Badminton doubles
-
గాయత్రి–ట్రెసా జోడీ మరో సంచలనం
సింగపూర్: భారత మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ భవిష్యత్‌కు భరోసా ఇస్తూ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో మరో సంచలనం సృష్టించింది. గురువారం ప్రపంచ రెండో ర్యాంక్ జంటను బోల్తా కొట్టించిన గాయత్రి–ట్రెసా శుక్రవారం ప్రపంచ ఆరో ర్యాంక్ జోడీని ఇంటిదారి పట్టించింది. 79 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 30వ ర్యాంక్ ద్వయం గాయత్రి–ట్రెసా 18–21, 21–19, 24–22తో కిమ్ సో యోంగ్–కాంగ్ హీ యోంగ్ (దక్షిణ కొరియా) జోడీని ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ గెలుపుతో గత ఏడాది ఆసియా క్రీడల్లో ఈ కొరియా జోడీ చేతిలో ఎదురైన ఓటమికి భారత జోడీ బదులు తీర్చుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో నాలుగో సీడ్ నమి మత్సుయామ–చిహారు షిదా (జపాన్)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. కొరియా ద్వయంతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో గాయత్రి–ట్రెసా ఓటమి అంచుల్లో నుంచి పుంజుకున్నారు. తొలి గేమ్ కోల్పోయి, రెండో గేమ్‌లో 12–18తో వెనుకబడిన గాయత్రి–ట్రెసా వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి ఆధిక్యాన్ని 17–18కి తగ్గించారు. ఆ తర్వాత కొరియా ద్వయం ఒక పాయింట్ సాధించగా... ఆ వెంటనే గాయత్రి–ట్రెసా వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో గేమ్‌లో పూర్తి సమన్వయంతో ఆడిన గాయత్రి–ట్రెసా కీలకదశలో పాయింట్లు నెగ్గి మరో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. -
సాత్విక్ – చిరాగ్ జోడీకి నిరాశ
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక టోర్నీలో భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్‌శెట్టిలకు చుక్కెదురైంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ – సూపర్ 750 టోర్నీ ఇండియా ఓపెన్‌లో భారత జోడి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో కొరియాకు చెందిన వరల్డ్ చాంపియన్ జంట కాంగ్ మిన్ హ్యూక్ – సియో సంగ్ జె 15–21, 21–11, 21–18 స్కోరుతో సాత్విక్ – చిరాగ్‌పై విజయం సాధించింది. 65 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగానే గెలుచుకున్న భారత జోడి ఆ తర్వాత తడబడింది. ముఖాముఖీ పోరులో కొరియా ఆటగాళ్లతో ఈ మ్యాచ్‌కు ముందు 4–1తో సాతి్వక్–చిరాగ్లదే పైచేయిగా ఉంది. అదే తరహాలో చక్కటి ర్యాలీలతో దూసుకుపోయిన వీరిద్దరు తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో 1–5తో ఆరంభంలో వెనుకబడిన మన ఆటగాళ్లు ఆ తర్వాత కోలుకోలేకపోయారు. ఒక దశలో వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించిన కొరియా టీమ్ 15–5తో ముందంజలో నిలిచి ఆపై గేమ్‌ను గెలుచుకుంది. మూడో గేమ్ పోటాపోటీగా సాగింది. గేమ్ తొలి అర్ధభాగాన్ని కొరియా ఆటగాళ్లు 11–6తో ముగించారు. అయితే ఆ తర్వాత భారత ద్వయం కోలుకొని మళ్లీ నిలిచారు. 15–16కు, ఆపై 18–19 వరకు స్కోరు వెళ్లింది. అయితే సాత్విక్ బయటకు కొట్టిన షాట్‌తో, అనంతరం చిరాగ్ నెట్‌కు కొట్టిన షాట్‌తో కొరియా విజయం ఖాయమైంది. తైజుకు మహిళల టైటిల్ వరల్డ్ నంబర్ 3 ప్లేయర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) మహిళల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో నాలుగో సీడ్ తై జు 21–16, 21–12తో రెండో సీడ్ చెన్ యు ఫిపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను షి యు కి (చైనా) సొంతం చేసుకున్నాడు. -
‘ఖేల్ రత్నా’లు సాత్విక్, చిరాగ్
