ముంబై: మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్రలో జరగనున్న రెండో దశ మహ సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. రేపు జరగనున్న 19 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రముఖ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి వీరందరికి ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుండటంతో మహా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
రెండో దశలో మొత్తం 358 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే గత రెండు నెలల నుంచి అకాల వర్షాలు, తుఫానుల ప్రభావం ఎదుర్కొన్న పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతవాసులు ఈసారి ఎవరి పక్షాన నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. భారీ పరిశ్రమలు, అభివృద్ధి జరగకపోవడంతో మరాఠ్వాడా ప్రజలు ఓటుతో ఈసారి ఏం తీర్పు చెబుతారనేది ప్రాధాన్యత సంతరించుకుంది. చక్కెర ధాన్యగారంగా ఉన్న పశ్చిమ మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
కేంద్రంలో కీలక హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సుశీల్‌కుమార్ షిండే, ఎన్‌డీఏలో ప్రధాన భూమిక పోషిస్తున్న గోపీనాథ్ ముండే, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం అశోక్ చవాన్ బరిలో ఉండటంతో రెండో దశ ఎన్నికలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
షోలాపూర్‌లో...
షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న సుశీల్‌కుమార్ షిండే తప్పక గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నారు. ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురవుతుండంతో ప్రచారానికి చివరి రోజైనా మంగళవారం కూడా పాదయాత్ర చేశారు. ప్రజలను కలిసి ఓట్లేయాలని కోరారు. గెలుపు సులభమేనని పైకి చెబుతున్నా మహా కూటమి అభ్యర్థి శరద్ బన్సోడే గట్టి పోటీ ఇచ్చే అవకాశాలుండడంతో గత కొన్ని రోజులుగా షిండే షోలాపూర్‌లోనే మకాం వేశారు. ఇక్కడ ఉన్న తెలుగు ఓటర్లు ఈసారి ఎవరివైపు మొగ్గుచూపనున్నారనేది కీలకంగా మారింది.
నాందేడ్‌లో...
నాందేడ్‌లోనూ పరిస్థితి మిగతా ప్రాంతాల మాదిరిగానే ఉంది. కాంగ్రెస్ స్టార్ క్యాంపేన్‌లలో ఒకరైన మాజీ సీఎం అశోక్ చవాన్ ఎక్కడికి వెళ్లకుండా నాందేడ్ లోక్‌సభపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆయనకు బీజేపీ అభ్యర్థి డీబీ పాటిల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలపాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఎలాగైన భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు శ్రమటోడుస్తున్నారు. నేతలు, కార్యకర్తలు కలుపుకొని ముందుకెళుతున్నారు.
బీడ్‌లో...
బీడ్ లోక్‌సభ నియోజకవర్గంలో గోపీనాథ్ ముండేకు డీఎఫ్ కూటమి అభ్యర్థి, రెవెన్యూ శాఖ సహాయక మంత్రి సురేష్ ధస్ గట్టిపోటీ ఇస్తున్నారు. ఆప్ నుంచి మరాఠీ నటుడు నందూ మాధవ్ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో గత నాలుగు రోజులు నుంచి ముండే బీడ్ నియోజకవర్గంలోనే మకాం వేశారు. ముండేను ఈసారి ఓడించాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తుండటంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది.
బారామతిలో...
పవార్ కుటుంబీకులకు పెట్టని కోటగా ఉన్న బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో బరిలో ఉన్న ఎన్సీపీ అభ్యర్థిని సుప్రియా సూలేకు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రజల్లో ఆదరణ ఉన్న సురేష్ ఖోపడేను ఆప్ బరిలోకి దింపడంతో ఇక్కడ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అయితే సుప్రియా సూలే విజయం ఖాయమని, అయితే అది ఎంత మెజార్జీ అన్నది ఎన్నికల్లో తెలుస్తుందని ఎన్సీపీ కార్యకర్తలు అంటున్నారు.
రత్నగిరి-సిందుదుర్గ్‌లో...
రత్నగిరి-సిందుదుర్గ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న రాష్ట్ర మంత్రి నారాయణ రాణే కుమారుడు నీలేశ్ రాణేకు తీవ్ర పోటీ ఎదురవుతోంది. మిత్రపక్షమైన ఎన్సీపీలోని అనేక మంది కార్యకర్తలు నీలేశ్‌కు మద్ధతిచ్చేదే లేదని ప్రకటించడంతో నీలేశ్ విజయం మరింత సంక్లిష్టంగా మారింది. ఎన్సీపీ రెబల్ అభ్యర్థులు శివసేన అభ్యర్థి వినాయక్ రావుత్‌కు మద్ధతు ప్రకటించారు. సతారా నుంచి బరిలో ఉన్న ఎన్‌సీపీ అభ్యర్థి ఉదయన్‌రాజే భోస్లేకు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి ఆశోక్ గైక్వాడ్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. మాడా నుంచి ఎన్సీపీకి చెందిన విజయ్‌సిన్హా మొహిత్ పాటిల్, పుణే నుంచి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పతంగ్‌రావ్ కదమ్ కుమారుడు విశ్వజిత్ కదమ్ విజయం కోసం శ్రమటోడుస్తున్నారు. విశ్వజిత్ కదమ్‌కు బీజేపీ అభ్యర్థి అనిల్ శిరోల్, ఎమ్మెన్నెస్ అభ్యర్థి దీపక్ పైగుడే పోటీ ఇస్తున్నారు. కామన్వెల్త్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సురేశ్ కల్మాడీకి మొదట టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసినా, ఆ తర్వాత విశ్వజిత్ కదమ్‌కు పూర్తి మద్ధతును ప్రకటించారు.
రెండో దశలో మహామహులు
Published Wed, Apr 16 2014 2:11 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement