బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. విపక్షాల ఐక్యత పేరిట కాంగ్రెస్‌తో దోస్తీలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP).. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. కాంగ్రెస్ కీలక నేతలతో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ భేటీ, తామంతా ఒక్కటేనంటూ ప్రకటించిన మరుసటి రోజే ఈ నిర్ణయం ప్రకటించడం గమనార్హం.
కర్ణాటక ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించిన ఎన్‌సీపీ.. 40 నుంచి 45 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే అక్కడ బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ తరుణంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే ఆశ్చర్యకర రీతిలో ఎన్‌సీపీ పోటీలోకి దిగుతోంది. ఈ పోటీ మిత్రపక్షం కాంగ్రెస్ అవకాశాలపై ప్రభావం చూపించొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజాగా జాతీయ పార్టీ హోదా కోల్పోయిన ఎన్‌సీపీకి.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ క్లాక్ సింబల్‌నే కేటాయించడం విశేషం. మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులో మరాఠా జనాభా అధికంగా ఉండే ప్రాంతాల్లో మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి భాగస్వామ్యంతో ఎన్‌సీపీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదానీ వ్యవహారంపై జేపీసీ డిమాండ్ విషయంలో పవార్, విపక్షాల(కాంగ్రెస్ నేతృత్వంలోని) నుంచి విభేదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం పవార్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. బీజేపీపై పోరుకు విపక్షాల ఐక్యత పేరిట ఒక్కటిగా ముందుకు సాగాలని ఈ భేటీలో తీర్మానించుకున్నారు కూడా. ఈలోపే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండికొట్టే నిర్ణయం ఎన్‌సీపీ తీసుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment