాయ్‌ (చైనా)పై విజయం సాధించింది.   

అజేయ హారిక...
సాక్షి, హైదరాబాద్‌: షావోజింగ్‌ ఓపెన్‌ అంతర్జాతీయ మహిళల చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక మెరిసింది. 34 మంది క్రీడాకారిణులు తొమ్మిది రౌండ్లలో పోటీపడ్డ ఈ టోర్నమెంట్‌లో హారిక కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. చైనాలో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హారిక ఆరు పాయింట్లతో మరో ఇద్దరు క్రీడాకారిణులు గువో కి (చైనా), ముంగున్‌తుల్‌ భత్కుయాగ్‌ (మంగోలియా)లతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... గువో కి రజతం ఖాయమైంది. హారికకు కాంస్యం దక్కింది. ఈ టోర్నీలో మూడు గేముల్లో గెలిచిన హారిక మరో ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. మూడో స్థానంలో నిలిచిన హారికకు 15 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 లక్షల 32 వేలు) లభించింది. ప్రపంచ మాజీ చాంపియన్‌ అంటొనెటా స్టెఫనోవా (బల్గేరియా) ఏడు పాయింట్లతో ఈ టోర్నీలో విజేతగా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement