International Shooting Sports Federation
-
Surabhi Bharadwaj: విజయ వీచిక
సురభి తొమ్మిదో తరగతి వరకు అమ్మకూచి. ఎన్సీసీలో చేరింది... రెక్కలు విచ్చుకుంది. రైఫిల్ చేతిలోకి తీసుకుంది... టార్గెట్‌కు గురిపెట్టింది. లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా తీర్మానించుకుంది. ఆ లక్ష్యాల్లో ఓ మైలురాయి.. ప్రపంచ స్థాయి రజత పతకం జర్మనీలో ఎగిరిన త్రివర్ణ పతాకమే అందుకు నిదర్శనం. మధ్య తరగతి కుటుంబం నుంచి స్పోర్ట్స్ పర్సన్ తయారు కావడం అంటే సాధారణమైన విషయం కాదు. తనలో నేర్చుకోవాలనే తపన, సాధన చేయాలనే కసి తనలో రగిలే జ్వాలలాగ ఉంటే సరిపోదు. తల్లిదండ్రులకు కూడా అదే స్థాయిలో ఆకాంక్ష ఉండాలి. అంతకంటే ముఖ్యంగా ఆర్థిక వెసులుబాటు ఉండాలి. పిల్లల క్రీడాసాధన, పోటీలకు తీసుకువెళ్లడం, స్కూల్లో ప్రత్యేక అనుమతులు తీసుకోవడం, మిస్ అయిన క్లాసుల నోట్స్ తయారీ వంటి పనుల కోసం పేరెంట్స్‌లో ఒకరు ఆసరా ఇవ్వాలి. కొన్ని క్రీడలకైతే ఖర్చు లక్షల్లో ఉంటుంది. స్పాన్సర్షిప్ కోసం ప్రయత్నించక తప్పని పరిస్థితులుంటాయి. కఠోర సాధనకు తోడుగా ఈ సౌకర్యాలన్నీ అమరినప్పుడే క్రీడాకారులు తయారవుతారు. ఇన్ని సమ్మెట దెబ్బలకు ఓర్చి మెరిసిన వీచిక రాపోలు సురభి భరద్వాజ్. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ పోటీల్లో రజతంతో అంతర్జాతీయ వేదిక మీద మన జాతీయ పతాకాన్ని సగర్వంగా ఆవిష్కరించింది. ఇద్దరూ షూటర్సే! ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ వరల్డ్ కప్ 2022 పోటీలు జర్మనీలోని సూల్లో ఈ నెల తొమ్మిదవ తేదీ మొదలయ్యాయి. ఈ పోటీల్లో ఈ 18వ తేదీన 50 మీటర్ల ప్రోన్ విభాగంలో రజత పతకాన్ని సాధించిన సురభి హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది. తండ్రి విష్ణు భరద్వాజ్ ప్రైవేట్ ఉద్యోగి, తల్లి లావణ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉద్యోగి. కుటుంబంలో క్రీడానేపథ్యం లేని సురభికి రైఫిల్ షూటింగ్‌కి బీజం ఆమె చదివిన కేంద్రీయ విద్యాలయ, ఉప్పల్ బ్రాంచ్‌లో పడింది. కుటుంబ సభ్యులతో సురభి సురభి కంటే ముందు ఆమె అక్క వైష్ణవి రైఫిల్ షూటింగ్లో చేరింది. అక్క స్ఫూర్తితో సురభి కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఢిల్లీలో ఎన్సీసీ షూటింగ్ పోటీల్లో ఇద్దరూ పాల్గొన్నారు. కేరళలో 2017లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లోనూ ఇద్దరూ పాల్గొని నేషనల్స్‌కి క్వాలిఫై అయ్యారు. ఖరీదైన క్రీడాసాధనలో ఇద్దరిని కొనసాగించడం కష్టం కావడంతో తల్లిదండ్రులు సురభి ప్రాక్టీస్ మీద మాత్రమే దృష్టి పెట్టగలిగారు. సురభి శ్రమలో అమ్మానాన్నతోపాటు అక్క కూడా భాగం పంచుకుంటోంది. కాల పరీక్ష! సురభి డైలీ రొటీన్ ఉదయం ఆరు గంటలకు మొదలవుతుంది. వార్మప్ ఎక్సర్సైజ్లు చేసుకుని ఏడు– ఏడున్నరకంతా ఇంటి నుంచి ప్రాక్టీస్ కోసం గచ్చిబౌలికి బయలుదేరుతుంది. నాగోలులో మెట్రో రైలు, ఆటోరిక్షాలు పట్టుకుని పది గంటలలోపు హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న షూటింగ్ రేంజ్‌కు చేరుకుంటుంది. పది నుంచి ప్రాక్టీస్ మొదలవుతుంది. ఒంటి గంటకు లంచ్ బ్రేక్. తిరిగి రెండున్నర నుంచి ఐదున్నర వరకు ప్రాక్టీస్, ఇంటికి చేరేటప్పటికి రాత్రి తొమ్మిదవుతుంది. కోచ్ సూచించిన విధంగా ఆహారాన్ని సిద్ధం చేసి బాక్సులు పెడుతుంది తల్లి లావణ్య. మెట్రో లేని రోజుల్లో, సిటీ బస్సులో వెళ్లాల్సిన రోజుల్లో అయితే దినచర్య ఐదింటికే మొదలయ్యేది. సురభి షూటింగ్ ప్రాక్టీస్‌తోపాటు ఉస్మానియాలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ మూడవ సంవత్సరం చదువుతోంది. మినిమమ్ అటెండెన్స్ చూసుకుంటూ ఎక్కువ సమయం ప్రాక్టీస్‌కే కేటాయిస్తోంది. మెట్రోలో ప్రయాణించే సమయంలో పాఠాలను పూర్తి చేసుకుంటోంది. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నప్పటికీ కాలం పరీక్షల రూపంలో ప్రత్యేక పరీక్ష పెడుతుంది. షూటింగ్ పోటీలు, కాలేజ్ పరీక్షలు ఒకే సమయంలో వచ్చాయి. దాంతో ఐదవ సెమిస్టర్ పరీక్షలు రాయలేకపోయింది. జర్మనీలో పోటీలు పూర్తయిన వెంటనే ప్రస్తుతం పూణేలో గన్ ఫర్ గ్లోరీ నిర్వహిస్తున్న ప్రత్యేక లీప్ ప్రోగ్రామ్‌లో శిక్షణ తీసుకుంటోంది. ఖర్చు లక్షల్లో తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహించిన సురభి బంగారు పతకాన్ని సాధించింది. సౌత్ జోన్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్స్‌లో రజతాలను మూటగట్టుకుంది. రైఫిల్ షూటింగ్ ప్రాక్టీస్‌లో వాడే బుల్లెట్ దాదాపుగా 30 రూపాయలవుతుంది. కాంపిటీషన్లకు ముందు ప్రాక్టీస్‌లో రోజుకు యాభై నుంచి వంద బుల్లెట్లు వాడాల్సి ఉంటుంది. బ్లేజర్, ట్రౌజర్, షూస్, గ్లవుజ్ వంటివన్నీ కలిపి రెండు లక్షలవుతాయి. ఇక సురభి ఉపయోగించే పాయింట్ టూటూ వాల్టర్ రైఫిల్ ధర ఇరవై లక్షలు ఉంటుంది. సొంత రైఫిల్ లేకపోవడంతో సురభి అద్దె రైఫిల్‌తోనే ఇన్ని పోటీల్లో పాల్గొన్నది, పతకాలు సాధించింది. ఆమె ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌కు అర్హత 2018లోనే సాధించింది. కానీ వెపన్ లేకపోవడంతో కొన్ని అవకాశాలను చేతులారా వదులుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి క్రీడాకారులను మానసిక క్షోభకు గురి చేస్తుంది. సురభి వాటన్నింటినీ నిబ్బరంగా అధిగమించింది. మంచి రైఫిల్ అమరితే దేశానికి మరిన్ని పతకాలను తెచ్చి పెడుతుందనడంలో సందేహం లేదు. రైఫిల్ కావాలి! కాంపిటీషన్ల కోసం కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణానికి, ఆహారానికి అలవాటు పడడం ప్రధానం. అలాగే విండ్ అసెస్మెంట్ కూడా గెలుపును నిర్ణయిస్తుంది. మన గురి లక్ష్యాన్ని చేరడంలో అసలైన మెళకువ గాలి వీచే వేగాన్ని కచ్చితంగా అంచనా వేయగలగడమే. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్‌లో మనదేశానికి పతకాలు సాధించడం నా ముందున్న లక్ష్యం. మా పేరెంట్స్ ఇప్పటికే వాళ్ల శక్తికి మించి ఖర్చు చేసేశారు. ప్రభుత్వం కానీ ఇతర స్పాన్సర్లు కానీ వెపన్‌కి సపోర్ట్ చేస్తే నేను నా ప్రాక్టీస్ మీద పూర్తి సమయాన్ని కేటాయించగలుగుతాను. – రాపోలు సురభి భరద్వాజ్, షూటర్, వరల్డ్ కప్ విజేత – వాకా మంజులారెడ్డి. -
ఐఎస్ఎస్ఎఫ్ పేజీని తొలగించిన ఫేస్బుక్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్)కు ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్బుక్ షాక్ ఇచ్చింది. ఐఎస్ఎస్ఎఫ్ అధికార పేజీని తొలగిస్తూ ఫేస్బుక్ నిర్ణయం తీసుకుంది. దాంతో ఆగ్రహించిన ఐఎస్ఎస్ఎఫ్ ‘అన్‌బ్లాక్ ఐఎస్ఎస్ఎఫ్ ఫేస్బుక్’ హ్యాష్ ట్యాగ్‌తో ఇతర సామాజిక మాధ్యమాలు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో మద్దతు ఇవ్వాలని కోరింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌కు మద్దతుగా పలువురు షూటర్లు కూడా ఈ ట్యాగ్‌కు తమ కామెంట్లను జత చేశారు. ‘ఐఎస్ఎస్ఎఫ్ చరిత్రలో గురువారం ఒక దురదృష్టకరమైన రోజు. ఎటువంటి కారణం, ముందస్తు హెచ్చరిక లేకుండానే ఐఎస్ఎస్ఎఫ్ పేజీని ఫేస్బుక్ తొలగించింది’ అని ఐఎస్ఎస్ఎఫ్ ఒక ప్రకటనలో పేర్కొంది. 2010 జనవరి 14న ఐఎస్ఎస్ఎఫ్ ఫేస్బుక్లో చేరింది. తొలగించడానికి సరైన కారణం తెలియకపోయినా... ఫేస్బుక్ నిబంధనల ప్రకారం రైఫిళ్లు, హ్యాండ్గన్లకు సంబంధించిన వాటి ప్రచారాన్ని తమ ఫేస్బుక్ ద్వారా చేయకూడదు. ఈ కారణంతోనే ఐఎస్ఎస్ఎఫ్ పేజీని ఫేస్బుక్ తొలగించినట్లు సమాచారం. -
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ: ఇషా సింగ్‌కు రజతం
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రజత పతకం సాధించింది. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో 14 ఏళ్ల ఇషా సింగ్ 236.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. సెవ్వల్ తర్హాన్ (టర్కీ–241.8 పాయింట్లు) స్వర్ణం సొంతం చేసుకోగా... యాస్మిన్ (టర్కీ–215.4 పాయింట్లు) కాంస్యం కైవసం చేసుకుంది. జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో అనీశ్ భన్వాలా (భారత్–29 పాయింట్లు) పసిడి పతకం సాధించాడు. భళా... రాజా రిత్విక్ సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్ రాజా రిత్విక్ అండర్–15 ఓపెన్ విభాగంలో విజేతగా అవతరించాడు. తమిళనాడులో బుధవారం ముగిసిన ఈ పోటీల్లో రాజా రిత్విక్ 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించాడు. తెలంగాణకే చెందిన మరో ఆటగాడు కుశాగ్ర మోహన్ రన్నరప్‌గా నిలిచి రజత పతకం సాధించాడు. కుశాగ్ర మోహన్ 9 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ మాస్టర్ (ఐఎం) హోదా కలిగిన రిత్విక్ ఈ టోర్నీలో 11 గేముల్లోనూ అజేయంగా నిలిచి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ప్రవీణ్ (తమిళనాడు), శాశ్వత పాల్ (జార్ఖండ్), అనిరుధ (మహారాష్ట్ర), శ్రీహరి (పుదుచ్చేరి), నిఖిల్ (తమిళనాడు), సంకేత్ చక్రవర్తి (బెంగాల్), ప్రళయ్ సాహూ (బెంగాల్), అజయ్ కార్తికేయన్ (తమిళనాడు)పై విజయం సాధించిన రిత్విక్... నారాయణ్ చౌహాన్ (ఉత్తరప్రదేశ్), ప్రణవ్ (తమిళనాడు), ఆదిత్య సామంత్ (మహారాష్ట్ర)లతో జరిగిన గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్నాడు. ఎన్.రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న రిత్విక్ తాజా విజయంతో ఆసియా చాంపియన్‌షిప్, ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. దీపిక గురి అదిరె... టోక్యో: వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ వేదికపై నిర్వహిస్తున్న టెస్ట్ ఈవెంట్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి దీపిక కుమారి మెరిసింది. మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ఆమె రజత పతకం సాధించింది. దక్షిణ కొరియా ఆర్చర్ యాన్ సాన్తో బుధవారం జరిగిన ఫైనల్లో దీపిక 0–6 తేడాతో ఓడిపోయింది. దీపిక వరుసగా మూడు సెట్లను 26–27, 25–29, 28–30తో చేజార్చుకుంది. సెట్ గెలిస్తే రెండు పాయింట్లు లభిస్తాయి. తొలి రౌండ్లో దీపిక 6–0తో లీ షుక్ క్వాన్ (హాంకాంగ్)పై, రెండో రౌండ్లో 6–4తో అనస్తాసియా పావ్లో వా (ఉక్రెయిన్)పై, మూడో రౌండ్లో 6–0తో వాకా సొనాడా (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–5తో తాతియానా ఆండ్రోలి (ఇటలీ)పై, సెమీఫైనల్లో 6–0తో జెంగ్ యిచాయ్ (చైనా)పై విజయం సాధించింది. అజేయ హారిక... సాక్షి, హైదరాబాద్: షావోజింగ్ ఓపెన్ అంతర్జాతీయ మహిళల చెస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక మెరిసింది. 