ఆసియా క్రీడలకు 516 మంది
క్రీడాకారులకు ప్రభుత్వ అనుమతి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్ తరఫున 516 మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. వీరితో పాటు మరో 163 మంది కోచ్‌లు, సహాయక సిబ్బంది కలిపి మొత్తం 679 మంది సభ్యుల బృందం ఏషియాడ్‌కు వెళుతుంది. ఈ నెల 19 నుంచి అక్టోబర్ 4 వరకు దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ప్రాధమికంగా ప్రతిపాదించిన 942 మంది సభ్యుల బృందంలో 263 మందిని ప్రభుత్వం తప్పించింది.
ఆ ఐదింటికీ అవకాశం...
ఆసియా క్రీడలకు పంపాలంటే వ్యక్తిగత విభాగంలో టాప్-6లో, టీమ్ విభాగంలో అయితే టాప్-8లో ఉండాలని గతంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) షరతు విధించింది. దాంతో ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, హ్యండ్‌బాల్, బాస్కెట్‌బాల్, సెపక్‌తక్రాలలో భారత్ పాల్గొనే అవకాశాలు దాదాపుగా లేకుండా పోయాయి. అయితే అలా చేస్తే భారీ జరిమానా విధిస్తామనే ఆసియా ఒలింపిక్ మండలి హెచ్చరికతో భారత్ పై క్రీడాంశాల్లోనూ జట్లను పంపాలని నిర్ణయించింది. 2010 గ్వాంగ్‌జూ ఆసియా క్రీడల్లో 35 క్రీడాంశాల్లో పోటీ పడిన భారత్ ఈ సారి 28 ఈవెంట్లకే పరిమితం కానుంది. అప్పటి భారత బృందం సంఖ్య (933)తో పోలిస్తే ఈ సారి చాలా తక్కువ మంది ఈ పోటీలకు హాజరవుతున్నారు.