ఆ పదవి స్వీకరించను: కల్మాడీ
కళంకితులకు అత్యున్నత పదవులపై
ఐఓఏకు కేంద్ర క్రీడాశాఖ నోటీసు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్–2010 కుంభకోణంలో జైలుకెళ్లొచ్చిన సురేశ్ కల్మాడీ, అవినీతి అరోపణలెదుర్కొంటున్న అభయ్ సింగ్ చౌతాలాకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో జీవితకాల గౌరవాధ్యక్ష పదవులు కట్టబెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కేంద్ర క్రీడాశాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీచేసింది. తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఐఓఏ గుర్తింపును రద్దు∙చేస్తామని హెచ్చరించింది. మరోవైపు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేవరకు ఆ పదవీ బాధ్యతలు చేపట్టబోమని కల్మాడీ వెల్లడించారు. ‘ఐఓఏ నిర్ణయానికి కృతజ్ఞతలు. కానీ ఇపుడున్న పరిస్థితుల్లో ఆ పదవి చేపట్టను. నాపై మోపిన అవినీతి కేసులో నిర్దోషిగా బయటపడతాననే నమ్మకం నాకుంది. అప్పుడు గౌరవాధ్యక్ష పదవిపై ఆలోచిస్తాను’ అని కల్మాడీ ఐఓఏకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు అభయ్ సింగ్ చౌతాలా క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్‌పై ఎదురుదాడికి దిగారు. తాను ఐఓఏ అధ్యక్షుడిగా ఉన్నపుడు దేశంలో క్రీడాభివృద్ధికి కృషి చేశానని, గౌరవ అధ్యక్ష పదవి స్వీకరించేందుకు తనకు అర్హత ఉందని వ్యాఖ్యానించారు.
వెనక్కి తగ్గాల్సిందే...
ఐఓఏ నియమాళికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర క్రీడాశాఖ సమ్మతించబోదని మంత్రి గోయెల్ స్పష్టం చేశారు. ఐఓఏ తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడల్లో పారదర్శకత కోసం పాటుపడుతున్నామని... కళంకితుల్ని సహించే ప్రశ్నేలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. వెనక్కి తగ్గే వరకు ఐఓఏతో తమ శాఖాపరమైన సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రపంచకప్ జూనియర్ హాకీ టైటిల్ నెగ్గిన భారత జట్టు సభ్యులను సన్మానించారు. మరోవైపు అర్హతలేని వారిని జీవితకాల అధ్యక్షుడిగా నియమించే అధికారం ఐఓఏకు లేదని క్రీడాశాఖ ఉన్నతాధికారులు చెప్పారు.
ఐఓఏ అనుబంధ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు నరీందర్ బాత్రా తాజా పరిణామంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఏజీఎమ్‌లో అందరూ కలిసి తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయంపై నిప్పులు చెరిగారు. ఐఓఏతో తన అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటానన్నారు. మాజీ క్రీడల మంత్రి అజయ్ మాకెన్ ఐఓఏ నియామకాలపై విచారం వ్యక్తం చేశారు. భారత క్రీడలకు ఇలాంటి నిర్ణయాలు చేటు చేస్తాయన్నారు. క్రీడాశాఖ తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టాలన్నారు.