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ లభించింది. 2023 సంవత్సరానికిగాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే ‘అర్జున’ అవార్డు 26 మందిని వరించింది. ఉత్తమ కోచ్‌లకు అందించే ‘ద్రోణాచార్య’ అవార్డును రెగ్యులర్ విభాగంలో ఐదుగురికి... లైఫ్‌టైమ్ విభాగంలో ముగ్గురికి ప్రకటించారు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి క్రీడా పురస్కారాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ‘ఖేల్ రత్న’ అందుకోనుండగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్) ‘అర్జున’ పురస్కారం పొందాడు. తెలంగాణకు చెందిన బాక్సర్ హుసాముద్దీన్, మహిళా షూటర్ ఇషా సింగ్‌లకు కూడా ‘అర్జున’ అవార్డు దక్కింది. జనవరి 9న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలు అందజేస్తారు. ♦ ‘ఖేల్ రత్న’ అవార్డీలకు మెడల్, ప్రశంస పత్రంతోపాటు రూ. 25 లక్షలు... ‘అర్జున’ విజేతలకు రూ. 15 లక్షలు... ‘ద్రోణాచార్య’ అవార్డీలకు రూ. 15 లక్షలు... ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డీలకు రూ. 10 లక్షల చొప్పున నగదు పురస్కారం లభిస్తుంది. ♦గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన 33 ఏళ్ల అజయ్ 2010 నుంచి భారత అంధుల క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2016లో టీమిండియాకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అజయ్ సారథ్యంలోనే భారత్ 2017 టి20 వరల్డ్ కప్, 2018 వన్డే వరల్డ్‌కప్, 2022 టి20 వరల్డ్‌కప్ టైటిల్స్ గెలిచింది. ♦ నిజామాబాద్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల హుసాముద్దీన్ ఈ ఏడాది తాషె్కంట్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షి ప్లో కాంస్య పతకం గెలిచాడు. ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా విధులు నిర్వ హిస్తున్న హుసాముద్దీన్ 2022 ఆసియా చాంపియన్‌షి ప్లో... 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాలు నెగ్గాడు. ♦ హైదరాబాద్‌కు చెందిన 18 ఏళ్ల పిస్టల్ షూటర్ ఇషా సింగ్ ఈ ఏడాది అజర్బైజాన్లో జరిగిన ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షి ప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో, 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు గెలిచింది. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఒక స్వర్ణం, మూడు రజత పతకాలు నెగ్గింది. గత ఏడాది జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక కాంస్యం సాధించింది. నిలకడగా... మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ సాయిరాజ్ గత ఐదేళ్లలో పలు అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది మొత్తం సాత్విక్–చిరాగ్ జోడీ సూపర్ ఫామ్‌లో ఉంది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా చాంపియన్‌షి ప్లో... చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ ఈ జంట స్వర్ణ పతకాలు సాధించింది. స్విస్ ఓపెన్ సూపర్–300, ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000, కొరియా ఓపెన్ సూపర్–500 టోర్నీల్లోనూ విజేతగా నిలిచింది. చైనా మాస్టర్స్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో రన్నరప్ ట్రోఫీ దక్కించుకుంది. దాంతోపాటు డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. ఇక 2022లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్ కప్ టోర్నీలో తొలిసారి భారత్ విజేతగా నిలువడంలో సాత్విక్–చిరాగ్ శెట్టి కీలకపాత్ర పోషించారు. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం పసిడి పతకాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా ఇండియా ఓపెన్ సూపర్–500, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీల్లోనూ టైటిల్స్ కైవసం చేసుకుంది. 2018లో హైదరాబాద్ ఓపెన్, 2019లో థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీల్లోనూ సాత్విక్–చిరాగ్ జంట విజేతగా నిలిచింది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జట్టుకు మిక్స్డ్ టీమ్‌లో స్వర్ణం రావడానికి సాత్విక్–చిరాగ్ ముఖ్యపాత్ర పోషించారు. అవార్డు గ్రహీతలు... ‘ఖేల్ రత్న’ (2): సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్). అర్జున అవార్డీలు (26): ఒజస్ ప్రవీణ్ దేవ్‌తలే, అదితి స్వామి (ఆర్చరీ), శ్రీశంకర్, పారుల్ చౌధరీ (అథ్లెటిక్స్), హుసాముద్దీన్ (బాక్సింగ్), వైశాలి (చెస్), షమీ (క్రికెట్), అనూష్ అగర్వల్లా, దివ్యాకృతి సింగ్ ( ఈక్విస్ట్రి యన్), దీక్షా డాగర్ (గోల్ఫ్), క్రిషన్ బహదూర్ పాఠక్, సుశీలా చాను (హాకీ), పవన్ కుమార్, రీతూ నేగి (కబడ్డీ), నస్రీన్ (ఖో–ఖో), పింకీ (లాన్ బాల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, ఇషా సింగ్ (షూటింగ్), హరీందర్ పాల్ (స్క్వాష్), అహిక ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్, అంతిమ్ పంఘాల్ (రెజ్లింగ్), రోషిబీనా (వుషు), అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్), ప్రాచీ యాదవ్ (పారా కనోయింగ్). ద్రోణాచార్య అవార్డీలు (రెగ్యులర్ కేటగిరీ–5): లలిత్ కుమార్ (రెజ్లింగ్), ఆర్బీ రమేశ్ (చెస్), మహావీర్ ప్రసాద్ (పారా అథ్లెటిక్స్), శివేంద్ర సింగ్ (హాకీ), గణేశ్ ప్రభాకర్ (మల్లఖంబ్). ద్రోణాచర్య అవార్డీలు (లైఫ్‌టైమ్–3): జస్కీరత్ సింగ్ గ్రెవాల్ (గోల్ఫ్), భాస్కరన్ (కబడ్డీ), జయంత కుమార్ (టేబుల్ టెన్నిస్). ధ్యాన్‌చంద్ అవార్డీలు (లైఫ్‌టైమ్ అచీవ్మెంట్–3): మంజూషా కన్వర్ (బ్యాడ్మింటన్), వినీత్ శర్మ (హాకీ), కవితా సెల్వరాజ్ (కబడ్డీ). మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (అత్యుత్తమ యూనివర్సిటీలు–3): 1. గురునానక్ దేవ్ యూనివర్సిటీ (అమృత్సర్), 2. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (పంజాబ్), 3. కురుక్షేత్ర యూనివర్సిటీ (కురుక్షేత్ర, హరియాణా). -
నిరాశపరిచిన జ్వాల, అశ్విని
రియో డి జనీరో: భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారిణులు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప నిరాశపరిచారు. రియో ఒలింపిక్స్ లో గురువారం జరిగిన తమ తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలయ్యారు. మహిళ బ్యాడ్మింటన్ గ్రూప్ దశ మ్యాచ్ లో జపాన్ జోడీ మట్సుటొమొ మిసాకి, తకహషి చేతిలో జ్వాల, అశ్విని ఓడిపోయారు. రెండు వరుస సెట్లలో 21-15, 21-10 తేడాతో భారత జోడీపై జపాన్ ద్వయం సులువుగా పైచేయి సాధించింది. తమ రెండో మ్యాచ్ లో థాయ్ లాండ్ కు చెందిన సుపాజిరకుల్, తెరట్టాంచాయ్ తో తలపడతారు. -
‘టాప్’లోకి జ్వాల, అశ్విని
కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం న్యూఢిల్లీ : భారత బ్యాడ్మింటన్ డబుల్స్ మేటి క్రీడాకారిణిలు జ్వాల-అశ్విని జోడిని ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) స్కీమ్‌లో చేర్చనున్నారు. ఈ మేరకు కేంద్ర క్రీడాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే జాబితాలో ఈ ఇద్దరి పేర్లను చేరుస్తామని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ‘బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కోసం డబుల్స్ కోచ్ ఉండాలని మేం ఆమోద ముద్ర వేశాం. కాబట్టి మేటి ఆటగాళ్లను టాప్‌లోకి తీసుకురావాలని నిర్ణయించాం. ప్రస్తుతం జ్వాల-అశ్విని కంటే మెరుగైన క్రీడాకారిణిలు లేరు. వాళ్లను టాప్‌లో చేరుస్తాం. గోపీచంద్‌పై వాళ్లు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు. టాప్ సమావేశాల్లో కనీసం ఒక్కసారి కూడా గోపీ వాళ్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కేవలం అతని వల్లే మేం డబుల్స్ కోచ్‌ను తీసుకునేందుకు అంగీకరించాం’ అని సదరు అధికారి పేర్కొన్నారు. -
జ్వాలపై జీవితకాల నిషేధం!
