వారిద్దరి సభ్యత్వాలు రద్దు!
న్యూఢిల్లీ: సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాల వ్యవహారంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ఎట్టకేలకు దిగివచ్చింది. కుంభకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్మాడి, చౌతాలా అపాయింట్మెంట్ను రద్దు చేస్తూ ఐఓఏ నిర్ణయం తీసుకుంది. సురేష్ కల్మాడీకి జీవితకాల అధ్యక్షుడిగా పగ్గాలు అప్పచెబుతూ ఇటీవల ఐఓఏ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే ఐఓఏ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్మాడి, చౌతాలాలకు ప్రతిష్టాత్మక సంస్థలో చోటు కల్పించరాదని, తక్షణమే వారు రాజీనామా చేయడమో, లేదంటే తొలగించడమో జరగాలని ఒలింపిక్ సంఘానికి(ఐఓఏకి) కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఒకవేళ మాట వినకుంటే ఐఓఏకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపును రద్దుచేస్తామని హెచ్చరించింది. ఆ నేపథ్యంలో వారి జీవితకాల అపాయింట్లను రద్దు చేస్తూ తాజాగా ఐఓఏ నిర్ణయం తీసుకుంది.