34 మంది క్రీడాకారిణులు తొమ్మిది రౌండ్లలో పోటీపడ్డ ఈ టోర్నమెంట్లో హారిక కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. చైనాలో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత హారిక ఆరు పాయింట్లతో మరో ఇద్దరు క్రీడాకారిణులు గువో కి (చైనా), ముంగున్తుల్ భత్కుయాగ్ (మంగోలియా)లతో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... గువో కి రజతం ఖాయమైంది. హారికకు కాంస్యం దక్కింది. ఈ టోర్నీలో మూడు గేముల్లో గెలిచిన హారిక మరో ఆరు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచింది. మూడో స్థానంలో నిలిచిన హారికకు 15 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 లక్షల 32 వేలు) లభించింది. ప్రపంచ మాజీ చాంపియన్ అంటొనెటా స్టెఫనోవా (బల్గేరియా) ఏడు పాయింట్లతో ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. -
సౌరభ్, రాహీ డబుల్ ధమాకా
మ్యూనిక్ (జర్మనీ): భారత షూటర్లు మళ్లీ బంగారు గురితో భళా అనిపించారు. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో రెండో రోజు భారత్‌కు సౌరభ్ చౌధరీ, రాహీ సర్నోబత్ రెండు స్వర్ణాలను అందించారు. ఈ క్రమంలో సౌరభ్ చౌధరీ రెండు కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పగా... రాహీ ఒలింపిక్ బెర్త్‌ను అందించింది. ఇప్పటివరకు భారత షూటర్లు ఆరు విభాగాల్లో ఒలింపిక్ బెర్త్‌లను సాధించడం విశేషం. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సౌరభ్ చౌధరీ 246.3 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణం దక్కించుకున్నాడు. దాంతో 245 పాయింట్లతో తన పేరిటే ఉన్న సీనియర్ ప్రపంచ రికార్డును... 245.5 పాయింట్లతో ఉన్న జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. భారత్‌కే చెందిన షాజర్ రిజ్వీ 177.6 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్‌లో సౌరభ్ 586 పాయింట్లు, షాజర్ రిజ్వీ 583 పాయింట్లు సాధించి వరుసగా రెండు, ఐదు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఆసియా క్రీడల చాంపియన్ రాహీ సర్నోబత్ 37 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన మను భాకర్ 21 పాయింట్లతో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫయింగ్‌లో రాహీ 586 పాయింట్లు, మను 585 పాయింట్లు సాధించి నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు చేరారు. -
మళ్లీ గురి తప్పారు
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత స్టార్ షూటర్లు అంచనాలను అందుకోలేకపోయారు. ఒత్తిడికి లోనై గురి తప్పారు. ఫలితంగా అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ టోర్నమెంట్లో నాలుగో రోజు భారత్ ఖాతాలో ఒక్క పతకం కూడా చేరలేదు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను భాకర్, అనురాధ, హీనా సిద్ధూ, వరుసగా 14వ, 22వ, 25వ స్థానాల్లో నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో గాయత్రి 36వ స్థానంలో, సునిధి చౌహాన్ 49వ స్థానంలో నిలిచారు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో ఆదర్శ్ సింగ్, అర్పిత్ గోయల్ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరగ్గా... 16 ఏళ్ల అనీశ్ భన్వాలా ఫైనల్‌కు చేరినా పతకం నెగ్గలేదు. కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అనీశ్ భన్వాలా 14 పాయింట్లు స్కోరు చేసి ఐదో స్థానంలో నిలిచి నిష్క్రమించాడు. ఒలింపిక్ చాంప్ క్రిస్టియన్ రీట్జ్ (జర్మనీ–35 పాయిం ట్లు) స్వర్ణం... ప్రపంచ చాంపియన్ జున్మిన్ లిన్ (చైనా–31 పాయింట్లు) రజతం... కిమ్ జున్హోంగ్ (కొరియా–22 పాయింట్లు) కాంస్యం నెగ్గారు. -
బింద్రాకు అరుదైన గౌరవం
ఒలింపిక్స్‌లో వ్యక్తిగత క్రీడల్లో స్వర్ణం సాధించిన ఏకైక భారతీయుడైన షూటర్ అభినవ్ బింద్రా అరుదైన గౌరవం పొందాడు. షూటింగ్ క్రీడకు చేసిన సేవలకు గాను అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) అతడికి ‘బ్లూ క్రాస్’ పురస్కారం అందజేసింది. ఐఎస్ఎస్ఎఫ్ అవార్డుల్లో ఇది అత్యున్నతమైనది కాగా, భారత్ నుంచి ఈ ఘనత పొందిన తొలి షూటర్ బింద్రానే కావడం విశేషం. 36 ఏళ్ల బింద్రా... 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అంశంలో స్వర్ణం నెగ్గాడు. -
భారత షూటర్ల కొత్త చరిత్ర
చాంగ్వాన్ (దక్షిణ కొరియా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ కొత్త చరిత్ర లిఖించింది. గతంలో ఎన్నడు లేని విధంగా 11 స్వర్ణాలతో పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. పోటీల ముగింపు రోజు శుక్రవారం రెండు స్వర్ణాలు, ఓ రజతం భారత్ ఖాతాలో చేరడంతో... మొత్తంగా 27 పతకాల (11 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు)తో మూడో స్థానంతో ముగించింది. మన షూటర్లు చివరి రోజు జూనియర్ విభాగంలో రెండు స్వర్ణాలు... సీనియర్ విభాగంలో ఓ రజతం సాధించారు. జూనియర్ 25 మీ. పిస్టల్ విభాగంలో పదహారేళ్ల విజయ్‌వీర్ 572 పాయింట్లతో పసిడి పతకం సాధించాడు. టీమ్ విభాగంలో విజయ్‌వీర్ (564), రాజ్కన్వర్ సింగ్ సంధు (564), ఆదర్శ్ సింగ్ (559)లతో కూడిన భారత జట్టు 1695 పాయింట్లతో స్వర్ణం చేజిక్కించుకుంది. కొరియా (1693), చెక్ రిపబ్లిక్ (1674) వరుసగా రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నాయి. సీనియర్ 25 మీ. పిస్టల్ విభాగంలో గురుప్రీత్ సింగ్ 579 పాయింట్లతో రజతం సాధించాడు. టీమ్ విభాగంలో గురుప్రీత్, అమన్‌ప్రీత్ సింగ్, విజయ్ కుమార్‌లతో కూడిన భారత బృందం 1699 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు క్వాలిఫయింగ్ ఈవెంట్‌గా నిర్వహించిన ఈ టోర్నీలో భారత్ రెండు ఒలింపిక్ బెర్త్‌లను సొంతం చేసుకుంది. అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండీలా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈ బెర్త్‌లు సాధించారు. -
బింద్రాకు అరుదైన గౌరవం
ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక న్యూఢిల్లీ: దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) చైర్మన్‌గా ఎంపికైన తొలి భారతీయుడిగా బింద్రా రికార్డు సృష్టించాడు. ఈ మేరకు భారత జాతీయ రైఫిల్ సంఘాని (ఎన్ఆర్ఏఐ)కి ఐఎస్ఎస్ఎఫ్ నుంచి లేఖ అందింది. విశ్వవ్యాప్తంగా షూటింగ్ కార్యకలాపాలన్నీ ఈ సమాఖ్య నుంచే జరుగుతాయి. 32 ఏళ్ల బింద్రా ఈ పదవి దక్కించుకోవడంతో ఐఎస్ఎస్ఎఫ్ పరిపాలనా మండలిలో కూడా సభ్యుడవుతాడు. ‘ఇది నిజంగా చాలా గొప్ప గౌర వం. వ్యక్తిగతంగానే కాకుండా దేశానికే దక్కిన పురస్కారంగా భావిస్తున్నాను. ఈ పదవి చాలా బాధ్యతాయుతమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షూటర్ల సమస్యలకు సంబంధించి నేను బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అందరినీ సమదృష్టితో చూస్తూ పదవికి న్యాయం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని బింద్రా అన్నాడు. ఇప్పటిదాకా అతను ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. బింద్రాకు దక్కిన గుర్తింపుపై ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు రణీందర్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.