న్యూఢిల్లీ: వివాదాస్పద బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలపై భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) జీవిత కాల నిషేధం విధించే ఆలోచనలో ఉంది. ఇటీవలి ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో తమ ఫ్రాంచైజీ క్రిష్ ఢిల్లీ స్మాషర్స్ ఆటగాళ్లను బంగా బీట్స్‌తో మ్యాచ్ ఆడనీయకుండా అడ్డుకుందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాయ్ ఈ ఘటనపై క్రమశిక్షణ కమిటీని నియమించింది. ఈనేపథ్యంలో జ్వాలపై జీవిత కాల నిషేధం లేక ఆరేళ్ల పాటు సస్పెన్షన్ విధించాలని కమిటీ సూచించినట్టు బాయ్ సీనియర్ అధికారి చెప్పారు. అసోసియేషన్ సభ్యులందరికీ ఇప్పటికే ఈ సూచనలను పంపించారు. అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ‘ఈ విషయంపై నేను ఎక్కువగా మాట్లాడను. ఒకవేళ జ్వాల బేషరతుగా క్షమాపణ చెబితే ఎలాంటి శిక్ష పడకుండా బయటపడవచ్చు. అది బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే జరిగినదానిపై ఆమె విచారం వ్యక్తం చేయాల్సి ఉంది.’ అని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మురళీధరన్ చెప్పారు. గతంలో జ్వాలకు ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కు ఈ హైదరాబాద్ క్రీడాకారిణి సమాధానం ఇచ్చింది. ఢిల్లీ యాజమాన్యం చెప్పినట్లే చేశానని, తన వ్యక్తిగత నిర్ణయం కాదని ఆమె పేర్కొంది. అయితే ఈ వివరణ పట్ల బాయ్ సంతృప్తి చెందలేదు. లేఖ రాయనున్న బాయ్ అధ్యక్షుడు కమిటీ ఇచ్చిన సూచనలపై స్పందన కోసం జ్వాలకు భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా త్వరలోనే లేఖ రాయనున్నట్టు సమాచారం. ప్రతిస్పందన కోసం ఆమెకు వారం రోజుల సమయం ఉంటుందని, ఆ తర్వాతే శిక్ష ఖరారు ఉంటుందని బాయ్ వర్గాలు తెలిపాయి. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: క్రాంతి జ్వాల ఎలాంటి తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆమె తండ్రి క్రాంతి ‘సాక్షి’తో చెప్పారు. ‘బాయ్ మాకు నేరుగా ఏమీ చెప్పలేదు. మీడియా ద్వారానే తెలిసింది. కనీసం మాపై చర్య తీసుకుంటున్న విషయం మాకు చెప్పకపోతే ఎలా? ఇది చాలా బాధాకరం. అయినా నిర్ణయం తీసుకున్న తర్వాత క్షమాపణ చెప్పమనడంలో అర్థం లేదు. జ్వాల ఎలాంటి తప్పు చేయలేదు. చేయని తప్పుకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు’ అని క్రాంతి అన్నారు.