భారత బ్యాడ్మింటన్ స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి- చిరాగ్ శెట్టి కోచ్ మథియాస్ బో కీలక ప్రకటన చేశాడు. కోచింగ్ విధుల నుంచి తాను తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో సాత్విక్- చిరాగ్ వైఫల్యం నేపథ్యంలో మథియాస్ బో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మథియాస్ శిక్షణలో సాత్విక్- చిరాగ్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో నంబర్ వన్‌గా ఎదిగారు. కొన్నాళ్లుగా అద్భుత ఫామ్‌లో ఉన్న ఈ జంట.. విశ్వ క్రీడల్లో కనీసం కాంస్యమైనా సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగా వరుస విజయాలతో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న సాత్విక్- చిరాగ్.. మలేషియా ద్వయం ముందు తలవంచారు.
ప్యారిస్‌లో గురువారం నాటి మ్యాచ్‌లో ఆరోన్ చియా- వూయీ యిక్ చేతిలో 21-13, 14-21, 16-21తో ఓడి పతక రేసు నుంచి నిష్క్రమించారు. ఈ నేపథ్యంలో తీవ్ర భావోద్వేగానికి లోనుకాగా.. సాత్విక్- చిరాగ్‌లను మథియాస్ బో ఓదార్చాడు. ఈ క్రమంలో శనివారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు మథియాస్ బో.
అలసిపోయిన ముసలి వ్యక్తిని
‘‘కోచ్‌గా నా ప్రస్థానం ముగిసిపోయింది. భారత జోడీ కోచ్‌గా కొనసాగలేను. ఇక్కడే కాదు.. ప్రస్తుతానికి ఎక్కడా పనిచేయలేను. ఇప్పటికే బ్యాడ్మింటన్‌లో ఎక్కువ సమయం గడిపేశాను. అయినా కోచ్‌గా ఉంటే తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నేనేమో అలసిపోయిన ముసలి వ్యక్తిని. మనం ఊహించిన ఫలితాలు రాకపోతే కచ్చితంగా నిరాశచెందుతాం. మీరు కష్టపడే తత్వం ఉన్న ఆటగాళ్లు. పతకంతో ఇండియాకు తిరిగి రావాలని ఎంతగా ఆకాంక్షించారో.. అందుకోసం ఎంతగా శ్రమించారో నాకు తెలుసు. అయితే, ఈసారి ఆ కల నెరవేరలేదు.
గర్వపడేలా చేశారు
గాయాలు వేధించినా.. వెనకడుగు వేయలేదు. నొప్పిని భరించేందుకు ఇంజక్షన్లు తీసుకున్నారు. అంకితభావంతో ఇక్కడిదాకా వచ్చారు. ప్రతీ మ్యాచ్ మనసు పెట్టి ఆడారు. నన్ను గర్వపడేలా చేశారు’’ అంటూ మథియాస్ బో.. సాత్విక్- చిరాగ్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. భారత్‌లో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయంటూ సహచరుల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.
మథియాస్ వచ్చిన తర్వాతే
కాగా మథియాస్ బో వచ్చిన తర్వాతే తాము ఆటలో మరింతగా రాటుదేలామని సాత్విక్- చిరాగ్ గతంలో పలు సందర్భాల్లో పేర్కన్నారు. తమ విజయాల వెనుక బో కష్టం కూడా ఉందని పేర్కొన్నారు. డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ స్టార్ మథియాస్ బో మరెవరో కాదు.. బాలీవుడ్ నటి తాప్సీ పన్ను భర్త అన్న సంగతి తెలిసిందే.
పదేళ్ల ప్రేమ
పదేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఇక ఒలింపిక్స్ కోసం భర్తతో కలిసి ప్యారిస్ వెళ్లిన తాప్సీ.. డెన్మార్క్‌లో తాము ఇల్లు కొనుగోలు చేశామని.. కొన్నాళ్లు అక్కడే ఉంటామని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల మథియాస్ బో రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment