రాష్ట్ర కాంగ్రెస్ ప్రక్షాళన
- ముఖ్యమంత్రి, ఎంపీసీసీ అధ్యక్షుడిని మార్చే అవకాశం
- సీఎం రేసులో షిండే, ఎంపీసీసీ అధ్యక్షుడి రేసులో అశోక్‌చవాన్
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తే చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులోభాగంగానే ముఖ్యమంత్రి, ఎంపీసీసీ అధ్యక్షుడిని మార్చాలనే అభిప్రాయంలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు కాగానే సీఎంను తప్పించే అవకాశాలున్నట్లు సమాచారం. దీంతో ఎన్నికలకు ముందే సీఎం పృథ్వీరాజ్ చవాన్ గద్దె దిగక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) అధ్యక్షుడిని కూడా మారుస్తారని, ఈ రెండు స్థానాలను అనుభవం ఉన్న నేతలకు అప్పగిస్తారని చెబుతున్నారు.
పవార్‌తో చర్చించిన సోనియా..?
ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, సోనియాగాంధీతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్య కూటమిని అధికారంలోకి తేవడానికి ఏం చేయాలనే విషయమై మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఈ సమయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎంపీసీసీ అధ్యక్షుడిని మారిస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే విషయమై కూడా సోనియా పవార్‌ను అడిగినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలోనే ఈ మార్పులు జరగడం ఖాయమని చెబుతున్నారు.
మొదలైన ఫైరవీలు...
ముఖ్యమంత్రిని, ఎంపీసీసీ అధ్యక్షుడిని మార్చనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పదవులను దక్కించుకునేందుకు రాష్ట్ర నేతలు అప్పుడే ఫైరవీలు మొదలు పెట్టినట్లు తెలిసింది. ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తులతోపదవుల కోసం రాయబారాలు సాగిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
రేసులో ఎవరెవరు?
ఒకవేళ అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చాలని నిర్ణయం తీసుకుంటే ఆ స్థానంలో ఎవరిని కూర్చోబెడుతుందన్న ప్రశ్నలకు పార్టీ నేతల నుంచి హర్షవర్ధన్ పాటిల్, సుశీల్‌కుమార్ షిండే, రాధాకృష్ణ విఖేపాటిల్ తదితరుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరంతా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైనా పార్టీ వీరివైపే మొగ్గు చూపే అవకాశముందంటున్నారు. కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు అధిష్టానం తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని కూడా చెబుతున్నారు. ఇదిలావుండగా మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను మార్చాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లయితే ఈ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను కూర్చుండ బెట్టే సూచనలు మెండుగా ఉన్నాయంటున్నారు.
అయితే ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ సీఎం పదవిని పోగొట్టుకున్న అశోక్ చవాన్‌ను పెయిడ్ న్యూస్ కేసు వెంటాడుతోంది. దీనిపై విచారణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 20లోపు విచారణ పూర్తిచేసి నిర్ణయం ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో 20 తర్వాత ఒకవేళ అశోక్ చవాన్‌కు క్లీన్ చిట్ లభిస్తే పీసీసీ అధ్యక్ష పదవి పగ్గాలు ఆయనకే కట్టబెట్టవచ్చని చెబుతున్నారు.