జ్వాలపై జీవితకాల నిషేధం!
న్యూఢిల్లీ: వివాదాస్పద బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలపై భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) జీవిత కాల నిషేధం విధించే ఆలోచనలో ఉంది. ఇటీవలి ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో తమ ఫ్రాంచైజీ క్రిష్ ఢిల్లీ స్మాషర్స్ ఆటగాళ్లను బంగా బీట్స్‌తో మ్యాచ్ ఆడనీయకుండా అడ్డుకుందనే ఆరోపణలు వచ్చాయి.
దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాయ్ ఈ ఘటనపై క్రమశిక్షణ కమిటీని నియమించింది. ఈనేపథ్యంలో జ్వాలపై జీవిత కాల నిషేధం లేక ఆరేళ్ల పాటు సస్పెన్షన్ విధించాలని కమిటీ సూచించినట్టు బాయ్ సీనియర్ అధికారి చెప్పారు. అసోసియేషన్ సభ్యులందరికీ ఇప్పటికే ఈ సూచనలను పంపించారు. అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.
‘ఈ విషయంపై నేను ఎక్కువగా మాట్లాడను. ఒకవేళ జ్వాల బేషరతుగా క్షమాపణ చెబితే ఎలాంటి శిక్ష పడకుండా బయటపడవచ్చు. అది బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే జరిగినదానిపై ఆమె విచారం వ్యక్తం చేయాల్సి ఉంది.’ అని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మురళీధరన్ చెప్పారు. గతంలో జ్వాలకు ఇచ్చిన షోకాజ్ నోటీస్‌కు ఈ హైదరాబాద్ క్రీడాకారిణి సమాధానం ఇచ్చింది. ఢిల్లీ యాజమాన్యం చెప్పినట్లే చేశానని, తన వ్యక్తిగత నిర్ణయం కాదని ఆమె పేర్కొంది. అయితే ఈ వివరణ పట్ల బాయ్ సంతృప్తి చెందలేదు.
లేఖ రాయనున్న బాయ్ అధ్యక్షుడు
కమిటీ ఇచ్చిన సూచనలపై స్పందన కోసం జ్వాలకు భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా త్వరలోనే లేఖ రాయనున్నట్టు సమాచారం. ప్రతిస్పందన కోసం ఆమెకు వారం రోజుల సమయం ఉంటుందని, ఆ తర్వాతే శిక్ష ఖరారు ఉంటుందని బాయ్ వర్గాలు తెలిపాయి.
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: క్రాంతి
జ్వాల ఎలాంటి తప్పు చేయలేదని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆమె తండ్రి క్రాంతి ‘సాక్షి’తో చెప్పారు. ‘బాయ్ మాకు నేరుగా ఏమీ చెప్పలేదు. మీడియా ద్వారానే తెలిసింది. కనీసం మాపై చర్య తీసుకుంటున్న విషయం మాకు చెప్పకపోతే ఎలా? ఇది చాలా బాధాకరం. అయినా నిర్ణయం తీసుకున్న తర్వాత క్షమాపణ చెప్పమనడంలో అర్థం లేదు. జ్వాల ఎలాంటి తప్పు చేయలేదు. చేయని తప్పుకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు’ అని క్రాంతి అన్నారు.