Maharashtra Pradesh Congress Committee (MPCC)
-
తెలుగు వ్యక్తికి పీసీసీ ఉపాధ్యక్ష పదవి
సాక్షి ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి (ఎంపీసీసీ) ఉపాధ్యక్ష పదవి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకి చెందిన తెలుగువ్యక్తిని వరించింది. ఎంపీసీసీ అధ్యక్షునితోపాటు ఆరుగురు కార్య«ధ్యక్షులు, 10 మంది ఉపా««ధ్యక్షులను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. వీరిలో మరాఠ్వాడాలో ప్రస్తుతం ఏకైక రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన జాల్నా ఎమ్మెల్యే కైలాస్ గోరింట్యాల్ ఉన్నారు. కైలాస్ పూర్వికులు జీవనోపాధికోసం మహారాష్ట్రకు వలసవచ్చారు. కైలాస్ తండ్రి కిషన్ రావ్ కాంగ్రెస్ కోశాధికారిగా పనిచేశారు. కైలాస్ మేనమామ బీజేపీ తరఫున ప్రజాక్షేత్రంలో ఉండడంతో కైలాస్ చిన్ననాటి నుంచి రాజకీయాలపై ఆసక్తిపెరిగింది. కాలేజీ రోజుల నుంచి రాజకీయా ల్లో క్రియాశీలంగా ఉన్నారు. 1986లో మరాఠ్వాడా యూనివర్సిటీ సెనెటర్‌గా గెలుపొందిన ఆయన 1991లో జాల్నా కౌన్సిలర్‌గా, 1992లో కౌన్సిల్ చైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. తర్వాత కైలాస్‌ను కాంగ్రెస్ అధిష్టానం 1999లో జాల్నా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో ఆయన గెలిచారు. 2009లో కాంగ్రెస్ టిక్కెట్‌పై 20 వేల మెజార్టీతో శివసేన అభ్యర్థి అంబేకర్ భాస్కర్‌పై గెలిచారు. 2014లో ఓడారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జాల్నా నియోజకవర్గం నుంచి గెలిచారు. జాల్నా నియోజకవర్గంలో ఆయన అనేక అభివద్ది పనులు చేశారు. వీటిలో ప్రధానంగా విద్యుత్ సబ్‌స్టేషన్, ఎంఐడీసీలో రూ.120 కోట్లతో విత్తనాల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేశారు. దీంతో అనేక మంది యువతకు ఉపాధి కల్పించా రు. తెలుగు భాషపై ఉన్న అభిమానంతో కైలాస్ కుటుంబీకులు తెలుగు పాఠశాల స్థాపనకు కృషి చేశారు. కాలక్రమేణా తెలుగు విద్యార్థులు ఇంగ్లీష్ వైపుకు మొగ్గుచూపడంతో తెలుగు పాఠశాలలను మూసేయాల్సి వచ్చింది. -
నేడు ఎన్సీపీ నేత పాటిల్ కాంగ్రెస్‌లో చేరిక
యవత్మాల్ : జిల్లాలో గట్టి పట్టున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడు ఉత్తమ్రావ్ పాటిల్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన సొంత గ్రామమైన అర్ని తాలూకా లోనీలో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో ఆయన తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని మంగళవారం యవత్మాల్ జిల్లా కేంద్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (వైడీసీసీ) చైర్మన్, ఉత్తమ్రావ్ పాటిల్ కుమారుడైన మనీష్ పాటిల్ తెలిపారు. జిల్లాపరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రఫుల్ల మన్కర్ కూడా పాటిల్‌తోపాటు కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు. డిప్యూటీ స్పీకర్ వసంత్ పర్కే, మంత్రి శివాజీరావ్ మోఘే సూచన మేరకు వారం కిందట సీఎం పృథ్వీరాజ్ చవాన్‌ను కలిసి తాము కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపామని మనీష్ వివరించారు. ఇంతకుముందు, మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ పాటిల్ దియోసర్కార్ సైతం పార్టీని వీడి శివసేనలో చేరిన విషయం తెలిసిందే. ఎన్సీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సందీప్ బజోరియా తిరిగి అక్కడ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టారు. ఆయనపై అసంతృప్తితో జిల్లాలోని చాలామంది ఎన్సీపీ నాయకులు పక్క పార్టీల్లో చేరిపోతున్నారు. -
రాష్ట్ర కాంగ్రెస్ ప్రక్షాళన
ముఖ్యమంత్రి, ఎంపీసీసీ అధ్యక్షుడిని మార్చే అవకాశం సీఎం రేసులో షిండే, ఎంపీసీసీ అధ్యక్షుడి రేసులో అశోక్‌చవాన్ సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తే చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులోభాగంగానే ముఖ్యమంత్రి, ఎంపీసీసీ అధ్యక్షుడిని మార్చాలనే అభిప్రాయంలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు కాగానే సీఎంను తప్పించే అవకాశాలున్నట్లు సమాచారం. దీంతో ఎన్నికలకు ముందే సీఎం పృథ్వీరాజ్ చవాన్ గద్దె దిగక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) అధ్యక్షుడిని కూడా మారుస్తారని, ఈ రెండు స్థానాలను అనుభవం ఉన్న నేతలకు అప్పగిస్తారని చెబుతున్నారు. పవార్‌తో చర్చించిన సోనియా..? ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, సోనియాగాంధీతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో ప్రజాస్వామ్య కూటమిని అధికారంలోకి తేవడానికి ఏం చేయాలనే విషయమై మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఈ సమయంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎంపీసీసీ అధ్యక్షుడిని మారిస్తే ఫలితాలు ఎలా ఉంటాయనే విషయమై కూడా సోనియా పవార్‌ను అడిగినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలోనే ఈ మార్పులు జరగడం ఖాయమని చెబుతున్నారు. మొదలైన ఫైరవీలు... ముఖ్యమంత్రిని, ఎంపీసీసీ అధ్యక్షుడిని మార్చనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పదవులను దక్కించుకునేందుకు రాష్ట్ర నేతలు అప్పుడే ఫైరవీలు మొదలు పెట్టినట్లు తెలిసింది. ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో సన్నిహితంగా మెలిగే వ్యక్తులతోపదవుల కోసం రాయబారాలు సాగిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. రేసులో ఎవరెవరు? ఒకవేళ అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చాలని నిర్ణయం తీసుకుంటే ఆ స్థానంలో ఎవరిని కూర్చోబెడుతుందన్న ప్రశ్నలకు పార్టీ నేతల నుంచి హర్షవర్ధన్ పాటిల్, సుశీల్‌కుమార్ షిండే, రాధాకృష్ణ విఖేపాటిల్ తదితరుల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరంతా లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైనా పార్టీ వీరివైపే మొగ్గు చూపే అవకాశముందంటున్నారు. కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు అధిష్టానం తొలి ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని కూడా చెబుతున్నారు. ఇదిలావుండగా మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను మార్చాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లయితే ఈ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను కూర్చుండ బెట్టే సూచనలు మెండుగా ఉన్నాయంటున్నారు. అయితే ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ సీఎం పదవిని పోగొట్టుకున్న అశోక్ చవాన్‌ను పెయిడ్ న్యూస్ కేసు వెంటాడుతోంది. దీనిపై విచారణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 20లోపు విచారణ పూర్తిచేసి నిర్ణయం ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో 20 తర్వాత ఒకవేళ అశోక్ చవాన్‌కు క్లీన్ చిట్ లభిస్తే పీసీసీ అధ్యక్ష పదవి పగ్గాలు ఆయనకే కట్టబెట్టవచ్చని చెబుతున్నారు.