కర్ణాటక కాంగ్రెస్‌లో ఆయనో సంచలనం. పార్టీలో ఎక్కడ సంక్షోభం వచ్చినా పరిష్కరించగల నేర్పరి. నవయువకుడిగా రాజకీయ రంగంలోకి వచ్చారు.. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. పీసీసీ చీఫ్‌గా కర్ణాటకలో కాంగ్రెస్‌కు అపూర్వ విజయాన్ని అందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించారు. మాస్‌కి మాస్.. క్లాస్‌కి క్లాస్.. ఆయనే డీకే. శివకుమార్.
దొడ్డనహళ్ళి కెంపెగౌడ శివకుమార్ కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక సంచలనం. 61 ఏళ్ళ శివకుమార్ కర్ణాటక పీసీసీ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తూ, ట్రబుల్ షూటర్గా కాంగ్రెస్లో పేరు తెచ్చుకున్నారు. 2002లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి విలాసరావు దేశ్ముఖ్ ప్రభుత్వాన్ని కాపాడటంలో, 2017లో గుజరాత్లో అహ్మద్పటేల్ రాజ్యసభకు ఎన్నిక కావడంలో కీలక పాత్ర పోషించారు. తనకున్న చాతుర్యంతో, పార్టీలో ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలరనే ప్రశంసలందుకున్నారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక జనతాదళ్, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు.
జనతాదళ్ ఎస్ నేత కుమారస్వామి ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా, సిద్ధరామయ్య ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు నిర్వహించారు. కనకపుర నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన శివకుమార్ 1980లో విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 1989లో 27 ఏళ్ళ వయసులో తొలిసారి మైసూరు జిల్లాలోని సాతనూరు నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరో మూడు సార్లు అక్కడి నుంచే గెలిచారు. 2008 నుంచి వరుసగా నాలుగుసార్లు కనకపుర నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు.
పార్టీలో ట్రబుల్ షూటర్గా ఎంత పేరు తెచ్చుకున్నారో మంత్రిగా పనిచేసినపుడు అవినీతి ఆరోపణల్ని కూడా అదే రేంజ్లో ఎదుర్కొన్నారు. ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు, అక్రమ సంపద కేసులతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శివకుమార్ను టార్గెట్ చేసింది. బీజేపీలో చేరమని చేసిన ఒత్తిడి ఫలించకపోవడంతో సీబీఐ, ఈడీ కేసులతో శివకుమార్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. జైలులో పెట్టినప్పటికీ చలించకుండా కాంగ్రెస్ పార్టీలో స్థిరంగా కొనసాగారు. బెంగళూరు శివార్లలోని తన ఫామ్ హౌజ్ కాంగ్రెస్ పార్టీలోని పలు రాజకీయ సంక్షోభాలను నివారించింది. విలాసరావ్ దేశ్ముఖ్ నాయకత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడేందుకు అక్కడి ఎమ్మెల్యేల కోసం శివకుమార్ ఫామ్హౌజ్లోనే క్యాంప్ నిర్వహించారు. అదేవిధంగా గుజరాత్లో కాంగ్రెస్ కీలక నేత అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించే క్రమంలో అక్కడి ఎమ్మెల్యేలను కూడా ఫామ్ హౌజ్కు తీసుకువచ్చారు.
తనకున్న రాజకీయ చాతుర్యంతో, ట్రబుల్ షూటర్ పేరుతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సన్నిహితుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు. దేశంలో ధనిక రాజకీయ నేతల్లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకున్న డీకే శివకుమార్..తనకున్న ఆస్తులు 840 కోట్ల రూపాయలుగా 2018 ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఇచ్చిన డిక్లరేషన్లో తెలియచేశారు. తాజా ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఆస్తుల విలువను 1139 కోట్లుగా వెల్లడించారు. శివకుమార్ మీద మనీ లాండరింగ్ కేసులు, ఆదాయపన్ను ఎగవేత కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment