
గుండెపోటుతో తండ్రి కాశీ విశ్వనాథం మృతి
సాక్షి, అమలాపురం: ఇది విధి రాసిన విషాదవార్త! తనయుడి అవార్డుని చూసి మురిసిపోదామనుకుంటే... తండ్రి భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యే పరిస్థితి! ‘ఖేల్‌రత్న’తో విజయోత్సవ వేడుకలు చేసుకోవాల్సిన ఇంట విషాదం అలుముకున్న దుస్థితి! ఆంధ్రప్రదేశ్ స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ తండ్రి రంకిరెడ్డి కాశీ విశ్వనాథం గురువారం ఉదయం గుండెపోటుతో హఠాత్తుగా కన్నుమూశారు. ఆయనకు భార్య రంగమణి, ఇద్దరు కుమారులు రాంచరణ్, సాత్విక్ ఉన్నారు.
65 ఏళ్ల కాశీ విశ్వనాథం గురువారం సాయంత్రం దేశ రాజధానిలో తనయుడు సా త్విక్‌కు ‘ఖేల్‌రత్న’ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. ఇందుకోసం సొంతూరు అమలాపురం నుంచి కారులో రాజమండ్రి విమానాశ్రయానికి బయలుదేరిన ఆయన పట్టణం దాటిన కొద్దిసేపటికే గుండెపోటుకు గురై మృతి చెందారు. ఊహించని విషాద వార్త అక్కడి కుటుంబసభ్యుల్ని, ఢిల్లీలో ఉన్న సా త్విక్ సాయిరాజ్‌ను కన్నీటి సంద్రంలో ముంచేసింది. అమెరికాలో ఉన్న సాత్విక్ సోదరుడు రాంచరణ్ స్వస్థలం చేరుకున్నాక శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.
బ్యాడ్మింటన్ క్రీడపై ఆసక్తి కనబరిచిన సాత్విక్‌కు తొలి కోచ్‌గా ఓనమాలు నేరి్పన తండ్రి తదనంతరం అతని ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ షట్లర్‌గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. డబుల్స్‌లో అసాధారణ ప్లేయర్‌గా ఎదిగిన సాత్విక్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య అంతర్జాతీయ టోర్నీల్లో, ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పాల్గొన్నాడు. అనతికాలంలోనే ఎన్నో పతకాలు, ట్రోఫీలు నెగ్గిన సా త్విక్ ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం సా త్విక్‌తోపాటు అతని డబుల్స్ భాగస్వామి చిరాగ్ శెట్టిని 2023 సంవత్సరానికిగాను ‘ఖేల్‌రత్న’ పురస్కారానికి ఎంపిక చేసింది.
2024 జనవరిలో ఢిల్లీలో జాతీయ క్రీడా అవార్డుల ప్రదానోత్సవం జరగ్గా... సా త్విక్–చిరాగ్ మలేసియా ఓపెన్ టోర్నీ లో ఆడుతుండటంతో హాజరు కాలేకపోయారు. ప్రస్తుతం పెట్రోలియం స్పోర్ట్స్ ఇంటర్ యూనిట్ టోర్నీ ఆడేందుకు సాత్విక్, చిరాగ్ ఢిల్లీలో ఉన్నారు. దాంతో కేంద్ర క్రీడా శాఖ ‘ఖేల్‌రత్న’ అందజేయాలని భావించి కార్యక్రమం ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment